ఆనందానికి అసలు రూపం
ఏది సత్యమో... ఏది నిత్యమో... అదే నిజమైన ఆనందం. నిజమైన సుఖం. ఈ స్థితినే గీతలో శ్రీకృష్ణుడు దుఃఖసుఖాత్యయం అని నిర్వచిస్తాడు. అంటే దుఃఖానికి, సుఖానికి అతీతమైన స్థితి అని అర్థం. ఇంద్రియాల వల్ల వచ్చే హాయి కలిగినట్టే కలిగి అలాగే పోతుంది. అది ఎంత కలిగిందో అంతా ఉండదు. సున్నా అవుతుంది. చివరకు దుఃఖంగా మారిపోవచ్చు కూడా.. ఒక రేఖకు ఒక చివర సుఖమైతే మరో చివర దుఃఖం ఉంటుంది.రెండింటి మధ్య బిందువు దగ్గర అది సుఖ, దుఃఖాలను దాటిన స్థితి అవుతుంది. ఇక్కడ ఏ అలజడీ ఉండదు. ఇదే నిజమైన ఆనందం... దీన్నే శివం అని పిలుస్తారు. అందుకే స్వచ్ఛమైన ఆనందానికి ఒక రూపం ఊహిస్తే అదే శివ స్వరూపం. సుఖదుఃఖాల మధ్య బిందువుకు ఎలా చేరుకోవాలి? అనే ప్రశ్నకూ శివ స్వరూపమే సమాధానం చెబుతుంది. శివుడు యోగ ముద్రలో కూర్చోవడమే కాదు. ఆయన మెడ చుట్టూ పాము కూడా చుట్టుకుని ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అదరకుండా, బెదరకుండా, కదలకుండా యోగ ముద్రలో కూర్చోవడమే ఆనందానికి¨ మార్గమని శివుడు తన రూపంతో మనకు ఉపదేశిస్తున్నాడు. చుట్టూ ఎన్ని కష్టాల పాములు చుట్టుకున్నా క్షోభ పడకుండా, భయపడకుండా ఉండడమే ఆనందమంటే..
సుదర్శన చక్రం శివుడి చేతిలోనూ...
విష్ణువు ఆయుధం సుదర్శన చక్రం. మరి శివుడు కూడా సుదర్శన చక్రాన్ని ధరించాడా? అవునంటుంది శివ పురాణం. పరమేశ్వరుడి అవతారాల్లో ఒకటైన వామదేవ మూర్తిది విష్ణు స్వరూపం. ఆయన చేతిలో శంకు, చక్రాలు కూడా ఉంటాయి. శివకేశవ ఏకత్వాన్ని రూఢి చేస్తూ ‘శివాయ విష్ణు రూపాయ... శివ రూపాయ విష్ణవే’ అనే మంత్రభాగం ఉండనే ఉంది. ఇది కాకుండా ఉపమన్యు మహర్షి శివుడు తనకు దర్శనమిచ్చిన అవతారంలో చేతిలో సుదర్శన చక్రం ఉందని చెబుతారు. ఇంకా రుద్రుడి చేతిలో ఓ మహత్తరమైన ఆయుధం ఉంటుంది. అదే త్రిశూలం. దానిని విజయం అని పిలుస్తారు. త్రిశూలాన్ని ధరించినందునే శివుడిని శూలి అని అంటారు. భూమిని బద్దలుకొట్టి, సముద్రాలను ఎండగట్టి, నక్షత్ర సమూహాలను కూల్చేసే శక్తి ఈ ఆయుధానికి ఉంటుందని చెబుతారు. ఈ శూలం మూడు కొనలు కనుబొమల్లా, నిలువెత్తున ఉండి భయంకరంగా కనిపిస్తుంది. అలాగే శివుడి చేతిలో గండ్రగొడ్డలి ఒకటి ఉంటుంది. వీటితో పాటు సుదర్శన చక్రం, వజ్రాయుధం, అమ్ములపొదిలో పినాకం అనే ధనుస్సు, కత్తి, పాశం, అంకుశం కూడా ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి