13, ఏప్రిల్ 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *శివరాత్రీ..స్వామివారి సోదరులు..*


"బాగున్నావా..?" అనే పిలుపుతో తలయెత్తి చూసాను..శ్రీ రాజయ్యగారు..మొగిలిచెర్ల గ్రామ శివారులో ఆశ్రమం నిర్మించుకొని..కఠోరతపస్సు ఆచరించి..హఠయోగం ప్రక్రియ తో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత కు తోడబుట్టిన వారు..శ్రీ స్వామివారికి అన్నయ్యగారైన రాజయ్యగారు..నేను కూర్చునే టేబుల్ ప్రక్కన నిలబడి వున్నారు..గబుక్కున లేచి నిలుచున్నాను.."ఎప్పుడొచ్చారు రాజయ్య గారూ..కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు..మీరు ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాల కాలం గడిచి పోయింది..ఆరోగ్యం ఎలా ఉంది..?..మీ సామాన్లు ఎక్కడ?.." అని గబ గబా అడిగేశాను..ఒక్కక్షణం ఆగమన్నట్టు సైగ చేశారు..కుర్చీ లో కూర్చోమని చెప్పాను..నా ప్రక్కనే కూర్చున్నారు.."మధ్యాహ్నం వచ్చాను..అదిగో ఆ శెట్టిగారి సత్రం లో సంచీ పెట్టాను..ఇక్కడికి వచ్చాను..నువ్వు అప్పుడే భోజనానికి పొయ్యావని మీ సిబ్బంది చెప్పారు..నేను కూడా అన్నదానసత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి..ఆ శెట్టిగారి సత్రం లోనే కొంచెం సేపు పడుకొని..లేచి ఇటు వచ్చాను.." అన్నారు..మా సిబ్బందికి చెప్పి ఒక రూమ్ కేటాయించాను..


మొన్న శివరాత్రికి రెండురోజుల ముందు శ్రీ రాజయ్యగారు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..మహాశివరాత్రికి వచ్చే భక్తుల కు సౌకర్యాలు..స్వామివారి మందిరం లో క్యూ లైన్ల ఏర్పాట్లు..వచ్చేపోయే అధికారుల హడావిడులు..వీటి మధ్యలో ఉన్నాము..రాజయ్య గారు అన్నీ గమనిస్తూ..స్వామివారి మందిరం లో అటూ ఇటూ తిరుగుతూ వున్నారు..మధ్య మధ్య లో నా వద్దకు వచ్చి.."ఇంత ఏర్పాట్లు చేస్తున్నారు..ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు..ఇందాక RTC వారిని అడిగితే..కావలి, కందుకూరు..రెండు డిపో ల నుంచీ సుమారు 80 బస్సులు తిరుగుతాయి అని చెప్పారు..ఓ పాతిక వేల మంది వస్తారా?.."అని ఒకసారి..

" శివరాత్రికి ముందు రోజు నుంచీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారట..దాదాపు 15 వేల మందికి అని వంటవాళ్ళు చెప్పారు.." అని  మరోసారి కుతూహలం తో నన్ను అడుగుతున్నారు.."పాతిక వేల మంది కాదు..సుమారు నలభై, యాభై వేల మంది వస్తారని అంచనా తో ఉన్నాము.." అన్నాను..ఒక్కక్షణం ఆశ్చర్యం గా చూసి.."మా కుటుంబం లో పుట్టాడు అని కాదు కానీ..మహానుభావుడు ఇంతమందిని రప్పించుకుంటున్నాడు..ఈసారి ఈ శివరాత్రి పూర్తి అయ్యేదాకా ఇక్కడే ఉంటాను.." అన్నారు..


మహాశివరాత్రి రోజు రాజయ్య గారు ఎక్కువ సేపు స్వామివారి మందిరం లొనే గడిపారు..ఆరోజు మధ్యాహ్నం స్వామివారి తమ్ముడు శ్రీ పద్మయ్య నాయుడు కూడా తమ కుమారుడి తో సహా వచ్చారు..శ్రీ పద్మయ్యనాయుడు గారు స్వామివారి సమాధి దర్శించుకొని.."ఏర్పాట్లు బాగున్నాయి ప్రసాద్..ఈరోజు ఇక్కడ ఉండాలని ఉంది గానీ..త్వరగా వెళ్ళాలి..ఎన్ని పనులున్నా..శివరాత్రికి..స్వామి ఆరాధనకూ..నేను ఖచ్చితంగా వస్తానని తెలుసుకదా..ఆ మహానుభావుడి దయవల్ల నేను, నా బిడ్డలూ అందరమూ క్షేమంగా ఉన్నాము..అది మర్చిపోలేను..నువ్వు బాగా కష్టపడుతున్నావు.." అన్నారు..కొద్దిసేపు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ వున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు మా అందరికీ వెళ్ళొస్తానని చెప్పి..మరొక్కసారి స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..


మహాశివరాత్రి అయిపోయిన తెల్లవారి శనివారం నాడు శ్రీ రాజయ్య గారు నా వద్దకు వచ్చి.."ఒక్క పొరపాటు కూడా జరుగకుండా..ఎటువంటి చిన్న అపశృతి కూడా లేకుండా..ఈ మొత్తం ఉత్సవం సవ్యంగా జరిగిపోయింది..ఈరోజు శనివారం కదా రాత్రికి పల్లకీసేవ ఉన్నదా?.." అన్నారు.."యధావిధిగా ఉంది.." అన్నాను..ఆరోజు కూడా స్వామివారి మందిరం లోనే ఎక్కువభాగం గడిపారు రాజయ్య గారు..పల్లకీసేవ మొత్తం ఆసక్తిగా చూసారు..రాజయ్యగారు చాలా ఉద్వేగం పొందారు..స్వామివారి ని తమ్ముడు గా భావించి కలిసి ఉన్న రోజులు..స్వామివారు సన్యాసిగా మారిన తరువాత తమతో ప్రవర్తించిన తీరు..స్వామివారు సిద్ధిపొందిన తరువాత నుండి ఇప్పటి వరకూ మొగిలిచెర్ల లోని మందిరం ఒక క్షేత్రం గా మారేవరకూ వచ్చిన మార్పులూ..అన్నీ గుర్తుకు తెచ్చుకున్నారు..తాను స్వామివారికి అన్నయ్య ను అనే భావన విడనాడి..ఒక సిద్ధపురుషుడి సమాధి ని దర్శించుకుంటున్నాము అనే భావనలో వున్నారు..అటువంటి మహానుభావుడికి తాను సోదరుడిని కావడం తన భాగ్యం గా చెప్పుకున్నారు..


"వయసు మీద పడి పోతున్నది..ఆరోగ్యము అంతంత మాత్రమే..కానీ..ఈ నాలుగు రోజులూ..ఇక్కడ జరిగిన శివరాత్రి ఉత్సవమూ..పల్లకీసేవ..ఆదివారం నాటి విశేష హారతులూ..అంతకుమించి స్వామివారి సమాధి దర్శనం కొరకు దూరప్రాంతాల నుంచి వస్తున్న ఈ భక్తులూ..అన్నీ చూసిన తరువాత..అతి త్వరలో ఇది ఒక ప్రసిద్ధ క్షేత్రం గా మారుతుందనే నమ్మకం కలిగిందయ్యా..నాకు ఓపిక ఇచ్చినంతకాలం తరచూ ఇక్కడికి వస్తాను ప్రసాదూ..నాకోసం నువ్వేమీ పెద్ద ఏర్పాట్లు చేయొద్దు..అంతగా అయితే..అందరితో పాటు నేనుకూడా స్వామివారి సన్నిధి లోనే ఉంటాను.." అని చెప్పారు..


శ్రీ స్వామివారి సోదరులు రావడం..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లడం..మాకు అభినందన పూర్వక ఆశీస్సులు అందచేయడం..మాకు కూడా ఒక మంచి అనుభూతిని మిగిల్చింది..ఇది కూడా స్వామివారి ఆశీర్వాదమే అని మా సిబ్బందీ..మా దంపతులమూ అనుకున్నాము..ఇక మహాశివరాత్రి ఉత్సవం మొత్తం ఏ ఇబ్బందీ లేకుండా జరగడానికి కారణం..ముమ్మాటికీ స్వామివారే..మేము కేవలం నిమిత్తమాత్రులం..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: