28, ఏప్రిల్ 2021, బుధవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ స్వామివారి కోరిక...*


*(పదకొండవ రోజు)*


శ్రీధరరావు గారితో కేశవులు గారికి పరిచయం ఏర్పడ్డాక..శ్రీ స్వామివారి గురించి ఇద్దరూతరచూ ముచ్చటించుకునే వారు..కాలం గడచిపోతోంది..

శ్రీ స్వామివారి గురించిన ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏమూలో వున్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి..ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని ఎంతో ఆనందపడ్డారు..నిజానికి శ్రీధరరావు గారు మొదటినుంచీ శ్రీ స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదని..ఒకానొక సిద్ధపురుషుడు ఈ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూ వున్నారు..అదే నిజమయ్యింది..శ్రీ స్వామివారి పరిచయం తరువాత ఆ దంపతుల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి..


శ్రీధరరావు, ప్రభావతి దంపతులు యధావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్లి వస్తున్నారు..మాలకొండ వెళ్లిన ప్రతిసారీ శ్రీ స్వామివారిని కలిసిరావడం వారి పర్యటనలో ఒక భాగం అయిపోయింది..శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చేసమయానికి కొద్దిగా అటూ ఇటుగా..పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు..ఒక్కొక్కసారి ఆయన తపస్సాధన లో మునిగిపోయివుంటే..శ్రీధరరావు గారు ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురుచూసి..తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు..


అలా ఒక శనివారం సాయంత్రం నాలుగు, ఐదు గంటల ప్రాంతంలో..శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు..కొద్దిసేపటికే శ్రీ స్వామివారు శివాలయం వద్దనుంచి మెల్లిగా దిగివచ్చి..పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకుని..వీరిద్దరి ఎదురుగ్గా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు..ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది..చల్లటి చిరునవ్వు..ఆప్యాయత ఉట్టిపడే చూపు..ఉదయం నుంచీ మాలకొండ లక్ష్మీ నృసింహుడి దర్శనం.. ఆ తరువాత కొండ శిఖరం పై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం..ఇవన్నీ ఎక్కి దిగి..మళ్లీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన బడలిక అంతా..శ్రీ స్వామి వారి ప్రసన్న వదనం చూడగానే మటుమాయం అయింది..


"ధ్యానం లో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా..వెంటనే లేచి ఇలా వచ్చేసాను..శ్రీధరరావు గారూ మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి..అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది..చెప్పమంటారా?.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."చెప్పండి.." అన్నారు..


"ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి కొండమీద..ఈ శివ పార్వతుల సమక్షం లో నా తపస్సాధన పూర్తి అయింది..త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని...అందులో కొరవ సాధన చేసి..మోక్ష ప్రాప్తిని పొందాలి..ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావా!ఈ..అది మీరు ఏర్పాటు చేయాలి.." అన్నారు గంభీరంగా..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..వాళ్ళిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది..మళ్లీ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు..ప్రభావతి గారు ఏదో అడుగబోయేంతలో శ్రీధరరావు గారు కల్పించుకుని.."మీరు త్వరపడకండి స్వామీ..మేము ఇంటికెళ్లి ఆలోచించుకుని మళ్లీ మిమ్మల్ని కలుస్తాము..సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము..మనం కూర్చుని కూలంకషంగా చర్చించుకుని ఆపై ఒక నిర్ణయానికి వద్దాము.." అన్నారు..


శ్రీధరరావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు.."మీరూ ఆలోచించండి..కానీ ఈ క్షేత్రం లో నా సాధన పూర్తి కావొచ్చింది..ఇక ఇక్కడ ఎక్కువ కాలం వుండే పరిస్థితి లేదు..మీరు చెప్పినట్లే మళ్లీ త్వరలో..( త్వరలో అన్నమాట శ్రీ స్వామివారు నొక్కి చెప్పారు..) ఈ సంకల్పం నెరవేరుతుంది..ఇప్పటికే పొద్దు కూకుతోంది..మీరు మళ్లీ మొగలిచెర్ల వెళ్ళాలి..ఇక బైలుదేరండి.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామి వారికి నమస్కారం చేసి, పార్వతీదేవి మఠం వద్దనుండి మెట్లు దిగి, తమ గూడు బండిలో కూర్చుని మొగలిచెర్లకు పయనం అయ్యారు..


అప్పటిదాకా ఓపిక పట్టివున్న ప్రభావతి గారు..ఇక ఆగలేక పోయారు.."శ్రీవారూ..ఇదేమిటి?..ఈయన ఈ కోరిక కోరాడు?..పాపం కేశవులు గారు ఎంతో ఆశపెట్టుకుని ఆశ్రమం కొరకు  ఇస్తానన్న భూమి వద్దన్నారు..మనలను మాత్రం తానే అడిగారు..ఈ క్షేత్రం లో చేసే సాధన కన్నా..జన బాహుళ్యం లోకి వచ్చి, ఆశ్రమం కట్టుకొని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది..సాధారణ మనుషుల మధ్యకు వస్తే..ఇతరత్రా కోరికలు పట్టవా?..మామూలు ప్రలోభాలకు లొంగిపోరా?.." అని అడిగారు..శ్రీధరరావు గారు మాత్రం నిశ్చింతగా.."నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతావనే..నేను ముందుగా గ్రహించి..నేనే స్వామివారితో మళ్లీ చర్చిద్దామని చెప్పాను ప్రభావతీ..కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో తెలీదు..అన్నీ పరిశీలిద్దాము..చూద్దాం..ఏం జరుగుతుందో.." అన్నారు..ఈ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు..ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి..


శ్రీ స్వామివారి వివరణ... రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్: 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: