9, ఏప్రిల్ 2021, శుక్రవారం

మొగలిచెర్ల

 *ఒక తండ్రి తపన..*


"శ్రీపాద శ్రీవల్లభుల ఆలయం కడుతున్నారని విన్నాను..ఒక దిగంబర అవధూత దత్తాత్రేయుడి కొఱకు తపస్సు చేసి..కపాలమోక్షం ద్వారా ఆ పరమాత్మలో ఐక్యం చెందిన అతి పవిత్ర స్థలంలో..త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడికి ఒక చిన్న మందిరం ఏర్పాటు చేశారు..అలానే ఆ దత్తాత్రేయుడి ప్రథమ అవతారంగా భావించే శ్రీపాదశ్రీవల్లభుడికీ గుడి ఏర్పాటు చేస్తున్నారు..దత్తావరంగా కొలిచే శ్రీ సాయిబాబా మందిరం కూడా ఉన్నది..ఒక సంపూర్ణ దత్తక్షేత్రం గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు..చాలా సంతోషం గా ఉంది నాయనా.." అని నాతో అన్నారు..వారిని ఇంతకుముందు ఎన్నడూ నేను చూడలేదు..నాతో బాగా పరిచయం ఉన్న వారిలాగా మాట్లాడారు..నా ప్రక్కనే కూర్చున్నారు..


"అయ్యా..మీరెవరో గుర్తుకురావడం లేదు..మీ పేరు తెలుపుతారా?..ఇంతకుముందు ఈ క్షేత్రానికి ఎప్పుడైనా వచ్చారా?.." అని అడిగాను..నా వైపు కొద్దిసేపు పరిశీలనగా చూసి.."నా పేరు వాసుదేవరావు..సుమారు ముప్పై ఐదేళ్ల ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను..అప్పుడు మీ నాన్నగారు ఈ మందిరాన్ని నిర్వహిస్తున్నారు..అప్పట్లో ఇక్కడ ఈ స్వామివారి సమాధి మందిరం ఒక్కటే ఉండేది..ముందువైపు చిన్న వరండా..ఆ ముందు పందిరి ఉండేది..ఒకరకంగా చెప్పాలంటే నేను మీకు దూరపు బంధువును కూడా..మీ నాన్న అమ్మ గార్లు బాగా పరిచయం..ఆరోజుల్లో శుభకార్యాలలో కలుస్తూ వుండేవాళ్ళము..ఆ తరువాత నేను ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాను..కొన్నాళ్ళు ఉత్తరాల ద్వారా పలకరింపులు ఉండేవి..మీ నాన్నగారు అనారోగ్యం పాలైన తరువాత అవికూడా లేవు..మొన్న మా ఊరుకు వచ్చాను..ఇంతదూరం వచ్చాను కదా అని ఇక్కడకు వచ్చాను..నేను మొదటినుంచీ దత్త భక్తుడిని..ఇక్కడకు రాగానే ఒక్కసారిగా  ఒళ్ళు పులకరించింది..చాలా సంతోషం వేసింది.." అన్నారు.."స్వామివారి సమాధిని దర్శించుకున్నారా?.." అని అడిగాను.."ఇంకా లేదు.." అన్నారు.."లోపలికి వెళ్లి..దర్శించుకొని రండి.." అన్నాను..


"ముందు మీతో మాట్లాడాలి.." అన్నారు.."నన్ను మీరు..మీరు..అని పిలవద్దు..మా తండ్రి గారి వయసు మీది.." అన్నాను.."అలాగే నాయనా.." అన్నారు.."ఏదో మాట్లాడాలి అన్నారు కదా.." అన్నాను.. ఒక్కసారిగా గంభీరంగా మారిపోయారు.."ఈ క్షేత్రం గురించి నువ్వు సోషల్ మీడియా లో రాస్తున్న అనుభవాలు మా పెద్ద అమ్మాయి ప్రతిరోజూ చదువుతున్నది..నాకూ పంపుతుంది..నేనూ చదువుతున్నాను..ఒక సమస్య తో బాధపడుతున్నాను..నాకు ఇద్దరు ఆడపిల్లలు..ఇద్దరికీ వివాహాలు చేసాను..ఇప్పుడు సమస్య రెండో అమ్మాయిది..ఒక్కొక్కసారి తన ప్రవర్తన విపరీతంగా ఉంటున్నది..పిల్లల మీదా..భర్త మీదా పెద్దగా కేకలు వేస్తూ..పిచ్చిదానిలా మారిపోతుంది..మళ్లీ కొంతసేపటికి మామూలుగ ఉంటుంది..తాను ఇంతకు ముందు అలా ప్రవర్తించానే అని ఏడుస్తుంది..ఇద్దరు ముగ్గురు డాక్టర్ల కు చూపించాము..ఏదో డిప్రెషన్ అన్నారు..మందులు ఇచ్చారు..తగ్గలేదు..ఏ దిక్కూ తోచలేదు..రోజూ ఈ  స్వామివారి గురించి చదువుతున్నాను కదా..ఒక్కసారి ఇక్కడ మొక్కుకొని వెళదామని వచ్చాను.." అన్నారు.."స్వామివారి పాదుకుల వద్ద మనస్ఫూర్తిగా మొక్కుకోండి..ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకొని రండి.." అని చెప్పాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..ప్రదక్షిణ చేసి..నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకలకు శిరస్సు ఆనించి ప్రణామం చేసుకొని ఇవతలకు వచ్చారు..స్వామివారి విభూతి గంధం వారికి ఇచ్చి..అమ్మాయికి వాడమని చెప్పాను..అవి భక్తిగా కళ్లకద్దుకొని తీసుకొని..మరి కొద్దిసేపు వుండి వెళ్లిపోయారు..


పదిరోజుల తరువాత వాసుదేవరావుగారు అత్యంత ఆనందంగా ఫోన్ చేసి.."నాయనా ప్రసాద్..స్వామివారు సత్యంగా ఉన్నారయ్యా..అమ్మాయికి ఈ వారం నుంచీ ఎటువంటి విపరీతపు పోకడలూ లేవు..నువ్వు ఇచ్చిన విభూతి గంధం బొట్టులాగా పెట్టి..పడుకునేటప్పుడు తలక్రింద కూడా పెట్టించాను..ఏ గొడవా లేదు..హాయిగా ఉంది..మరో పదిరోజుల్లో అమ్మాయి అల్లుడిని తీసుకొని వస్తున్నాను..అక్కడే నిద్ర చేస్తాము..ఇన్నాళ్ల మా వేదన తీరింది.." అన్నారు..అనుకున్న విధంగానే అల్లుడిని కూతురిని ఒక శనివారం తీసుకొని వచ్చి..స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..ఆ ప్రక్కరోజు ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లారు..శనివారం నాటి రాత్రి అన్నదానం వ్యయం అంతా వారే భరించారు..


"నాయనా..ఇక్కడ స్వామివారి తపో శక్తి నిక్షిప్తమై ఉన్నది..అది కొన్ని తరాలపాటు ఉంటుంది అని మీ తల్లిదండ్రులు అప్పట్లో నాతో చెప్పేవారు..ఇన్నాళ్లకు నాకూ అనుభవానికి వచ్చింది.." అని వాసుదేవరావు గారు పదే పదే చెప్పారు..ఆ పలుకులు అక్షర సత్యాలని మాకూ బోధపడుతూనే ఉన్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: