3, మే 2021, సోమవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*స్థల నిర్ణయానికి ప్రయాణ సన్నాహం..*


*(పదహారవ రోజు)*


శ్రీధరరావు ప్రభావతి గార్లు మొగలిచెర్ల చేరుకున్నారు కానీ..వాళ్ళ మనసులో శ్రీ స్వామివారి ఆదేశమే సుడులు తిరుగుతూ ఉంది.."జరిగేదేదో జరగక మానదు.."అనే మాట ఇతరులతో అనునయంగా చెప్పడానికి బాగానే ఉంటుంది..తనకు అనుభవంలోకి  వచ్చినప్పుడు మాత్రం స్థిమితంగా వుండటం చాలా కష్టమైన విషయం..అదే అనుభవానికి వస్తున్నదా దంపతులకు..అటువైపు శ్రీ స్వామివారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లుగా వున్నారు..మాలకొండలో ఇక వుండటం కుదరదు అని కూడా చెప్పేసారు..మీదే నిర్ణయం అని చెప్పేసారు..


ఆ మరుసటి శనివారం నాడే శ్రీధరరావు దంపతులు మాలకొండ వెళ్లారు..నేరుగా శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి దర్శనం చేసుకొని ఇతర పనులు చూసుకుందామని దంపతులిద్దరూ గర్భాలయంలో ప్రవేశించారు..శ్రీ నరసింహ స్వామి వారిని చూసిన ప్రభావతి గారికి, ఆ లక్ష్మీనారసింహుడు తృళ్లి తృళ్లి నవ్వుతున్నట్లు..తాము నిలుచున్న గర్భగుడి ఊగుతున్నట్లు అనుభూతి చెందసాగారు..గట్టిగా కళ్ళుమూసుకుని..


"ఉగ్రం వీరం మహావిష్ణుం

 జ్వలంతమ్ సర్వతోముఖం

 నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్మృత్యు నమామ్యహం౹౹" 


అని మనసులో చెప్పుకొని..కళ్ళుతెరచారు.. ఒక కాంతిపుంజం శ్రీ లక్ష్మీనృసింహుడి విగ్రహం లోంచి..తామిద్దరినీ తాకుతూ..గర్భాలయం దాటి వెలుపలికి వెళ్లిపోయినట్లు తోచింది..ప్రభావతి గారు భ్రమ పడలేదు..సాక్షాత్తూ అనుభూతి చెందారు..


ప్రక్కనే ఉన్న శ్రీధరరావు గారిని పట్టుకుని..మెల్లిగా.."శ్రీవారూ..ఒక కాంతిరేఖ స్వామివారిలోంచి వచ్చి మనలను తాకుతూ బైటకు వెళ్ళింది..నాకెందుకో ఆ స్వామి అంశ అనిపిస్తోంది.." అన్నారు..


"ప్రభావతీ!..మనం గుడిలో ఉన్నాం..నీకు నరసింహ స్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలిగివుంటుంది..పిచ్చి పిచ్చిగా మాట్లాడకు!.."అని కొద్దిగా మందలింపు గా అన్నారు..కానీ ప్రభావతి గారికి ఆ అనుభూతి వదల్లేదు.."ఒక మహాద్భుత తేజోపుంజమది.. స్పష్టంగా చూసాను నేను! ఇది భ్రమ కాదు!!..ఈ సంకేతం దేనికి?.." రకరకాల ఆలోచనలతో ఆలయం నుంచి వెలుపలకు వచ్చారావిడ..


అక్కడ ప్రభావతి గారి చిన్నత్త గారు..(శ్రీధరరావు గారి తల్లీగారి చెల్లెలు..కౌశల్యమ్మ గారు..) కలిశారు..అలాగే మరో బంధువైన రమణయ్య గారూ వచ్చివున్నారు..రమణయ్య గారిది మొగలిచెర్ల కు దగ్గరలో గల పొట్టిపల్లె గ్రామం..తాను మొగలిచెర్ల సరిహద్దుల దాకా ఈ దంపతులతో కలసి వచ్చి, అక్కడినుండి పొట్టిపల్లె వెళతానని చెప్పారు.. చిన్నత్త గారైన కౌశల్యమ్మ గారు, తన అక్కయ్య గారైన శ్రీధరరావు గారి తల్లిగారిని చూడటానికి మొగలిచెర్ల వస్తామన్నారు..సరే..అందరమూ ఎద్దుల బండిలో వెళదాము..ఒకసారి శ్రీ స్వామివారిని దర్శించుకొని..అటునుంచి అటే వెళదాము అని నిర్ణయించుకొని..అందరూ శ్రీ స్వామివారున్న పార్వతీదేవి మఠం వద్దకు వచ్చారు..


సరిగ్గా అదే సమయంలో శ్రీ స్వామివారు దిగంబరంగా కూర్చుని, ఒకప్రక్క జింకచర్మం, దండ కమండలాలను పెట్టుకొని..కుడి నాసిక, ఎడమ నాసిక లను వేళ్ళతో మూస్తూ.. శ్వాస క్రమాన్ని గమనిస్తూ.. వీళ్ళను చూసి చిన్నపిల్లాడిలా సంతోషంతో..నిలబడి.."మీరొస్తున్నారని ఆదేశం వచ్చింది..మీకోసమే దిగివచ్చి ఇక్కడున్నాను..పదండి!..మీతోపాటు నేనూ మీ గ్రామానికి వస్తున్నాను.." అన్నారు..


ఒక్కసారిగా ఖంగుతున్నారు శ్రీధరరావు ప్రభావతి గార్లు..వారిద్దరూ శ్రీ స్వామివారిని తమ వెంట మొగలిచెర్ల కు తీసుకుపోవడానికి మానసికంగా సిద్ధంగా లేరు..పైగా ఇప్పటికిప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో..తెలీదు..ఆ ప్రక్కరోజే కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనుల పరిశీలనకు వస్తామని చెప్పివున్నారు..ఆ ఏర్పాట్లూ చూడాలి..తమతో పాటు ప్రస్తుతం మరో ఇద్దరు కూడా వస్తున్నారు..ఇంతమంది ఆ బండిలో ఎలా?..ఆలోచిస్తున్నారు..


శ్రీధరరావు గారు గంభీరంగా.."మాతో పాటు ఆ బండిలో మీరు రాగలరా?.." అన్నారు..ప్రభావతి గారికి చిరాకేసింది..ఏమిటీ మనిషి?..అనుకుంటూ వున్నారు..


శ్రీ స్వామివారు పెద్దగా నవ్వుతూ.."నేనూ పుట్టింది రైతు కుటుంబంలోనే..ఎద్దులూ..బండీ.. అన్నీ అలవాటే!..ఏం పర్వాలేదు..అమ్మకు సందేహంగా ఉంది శ్రీధరరావు గారూ..అది ఆలోచించండి.." అన్నారు..


ప్రభావతి గారు ఏదో చెప్పబోయేలోపలే..అప్పటిదాకా నవ్వుతూ ఉన్న శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయి.. .."అమ్మా..!." అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు..


శ్రీ స్వామివారి బోధ..ఆపై మొగలిచెర్ల ప్రయాణపు అనుభవమూ...రేపు...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: