5, జూన్ 2021, శనివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పులిచర్మం.. స్వామివారి లీల..రెండవభాగం..*


*(నలభై తొమ్మిదవ రోజు)*


కందుకూరు నుంచి తన బాబాయి గారింటినుంచి..శ్రీధరరావు గారు వారిస్తున్నా వినకుండా  ప్రభావతి గారు పులిచర్మాన్ని తీసుకొని మొగలిచెర్ల చేరారు..అప్పటికీ ఆవిడ బాబాయి గారు పెద్దరికంగా.."అమ్మాయీ..స్వామివారి తపస్సుకోసం అంటున్నావు కనుక ఈ పులిచర్మాన్ని తీసుకుని వెళ్లి..స్వామివారు పదిరోజులో.. పక్షం రోజులో దీనిమీద కూర్చుని తపస్సు చేసుకోమని..ఆతరువాత మళ్లీ మాకు తీసుకొచ్చి ఇచ్చేయి..శ్రీ స్వామివారు తన తపోసాధనకు ఈ పులిచర్మాన్ని వాడుకున్నారనే తృప్తి మాకూ ఉంటుంది.." అన్నారుకూడా..ఇవేవీ ప్రభావతి గారి మనసుకు పట్టలేదు..


మొగలిచెర్ల చేరిన ప్రక్కరోజు ఉదయాన్నే..గూడు బండి లో పులిచర్మాన్ని పెట్టుకొని ప్రభావతి గారు, శ్రీధరరావు గార్లు శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు..వీళ్ళకోసమే ఎదురు చూస్తున్నట్లుగా శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో నిలుచుని వున్నారు..ప్రభావతి గారు పులిచర్మాన్ని చేతులతో పట్టుకుని గబ గబా శ్రీ స్వామివారి వద్దకు వచ్చి..

"నాయనా..ఇదిగో పులిచర్మం..మొత్తానికి పట్టుకొచ్చాను.. ఇక ఆ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నా కనవసరం..మీకు పులిచర్మం వచ్చేసింది.." అన్నారు..శ్రీధరరావు గారు మాత్రం..ప్రభావతి గారు తొందరపడ్డారనీ..పాపం వాళ్ళెంత నొచ్చుకున్నారో అని శ్రీ స్వామివారితో చెప్పేసారు..


ఇద్దరు చెప్పింది విన్న శ్రీ స్వామివారు..పెద్దగా నవ్వారు..కొద్దిసేపు నవ్వుతూనే వున్నారు..నవ్వడం ఆపి.."ఎంత వెఱ్ఱి తల్లివమ్మా నువ్వు!..పులిచర్మం మహాత్యం గురించి మాటవరసకు మీతో చెప్పాను..మీరు ఇంత ప్రయాస పడతారని అనుకోలేదు..నువ్వెంత బాధపడ్డావో.. పాపం మీ బాబాయి గారి ఇంట్లో వాళ్ళను యెంత బాధపెట్టావో..ఎప్పుడూ ఇటువంటి యాతన పడవద్దు..నాకంతగా కావాలని కోరుకుంటే..నా వద్దకు  రాదా తల్లీ?..ఈ పాటికి వచ్చేస్తూ వుండాలి..తీసుకెళ్లు తల్లీ..దీనిని జాగ్రత్తగా తీసుకెళ్లి..వాళ్ళది వాళ్లకు ఇచ్చేసెయ్యి..మనస్ఫూర్తిగా ఇచ్చిన వస్తువు తీసుకోండి కానీ..ఇలా బలవంతపెట్టి ఎప్పుడూ తీసుకొనిరాకు..నాకోసం శ్రమ పడవద్దు..ఇలా ఇతరుల నుంచి లాక్కోవద్దు..వెనక్కు ఇచ్చేయమ్మా.." అన్నారు..


ప్రభావతి గారు తీవ్రంగా నిరాశపడ్డారు.."అది కాదు నాయనా..ఇంతదూరం తీసుకొచ్చాను.. పోనీ ఓ వారమో.. పదిరోజులో మీరు దీనిమీద తపస్సు కొనసాగించండి..వాళ్లకు తిరిగి ఇచ్చేద్దాము..వాళ్లకూ పుణ్యం ఉంటుంది..ఇంత ఆర్భాటంగా తెచ్చిన నాకూ తృప్తి ఉంటుంది.." అన్నారు..


"వద్దమ్మా..ఒద్దు!..ఇది పట్టుకెళ్లి..వాళ్లకు ఇచ్చేసేయండి.." అన్నారు శ్రీ స్వామివారు దృఢంగా..


ప్రభావతి గారికి కన్నీళ్లు వచ్చాయి..తానింత శ్రమపడీ.. వాళ్ళను శ్రమపెట్టి..తీసుకొని వస్తే..ఇలా జరిగింది..ఇక చేసేదేమీలేదు..శ్రీ స్వామివారు ససేమిరా ఒప్పుకోలేదు..పైగా.."వీలయినంత త్వరగా వాళ్లకు చేర్చండి..వాళ్ళూ బాధపడుతుంటారు.." అన్నారు..అతి కష్టంమీద తన వేదనను లోపలే అణచుకున్నారు.."సరే నాయనా..మీ ఇష్టం.." అన్నారు దుఃఖం తో..


"అమ్మా!..నువ్వు బాధపడకు!..చెప్పాను కదా..నాకు కావాల్సింది నాకు చేరుతుంది..నువ్వేమీ దీనిగురించి ఎక్కువగా ఆలోచించకు..అన్నీ సర్దుకుంటాయి..పట్టుకు పోయి వాళ్ళది వాళ్లకు ఇచ్చేసెయ్యి.." అన్నారు..


శ్రీధరరావు గారు ఆ పులిచర్మాన్ని జాగ్రత్తగా చుట్ట చుట్టి తమ గూడు బండిలో పెట్టేసారు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..మొగలిచెర్ల కు బయలుదేరారు..

తమ ఇంటికి చేరుకునేసరికి..వాళ్లిద్దరూ ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది..ఇంటి వరండాలో శ్రీ చెక్కా కేశవులు గారబ్బాయి కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెతో సహా వీళ్లద్దరి కోసం ఎదురుచూస్తూ కూర్చొని వున్నాడు..


శ్రీ స్వామివారి లీల ఏమిటో ఆ దంపతులకు కొద్దిసేపటి లోనే తెలిసి వచ్చింది..


పులిచర్మం..శ్రీ స్వామివారి లీల..మూడోభాగం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: