7, ఫిబ్రవరి 2022, సోమవారం

ఒకసారి ఆలోచించాలి.

 🙏 పెళ్లి కావలసిన పిల్లల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. కొంతమంది వధూవరుల వయస్సు ఒకసారి చూడండి. దాదాపు సగం జీవితం అయిపోయినా పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఎవరు ? ఒకసారి ఆలోచించండి ? పాతకాలంలో పది మంది ఉన్న ఆడ పిల్ల తండ్రి కూడా ఏనాడు ఇంత మంది సంతానం ఉన్నా తను ఎప్పుడూ భాధపడలేదు. ఇప్పుడు ఒకరిద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు, కష్టపడుతున్నారు .. ఆలోచించండి ?? 


దయచేసి శాఖా పట్టింపులు మానండి. జాతకాల లోతులకు వెళ్లకండి. కొంతవరకు సబబే. ఆ అవరోధాల వలన పిల్లల దృష్టి మరలి కులాంతర వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. అతిగా మూఢ విశ్వాసాలకు పోకుండా ... మంచి సాంప్రదాయం, మంచి గౌరవ మర్యాదలు, విలువలు కలిగిన సంబంధం చూడండి, వారి జీవితాలను ఉద్ధరించండి. 


👨‍👩‍👧‍👧ఒక కుటుంబం బ్రతకడానికి తగ్గ విద్యార్హతలు, సామర్ధ్యం, నైపుణ్యాలు, తెలివితేటలు, సంపాదన, మంచి కుటుంబ నేపథ్యం, విలువలు, ఆదరణ, తగిన జంట .... ఇవి ప్రాథమిక ప్రమాణాలు ఒక మంచి దాంపత్య జీవన శుభారంభానికి. మిగతా పట్టింపులు మనం మన కోసం పెట్టుకున్నవే ... అవి ఏవిధంగానూ వారి దాంపత్య ఔన్నత్యం, దీర్ఘకాల సంతోషాలకు కొలమానాలు కానే కావు. అది ఇరువురి అవగాహన మీద ఆధార పడి ఉంటుంది. గ్రహించగలరు 💝👍🏽


జాతకాలు చూడండి తప్పు లేదు. అబ్బాయి జీతం కన్నా అమ్మాయి జీతం ఎక్కువ అని వంకలు పెట్టడం, పెళ్ళి తర్వాత అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను వదిలి వేరే కాపురం పెట్టమని చెప్పడం, అసలు ఆడపడుచులు ఉండకుండా ఉంటే సంబంధం అడగడం, ఆస్తి పాస్తులు అంతగా లేవని వెనుకాడడం ... ఇలాంటివి చూసినపుడు మన వివాహ - దాంపత్య వ్యవస్థ ఎటు పోతుందో అన్న భయం కలుగక మానదు. ఆలోచించండి 🙏


కారణం ఏదైనా ... మనం చేసే ఆలస్యం వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది.


మగ పిల్లలకు 26, ఆడపిల్లలకు 24 వయస్సు రాగానే సంబంధములు ప్రయత్నం మొదలుపెట్ట వచ్చు. పిల్లలకు అర్థం అయ్యే విధంగా నచ్చ చెప్పాలి. ఈ కాలంలో అప్పుడే వివాహం వద్దు అనే పిల్లలే ఎక్కువ. సమకాలీన పరిస్థితుల ప్రభావం వారి మీద ఎక్కువ ఉంది. అన్నీ అధిగమించి ఈ కాలంలో పిల్లల పెళ్లి చేయడం ఒక మహా యజ్ఞమే అవుతున్నది. 


కాబట్టి ... పట్టుదలలు, పట్టింపులు మాని కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి పిల్లల వివాహ ప్రయత్నాల్లో నిమగ్నమవండి. అందుకే అన్నారు ... ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి అని. దాని వెనుక చాలా అర్ధం దాగుంది. 


వయసు ప్రభావ రీత్యా ... తదనుగుణంగా పిల్లల ఉద్యోగ అవకాశాల రీత్యా ... స్నేహ సంబంధాల ప్రభావంతో .. బయట ప్రపంచంలో ఒకరికి ఒకరు ఆకర్షితులు అవుతారు. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏదో ఒక కారణంగా కుదరక అలా కాలం గడిచేకొద్దీ పిల్లల వయసు మీరి .. దాంపత్యానికి తగిన వయసు దాటిపోతున్న సమయంలో పిల్లలకు ప్రేమలు ఉత్పన్నమవుతాయి. అది ఒక భావజాలం ... వయసుతో పాటు సహజంగా కలిగే ఆలోచన. ఆ విధంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు కోకొల్లలు. ఆ క్రమంలో పిల్లలు పెద్దలను ఎదిరించలేక, పెద్దలు పిల్లలకు సర్ది చెప్పలేక కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. మన ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ... వేడుకలు, నోములు, వ్రతాలు ఇలా ఎన్నో ఆయా కుటుంబాలలో కనుమరుగు అవుతున్నాయి.ఇదంతా కులాంతర వివాహాల ప్రభావమే.  


దానికి విరుద్ధంగా కొంతమంది పిల్లలకు ఆలస్యం అయ్యేకొద్ది .. అసలు వివాహ జీవితం మీద ఆసక్తి తగ్గిపోయి ఒక నిశ్శబ్ద జీవితం గడిపేస్తున్నారు. ఉద్యోగం - ఇల్లు - స్నేహితులు అన్న చందాన స్తబ్దుగా బ్రతికేస్తారు. వారిలో ఒక సొంత వ్యక్తిత్వం, స్వార్థ చింతన పెరిగి ఇంకొకరితో జీవితం పంచుకునే స్వభావం తగ్గిపోతుంది.


వీటన్నిటికీ కారణం ... వివాహం ఆలస్యంగా చేయడం. పిల్లలను తప్పు పట్టడం కాదు కానీ ... సరియైన సమయంలో వారికి మంచి జోడి కడితే ఒక కొత్త కుటుంబంతో అనుబంధం ఏర్పడి వారి జీవితం తప్పక సుఖమయం అవుతుంది. మన బ్రాహ్మణ కుటుంబాలలో కొంత వరకు వెసులుబాటు కలిగించుకుని ఉభయులూ మాట్లాడుకుని అమ్మాయిని అబ్బాయిని కలిపే ప్రయత్నం చెయ్యాలి. ఆ దిశగా పెద్దలు అనవసరపు ఆలోచనలు ఆశలు శాస్త్రాలు కొంత వదులుకుని పిల్లలకు సంబంధాలు కుదర్చాలి. 


అన్యధా భావించకండి🙏🏼 ఇది నేటి సమాజ స్థితిగతులకు అనుగుణంగా ఆలోచించి పంచుకొనిన స్వీయ అభిప్రాయం ☝

కామెంట్‌లు లేవు: