19, మే 2022, గురువారం

విష్ణుపురం శాస్త్రి గారి అనుభవాలు

 విష్ణుపురం శాస్త్రి గారి అనుభవాలు


1940లో పరమాచార్య స్వామివారు కాశీయాత్రను ముగించుకుని విష్ణుపురం విజయం చేశారు. పరమాచార్య స్వామివారు సవారి వెళ్తున్నప్పుడు, ఒక ప్రముఖ వ్యక్తి సమీపించి పరమాచార్య స్వామివారికి బోధన చేసిన గురువుని సామి శాస్త్రిగారు అని సంబోధించాడు. 


స్వామివారు ఎంతో ఆవేదనతో అతణ్ణి “ఏమన్నావు? ఏమన్నావు?” అని అడిగారు.

ఆ భక్తుడు కాస్త కంగారుపడి “నేను ఏమి అపచారం చేశాను? పరమాచార్య స్వామివారు అంత క్షోభ పడుతున్నారు?” అని పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు.

మహాస్వామి వారు అతనితో, “వారి గురించి నీకు ఏమి తెలుసు? నేను సైతం ఎన్నడూ వారిని పేరు పెట్టి పిలవలేదు; విష్ణుపురం శాస్త్రిగారు అనే అనేవాణ్ణి” అన్నారు. గురువులపై అంతటి గౌరవం వారికి.


ఈ సూచన కేవలం ఆ భక్తుడికి మాత్రమే కాదు, మనకు కూడా!


శ్రీ పరమాచార్య స్వామివారికి శిక్షణ ఇచ్చేందుకు కుంభకోణంలోని శ్రీమఠం పక్కనే మా తాతగారికి కూడా వసతి ఏర్పాటు చేశారు. మా నాన్నగారు కూడా తరచూ అక్కడకు వెళ్లి కొన్ని రోజులు ఉండేవారు.


మఠం పైన ఉన్న మేడమీద వర్షపు నీరు వెళ్ళడానికి గొట్టాలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు, పరమాచార్య స్వామివారు మా నాన్నగారితో పాటు మేడపైకి వెళ్ళేవారు. ఇద్దరూ ఆ గొట్టాలను తీసి అక్కడ నిల్చున్న నీటితో ఆటలాడుకునేవారు. సూర్యుడు ఉండగా వర్షం కనుక పడితే, మహాస్వామి వారు వర్షంలో తడుస్తూ, “గంగ స్నానం, గంగా స్నానం!” అని అరుస్తూ, నాట్యం చేస్తూ ఆనందపడేవారు.


***********************************


అప్పట్లో పరమాచార్య స్వామివారి యాత్ర అంటే, స్వామివారితో పాటు పెద్ద రాజ పరివారం వెళ్ళేది. మూడు ఏనుగులు, అయిదు గుర్రాలు, ఇరవైరెండు ఆచ్చాదన ఉన్న ఎడ్లబండ్లు, పదిహేను గోవులు, రెండు సవారి గుర్రాలు (ఒకటి నల్లనిది, ఒకటి పంచకల్యాణి - ముఖము, కాళ్ళు తెల్లగా ఉండేది), రెండు గుర్రపు బగ్గీలు, సవారి ముందర పెద్దగా శబ్దం చేస్తూ బాకా. అయిదుగురు లోపలి వలయం కాపలావాళ్ళు, బయటి వలయం కాపలావాళ్ళు అయిదుగురు. వీరు కాకుండా, ఎందఱో వేదపండితులు, వ్యక్తిగత సహాయకులు, మేనేజరు, కోశాధికారి, ప్రముఖులు మరియు మేళ తాళాలు.


పరమాచార్య స్వామివారు విజయం చేస్తున్నారని తెలిస్తే, ఊరు మొత్తం కోలాహలంగా, సందడిగా, పండుగ వాతావరణంతో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కేవలం ఊహించి మాత్రమే దర్శించాలి.


***********************************


పరమాచార్య స్వామివారికి శ్రీమద్భాగవతం అంటే అమిత ఆసక్తి. ఒకసారి, రామమూర్తి అయ్యర్ భాగవతం చదువుతూ ఉంటే, స్వామివారు వింటున్నారు.

అప్పుడు, భాగవత ప్రవచనాలకు ప్రసిద్ధుడైన నీడమంగళం శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు అక్కడకు వచ్చి ఢిల్లీలో భాగవత సప్తాహం ముగుంచుకుని వస్తున్నాను అని స్వామివారికి తెలియజేశారు.


“విద్వాంసులు కూడా వచ్చి విన్నారా?” అని అడిగారు స్వామివారు.

“అవును వచ్చారు”


“వారు ఏమన్నారు?”


ఒక పండితుడు అన్నాడు, “అందులో రాస పంచాధ్యాయి కనుక లేకపోయి ఉంటే, శ్రీమద్భాగవతం అద్భుత గ్రంథం అయ్యుండేది”.


అందుకు స్వామివారు చిన్నగా నవ్వి, “రాస పంచాధ్యాయిని పఠనము-శ్రవణము-మననము చేసిన తరువాతనే, నాకు సన్యాసం సిద్ధించిందని నిర్ణయించుకున్నాను నేను” అన్నారు.


విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం చిన్నపిల్లలు మాట్లాడినట్టు ప్రవచనం చేసేవారికి ఇది ఒక పాఠం అని మనం అర్థం చేసుకోవాలేమో.


***********************************


పరమాచార్య స్వామివారు విష్ణుపురానికి ఏడెనిమిది సార్లు విజయం చేసుంటారు. శంకర జయంతి, నవరాత్రి వంటి ముఖ్యమైన సందర్భాల్లో స్వామివారు అక్కడ మకాం చేశారు.


మా ఊరి ముఖద్వారం వద్ద, వీధుల్లో మరియు దారుల కూడళ్ళలో స్వామివారిని స్వాగతించడానికి క్రమానులను ఏర్పాటుచేసేవారం. వాటిపై గీతలోని ముఖ్య శ్లోకాలను పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళం. 


మహాస్వామివారు మేనాలో రావడంతో వాటిపై రాసినది స్వామివారికి కనిపించేది కాదు. రాత్రి పూజ అయిపోగానే, ఒక పెట్రోమాక్స్ గ్యాస్ లైటు తీసుకుని ఒక్కొక్క శ్లోకం చదువుతూ వెళ్ళేవారు. ఈ గీతా శ్లోకాలను ఎవరు నిర్ణయించారు అన్నప్పుడు మా గుండెల్లో చిన్న వణుకు. మెచ్చుకుంటారా? మందలిస్తారా? అని. 


చివరగా స్వామివారే అన్నారు, “అంతా బావుంది! నేను ఎలా ఉండాలో మీరు నాకు గుర్తు చేశారు” అని.


ఈ మాటలు వినగానే, మాకు దిగులు పట్టుకుంది. కాని తరువాత మాకు అర్థం అయ్యింది అది ఆరోపణ కాదు, అది కేవలం సరదాగా చేసిన స్వీయ విమర్శన మాత్రమే అని. ఆత్మ పరిశోధన చేసుకునే ఆత్మబలం అది. 

 

--- శ్రీమతి మోహన పంచపకేశన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: