3, మే 2022, మంగళవారం

గుబులు

 గుబులు

------- 


యవ్వనంతో పాటు 

ఒంట్లోకి అడుగుపెట్టింది అందం

అద్దెవాటాలోనే అలా ఒదిగి ఉండిపోలేక

అదేం చనువో, 

ఒళ్ళంతా అల్లుకుపోయింది

ఇక నాకూ తనకూ ఒకే లోకమైపోయింది 


వీథుల్లో అలా వెళ్ళిపోయే కళ్ళు

వెనుదిరిగి చూడటం నేర్చుకున్నాయి

వీథుల్లో వెడుతుంటే వెంటాడటమూ మొదలెట్టాయి

కోరికలు, మోహాలు నామీదే దృష్టి పెడుతుంటే

ఆప్యాయతలు మాత్రం

అస్తమానం ఇంట్లో దిష్టి తీయడాలు చేస్తుండేవి 


అందం అజమాయిషీలో

బంధాలూ బంధుత్వాలూ

ఇబ్బడిముబ్బడిగా ముడిపడిపోయాయి

ఆస్తులు...

ఎన్ని అంతస్తులు దిగొచ్చాయో గానీ

పరపతితో కూడిన ప్రపంచాన్ని 

బహుమతిగా తెచ్చి నా ముందు పడేసాయి 


ఒంటి చుట్టూ ఉన్న మైదానంలో

కొంటెచూపుల కాలం పరుగులు తీస్తుంటే

ఏ చికాకు వేసిందో ఏమో

అద్దెవాటా ఖాళీ చేసేసి యవ్వనం

చెప్పాపెట్టకుండా ఒంటరిగా వెళ్ళిపోయింది

వెళ్ళనా ? వద్దా ?? అంటూ వెనుకాడుతున్న

అందాన్ని నా ఒంట్లోనే వదిలేసి 


ఎంతకాలంగా వేచిచూస్తోందో ఏమో

'నడివయసు' చల్లగా నడిచొచ్చేసింది

యవ్వనం ఖాళీ చేసేసిన ఆ వాటాలోకి 


పెరుగుతున్న బరువులు

అక్కడక్కడా కూడుకుంటున్న కొవ్వులు

నెరుస్తున్న వెంట్రుకలు

మొహం పైని సన్నని గీతలు ముడుతలు

కళ్ళు కింది నల్లని వలయాలు

అందం ముందుకొచ్చి అద్దం చూపిస్తూ 

'బస్తీ మే సవాల్' అంటూ అరవడం మొదలెట్టాయి 


వంటింట్లో కొవ్వు లేని వంటలు

నట్టింట్లో కొవ్వును కరిగించే వర్కౌట్‌లు 

ఆలస్యం లేకుండా అట్టే మొదలయ్యాయి

పైపై పూసే పూతలు... ప్రకృతి చికిత్సలు

ఫలితం ఏమొస్తుందో తెలియని

ప్రయోగాలు ఎన్నెన్నో చోటుచేసుకున్నాయి 


ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండే అందం 

ఈమధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటోంది

ఎపుడెళ్ళిపోతానంటుందో అని 

నాకేదో తెలిసీ తెలియని గుబులుగా ఉంది 


అందంతో జీవితం ఇక ఇంతేనా..?

అందంతో సాన్నిహిత్యం అశాశ్వతమేనా...??


          .... శ్రీధర్ చౌడారపు (03.05.2022)

కామెంట్‌లు లేవు: