13, జులై 2022, బుధవారం

సొంత ఇల్లు

 సొంత ఇల్లు 

ఏమిటీ రామా రావు గారు మీరు ఇక్కడ వున్నారు అని అన్నాడు.  నేను ఈ ఇల్లుకొనుకున్నాను నీకు తెలియదా సుబ్బారావు అని అన్నాడు.  రా లోపలికి అని సాదరంగా పిలిచి ఇల్లంతా చూపించి దానిని కొనటానికి ఎంత ఖర్చు అయ్యింది ఎన్ని ఇబ్బందులు పడి తాను కొన్నది అంతా వివరంగా చెప్పాడు రామారావు., చెపుతున్నంత సేపు తానేదో బృహత్ కార్యం చేసినట్లు తాను కాక ఇంకెవరు అటువంటి గొప్ప పని చేయలేదనట్లు చెప్పిందే చెప్పి సుబ్బారావు సహనానికి పరీక్ష పెట్టాడు.  వాడు తాగించిన కప్పెడు టీ ఎప్పుడో జీర్ణం అయిపొయింది.  తొందరగా తెంపుకొని వెళదాం అని సుబ్బారావు అనుకుంటున్నాడు కానీ రామారావు వాక్ ప్రవాహానికి గండి పడటం లేదు. సుబ్బారావు మొఖంలో అసహనం చోటుచేసుకుంది.  సర్లే రామారావు ఈ రోజు నిన్ను ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా వుంది నీవు ఎట్లాగైతేనేమి సొంత ఇంటివాడివి అయ్యావు అని అభినందించి అక్కడినుండి బలవంతంగా నిష్క్రమించాడు సుబ్బారావు. 

నాకు ఒక సొంత ఇల్లు వున్నది అనే భావనే ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ మిత్రమా నిజంగా నీవు కొనుక్కున్న సొంత ఇల్లు నాదేనా అని అడిగితె అదేమిటి అట్లా అంటున్నావు కావాలంటే రిజిస్ట్రేషన్ కాగితాలు చూపిస్తా అని అంటావు.  నిజానికి మిత్రమా నీవు ఏదయితే నీ సొంత ఇల్లు అని భ్రమ పడుతున్నావో అది నీ సొంత ఇల్లు కాదు. అదేమిటి అట్లా అంటావు అని నీవు అనవచ్చు.  నీవు నిజంగానే కొనుకున్నావు కాదని నేననను.  కానీ ఎవరి దగ్గర నీవు కొనుక్కున్నావు ఇంకొక వ్యక్తి దగ్గర అతను ఆ ఇంటికి యజమాని అని నీవు అతనికి ధనాన్ని ఇచ్చి కొన్నావు కదా అవును. మనం సామాన్య మైన దృష్టిలో యేమని అనుకుంటాలంటే ఈ ప్రపంచంలో వున్న సంపద అంతా మనుషులదే కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషికి తన సంపదను అమ్మ వచ్చని కదా.  కానీ మిత్రమా నీవే కాదు నీ ఇంట్లో ఇంకా చాలా జీవులు వున్నాయి.  అవి కూడా ఈ ఇల్లు నాదే అని అనుకుంటున్నాయి.  గోడమీద బల్లి, కంతలోని చీమలు, ఎలుకలు, ఇంకా సాలెపురుగులు, దోమలు, ఈగలు, నీ చెట్టుకు గూడు కట్టిన పిట్టలు. ఇట్లా అన్నీ నీ ఇల్లు వాటి వాటి ఇల్లే అనుకుంటున్నాయి. నీవు ఆ జంతువుల దగ్గర ఇల్లు కొనలేదే మరి ఈ ఇల్లు నీ ఇల్లు ఎలా అయ్యింది అంటే నీవు తెల్లమొహం వేస్తావు. నిజానికి నీవు సొంత ఇల్లు అనేది నీ సొంత ఇల్లుకాదు ప్రస్తుతం అంటే నీ శరీరంలో నీవు (ఆత్మ) వున్నన్ని రోజులు వుండే ఒక వసతి గృహం మాత్రమే.  ఈ విషయాన్ని ఈశావాసోపనిషత్ మొదటి శ్లోకంలోనే ఇలా వివరించింది

ఈశా వాస్యమిదxసర్వం యత్కించ జగత్యాం జగత్, 

తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.

.తాత్పర్యము: అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు ఈశ్వరుని చేత వ్యాపించియున్నది. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినదికాదు.  

ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. విషయములందు మనస్సును చిక్కుకొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని పెంచుకుంటాడు (ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుల్యమేవ సమర్పయే) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము. (1) 846 

కాబట్టి మిత్రమా ఇది నా ఇల్లు ఇది నాది, వీరు నావారు అనే మొహాన్ని వీడు నీ శరీరం నీకు ఆ ఈశ్వరుడు ఇచ్చిన అపూర్వ కానుకగా భావించి ఈ జన్మలోనే జన్మ రాహిత్యానికి (మోక్షానికి) ప్రయత్నం చేయి.  కొంతమంది ఎన్నుకుంటారంటే మనకు అనేక జీవన  వ్యాపకాలు ఉంటాయి కదా మనం భగవంతుని కొరకు సమయం వెచ్చించలేము కాబట్టి నేను ప్రయత్నించలేను అని దైవ చింతనను విరమించుకోవచ్చు.  వారికి భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే మనం అనేక కార్యకలాపాలతో వున్నప్పడికి నిత్యా కర్మలు అంటే స్నానం చేయటం, భోజనం చేయటం మల మూత్ర విసర్జన చేయటం వంటివి ఏవి కూడా ఆపుకోవటం లేదు కదా మరి దైవచింతనను కూడా వాటిలాగా తప్పనిసరిగా ఆచరించవలసిన కర్మగా ఎందుకు తలవకూడదు.  మనం మన మనస్సుకు సర్దిచెప్పుకుంటే దైవ చింతన కూడా మన నిత్యా కర్మలలో చేరుతుంది.  తప్పకుండా మోక్షం కారతలామలకాలం అవుతుంది.  అధవా ఈ జన్మలో మోక్షం రాకపోయినా బాధపడవలసిన పనిలేదు.  ఇప్పుడు ప్రారంభించిన సాధన మన మరుసటి జన్మలో కొనసాగుతుందని భగవానులు గీతలో చెప్పారు. కాబట్టి మిత్రమా నీ సాధన ఇప్పుడే మొదలు పెట్టు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

 



కామెంట్‌లు లేవు: