13, జులై 2022, బుధవారం

గురుపౌర్ణమి

వ్యాసుడవతరించ నాషాఢపున్నమి
సర్వ జనులకిలను పర్వమాయె
వేదరచన జేసి వెలిగించె జ్యోతులు
కనులనిండ కాంతి గాంచరారె

వ్యాసుడొకడె జగతి నసలైన గురువౌను
వేద జ్ఞాన మంత వీరి కృపయె
ఆదిశంకరుండు నాతని వలెగాద
వందనములనిడుదు వారికెపుడు

జ్జానమిచ్చు గురువు జయమును కలిగించు
తనను మించినపుడు తాను మురియు
కన్నతండ్రి వలెను కాపాడు శిష్యుల
నాదరించు నెపుడు నమ్మవోలె
పాఠంబుజెప్పంగ కాఠిన్యమును జూపు
విద్యజూచి కరుగు వెన్నవోలె
గురువు కెవరు సాటి గోళమందెచ్చట
దైవసములు వారు దరకి జేర్చ

గురువు బ్రహ్మ యౌను గురువె విష్ణు డిలను
వేరు మాట లేల గురుడె శివుడు
పరమ పథము జూపు పరబ్రహ్మ యు గురుడె
అందు కొనుము దేవ నంజలింతు

జ్ఞాన మంతరించి జగతి జీకటి నుండ
జ్ఞాన జ్యోతుల నిడి జగతి బ్రోచు
తిమిరములను ద్రోలి స్థిరమగు దారిని
జనుల కిడెడు వారు గురువు లొకరె

అమ్మ నాన్న మించి యధికమౌ గురువులు
జన్మ నిచ్చు నమ్మ జగతి నందు
జ్ఞాన మిడును గురువు జగతిని జీవింప
మరువ రాదు మనము గురువు కృపను

గురువు కరుణ లేక గురివింజ యెత్తైన
జ్ఞన మబ్బ దసలు జదువు రాదు
ఎరుక గలుగు మనకు గురువు కృపను జూడ
గుప్త నిధులు గారె గురువు లిలను


గురువు లేక విద్య కొండంత జదివినా
జ్ఞప్తి కవియు రావు సమయమందు
కర్ణుడెంత జదువ కడకేమి జరిగెను
కొలువరారె జనులు గురువునిపుడు


చీకటెటుల బోవు చిరుదివ్వె వెలిగించ
యటుల గురువు మనల నాదు కొనును
జ్ఞాన మొసగి తాను జగతిని నడిపించు
గురువు లెపుడు కల్ప తరువు లౌను


గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా
గురువులందరకును వందనములతో 

కామెంట్‌లు లేవు: