12, జులై 2022, మంగళవారం

భారద్వాజ గోత్రం?!

 భారద్వాజ గోత్రం?!


1944లో ధర్మపురి జిల్లాలోని కృష్ణగిరి పక్కన ఉన్న కావేరీపట్టణంలో పూజ్యశ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఒక నెల పాటు మకాం చేశారు. అప్పుడు నేను ఆ ఊరి పోస్టు మాష్టరుగా పనిచేసేవాణ్ణి. స్వామివారి రోజూ వ్యవహారాల్లో నిమగ్నమైన ఎందఱో సామాన్య ప్రజలు, భక్తులు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులలో నేను కూడా ఒకడిని. మఠం యొక్క కార్యక్రమాల్లో ఎంతో సన్నిహితంగా నిమగ్నమయ్యే అవకాశంతో బాటు, ఎన్నోమార్లు పరమాచార్య స్వామివారు కారుణ్య దృష్టిని పొందగలిగిన భాగ్యవంతుణ్ణి.


తరువాతా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. మరొక ప్రాంతంలో మకాం చేస్తున్నప్పుడు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. స్వామివారు ఇస్తున్న తీర్థ ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వందల మంది భక్తులతోపాటు నేను కూడా వరుసలో నిలబడి ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. నా వంతు రాగానే, తీర్థం ఇస్తున్న స్వామివారు నన్ను చూసి, ఏదో అడుగుతున్నట్టుగా నన్ను చూసి కళ్ళు చిట్లించారు. స్వామివారు భావం అర్థం చేసుకుని, కావేరీపట్టణం పోష్టుమాష్టరుగా పనిచేస్తున్నప్పుడు నేను చేసుకున్న దర్శనం గురించి స్వామివారికి తెలిపాను. స్వామివారు చేతితో ఆశీర్వదిస్తూ, చక్కని చిరునవ్వుతో, “భారద్వాజ గోత్రం?” అని అన్నారు. ఇదంతా కేవలం రెండు క్షణాలలోనే జరిగిపోయినా, నాకు కలిగిన ఆనందం, అతిశయం వర్ణించడానికి మాటలు సరిపోవు.


ఈ సంఘటన ఎప్పుడూ నా మనస్సులో మెరుపులాగా జ్ఞప్తికి వస్తున్నా, పరమాచార్య స్వామివారి ఔదార్యం మరువలేనిది. వేలమంది స్వామివారిని దర్శించుకుంటారు, సేవ చేసుకుంటారు. కాని నన్ను చూడగానే, స్వామివారు నా గోత్రం చెప్పి, నన్ను ఆశీర్వదించడం స్వామివారి అమోఘమైన జ్ఞాపకశక్తికి, ఉనతమైన దాక్షిణ్యానికి, మొహోన్నతమైన సిద్ధికి తార్కాణం. ఏది ఏమైనా, అది వర్ణనాతీతం.


--- ఆర్.బి. గోపాలకృష్ణన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: