ఏమయ్యా..ఎందుకా ఇంగ్లీష్ పుస్తకాలు కలిబెడుతున్నావు...
అవి నీలాంటి వాళ్ళకేం అర్థమౌతాయి! అని కసురుకున్నాడు,..
పాండీబజార్లో పేవ్ మెంట్ మీద పాత పుస్తకాలు అమ్ముకునే వాడు..ఆ పెద్ద మనిషిని.
నీరుకావి పంచె,మామూలుగా కనిపించే తెల్ల చొక్కా వేసుకున్న ఆ పెద్దమనిషి..నవ్వేసి...అవును..నాకెందుకు! అనుకుంటూ...తనకు కావలసిన బుక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు.
పాపం...ఆ పుస్తకాలమ్మే వాడికేం తెలుసు ఆయనెంతటి విద్వాంసుడో! కాకపోతే...ఎంత విద్వత్తు ఉందో...అంత వినయమూ ఉంది. బాహ్యాడంబరాలు....అసలు తెలియవు.
ఆయన తెలుగు, సంస్కృతం లలో ఎం.ఏ.అని.....వేదాలు, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలు..అభ్యసించి...
షుమారు 100 భాషలు తెలిసిన మహామేధావి అని ఎప్పుడూ...ఎవరికీ చెప్పుకోలేదు. ఒరియా, బెంగాలీ, అస్సామీ లే కాక...ఫ్రెంచ్, గ్రీక్, జపనీస్, జర్మన్, లాటిన్, చైనీస్....ఇలా బహు భాషా కోవిదుడు.
ఆయనే వచన రచనకు మేస్త్రీ....మల్లాది రామకృష్ణ శాస్త్రి.
*********
పద్యమైనా.... గద్యమైనా.
కథ అయినా..., కవిత అయినా,
సినిమా పాటైనా --
తెలుగు భాషా సుగంధ పుష్పం యొక్క పరిమళం నలుదెసలా వ్యాపింప చేసిన *కథా మేస్త్రి* శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు.
ఆయన చేసుకున్న పాపం వల్ల,....
మనం చేసుకున్న పుణ్యం వల్ల....వీరు తెలుగు రచయితగా పుట్టారు.
ఇటువంటి కవి, మరే భాషలో ఉన్నా అంతర్జాతీయ ఖ్యాతి పొంది ఉండేవాడు.
ఆయన పాటలే కాదు వాక్యాలు కూడా గీతాల లాగా గుబాళిస్తాయంటే అతిశయోక్తి కాదు.
సినిమాలో, మాటలు, పాటలు రాయడానికి ముందు....,
పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు రాసారు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నారు.
దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’....
చిత్ర రచన విషయంలో సలహాల కోసం 1945లో...
మల్లాది వారిని మద్రాసుకు ఆహ్వానించారు.
తొలిచిత్రం-పాట : చిన్నకోడలు (1952) - పిల్లనగ్రోవి పాటకాడ...
ఆఖరిచిత్రం : వీరాంజనేయ (1968)
(మల్లాదివారి కథల్లోంచి ఒక పాటను తీసుకొని అత్తగారు-కొత్తకోడలు (1968) చిత్రంలోవాడారు)
పాటలు : 200 (39 చిత్రాలకు).
*********
ఆడంబరమైన అసత్యాలు....వాక్కులుగా శ్రీ మల్లాది వారి నుండి రమ్మన్నా రావు! మనిషి భాహ్య వేష ధారణకు ....అసలు విలువ ఇచ్చేవారు కాదు. వాక్కులు....బేరీజు వేసుకుని మరీ మాట్లాడేవారట!
1934 లో కృష్ణా పత్రికలో....కవిమిత్రులు శీర్షికన...శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శివశంకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ & కాటూరి వంటి వారి గురించి...చక్కటి వ్యాసాలు వెలువరించారు.
అదే పత్రికలో చలవ మిరియాలు....పేరిట...సునిశితమైన విమర్శనాత్మక వ్యాసాలుండేవి.
1945 లో మద్రాస్ వచ్చేశాక....సీనియర్ సముద్రాల వారే ఆశ్రయమిచ్చారు.
ఇద్దరూ కలిసే...రత్నమాల, బాలరాజు,లైలా- మజ్ఞు, స్వప్నసుందరి & మనదేశం వంటి మూవీస్ కి....కలిసే వ్రాశారు. పేరు మాత్రం సముద్రాల వారిదే!*
ప్రతిభా వారి చిన్నకోడలు(కృష్ణ కుమారి హీరోయిన్)లో మొట్టమొదట...మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పేరుతో వ్రాశారు!
కృష్ణా తీరం,
తేజోమూర్తులు,
చలవ మిరియాలు,
కేళీ గోపాలం,
గోపిదేవి,
బాల
&
సేఫ్టీ రేజర్....
ఇవన్నీ మల్లాది వారి సాహిత్య మణిపూసలు.
*********
ఓ రోజున ఆరుద్ర నేరుగా...గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?*అని అడిగారు.
దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే,....
అప్పుడు ఆరుద్ర...
అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి*...
అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు.
అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి!
ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం.
కనుక రామకృష్ణశాస్త్రిగారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పొచ్చు.
********
మద్రాసులోని పానగల్ పార్క్ చూసినప్పుడల్లా అందరికీ గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు. అటు తర్వాత గుర్తుకు వచ్చేది శ్రీ శ్రీ గారు.
పానగల్ పార్క్ లోని సిమెంట్ బల్లలపై కూర్చుని, వేరు శనగ కాయలు తింటూ, ఎవరు 'కూలీ'కి పిలుస్తారా అని ఎదురు చూసే 'మేస్త్రీ' ఈయన.
ఆయన గొప్ప మానవతావాది.
కాళ్లకు వేసుకునే చెప్పులు ఎంత పాతవి అయిపోయినా, ఊడిపోతూ ఉన్నా,...
వాటిని తిరిగి కుట్టించుకుంటూ, బాగు చేయించుకుంటూ అవే తొడుక్కునేవారు.
ఎందుకు పాతవాటితో అవస్థ పడటం?...
అని మహారథి ప్రశ్నిస్తే.... '*చెప్పులు కుట్టేవాడికి పని పెట్టాలి కదా! అతడికి దానం చేస్తే తీసుకోడు మనం ఇవ్వకూడదు.
పని చేయించుకుని ఏదైనా ముట్ట చెప్పాలి. కొత్త చెప్పులు కొనుక్కుంటే అతడి బతుకెలా గడుస్తుంది? రిపేరు చేయటం నా వల్లకాదు అని అతగాడు అన్నప్పుడే కొత్తవి కొంటాను*..
అనేవారట!
*********
సముద్రాల రాఘవాచార్య గారిని...ఏవిటండీ...శాస్త్రి గారి చేత పాటలు వ్రాయించుకుని....మీపేరు వేసుకుంటున్నారు?! అని అడిగితే...
ఇందులో తప్పేముంది. నాకు టైం లేదు. ఆయనకు డబ్బు అవసరం. అది నేనిచ్చి వ్రాయించుకుంటున్నాను.ఒక పండితుడికి అవకాశం ఇస్తున్నాను!...అనేవారట.
తన పేరు మీద రాని పాటలు...తనవి అని ఎప్పుడూ చెప్పుకోలేదు శాస్త్రి గారు. ఆ మాటలే చెప్తాయి అవి ఎవరు వ్రాశారో!
ఏమో తటిల్లతిక మేమెరుపు...
మేడలోనే అల పైడిబొమ్మా.....ఇలాంటి పదాలు ఇక ఎవ్వరూ వ్రాయలేరు..ఆ మాటల మేస్త్రీ తప్ప!
అసలు కుడి ఎడమైతే...పాటకు అర్థమేమిటండీ? అని అడిగితే....*ఆ తాగుబోతు వాడి పాటకు అర్థాలు కూడానా...అని నవ్వుతూ తప్పుకునేవారు శాస్త్రి గారు.
శాస్త్రి గారి పేరు మీద మహా అయితే ఒక 200 పాటలు వచ్చిఉంటాయి. కానీ అజ్ఞాతం గా ఎన్నో పాటలు వ్రాశారు!
1967 లో రహస్యం మూవీ లోని గిరిజా కళ్యాణం యక్షగానం శాస్త్రి గారిదే. కాకపోతే...ఆయన ఎప్పుడో ముందే వ్రాసిపెట్టినది..ఆ సినిమాలో వాడుకున్నారు.
**********
మల్లాది వారి గురించి కొందరు సుప్రసిధ్ధుల అభిప్రాయాలు చెప్పాలంటే.....ఇదుగో ఇలా ఉన్నాయి.
శ్రీ తాపీ ధర్మారావు -- సినిమా పాటకు కావ్య గౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది.
శ్రీ పింగళి -- శ్రీ మల్లాది వారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహార్!ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు.
శ్రీ శ్రీ -- తెలుగు సినిమా పాటకి సాహిత్య ప్రశస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు శ్రీ మల్లాది.
శ్రీ దాశరధి -- అతని శైలిలోన అమృతాలు తొణుకాడు.
శ్రీ నారాయణ రెడ్డి -- శ్రీ మల్లాది వారి ప్రతి పదబంధం మధు నిష్యందం.
శ్రీ వేటూరి -- ఆయన పలుకులోంచి అమృతం పుట్టింది. అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది.
శ్రీ వెన్నెలకంటి -- ఆంద్ర సాహిత్యానికి కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన అయితే,..
తెలుగు చలనచిత్ర సాహిత్యానికి కవిత్రయం సముద్రాల, పింగళి, మల్లాది.
బాపు-రమణలు -- వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి. తక్కువ సినిమాలకు రాసినా విశిష్ట రచనలే ఎక్కువ చేసారాయన.
*********
100 భాషలలో ప్రావీణ్యం.....
వేదాల ఔపోసన,...
బ్రహ్మ సూత్రాలు...
మహాభాష్య జ్ఞానం...
మహా గ్రంథాల రచయిత....
ఇవేవీ కూడా....ఆ మహానుభావుని...దారిద్ర్యానికి బలి కాకుండా ఆపలేక పోయాయి!
కేవలం....
లౌక్య రాహిత్యం,...
త్యాగశీలత,...
అతి మంచి తనం,...
నిస్వార్థత.....
ఇవి చాలు....కలిలో....కడతేరి పోవడానికి!
వారి వ్యక్తిగత జీవితం దుర్భరం అయినది. వారి భావాలు నచ్చకనో లేక వారికి కలిగిన వేదాంత ధోరణి వల్లో, భార్యా భర్తలు విడిపోయారు.
ఆయన జీవితంలోని విషాదమంతా దేవదాసులోని పాటలో ప్రతిబింబిస్తుంది.....
అన్నిటినీ, అందరినీ పోగొట్టుకొని, 'తన వారు పరులైన' జీవితాన్ని అనుభవించిన ఈ మహాకవి.... 12-09-1965 న కీర్తిశేషులయ్యారు.
మల్లాది వారి వర్థంతికి నివాళి సమర్పిస్తూ...
- డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి