26, సెప్టెంబర్ 2022, సోమవారం

_నువ్వెళ్ళినా

 *_నువ్వెళ్ళినా నీ పాట మాతోనే.._*


🎼🎼🎼🎼🎼🎼🎼


ఒకటా..రెండా..

*_నలభై వేల పాటలు.._*

సుమారు నాలుగు తరాలు..

పరవశించిపోయిన 

*_కోట్లాది హృదయాలు.._*

ప్రతి మనిషి జ్ఞాపకంలో 

ఆయన పాట..

ఏ వయసు వారికి 

ఆ అనుభూతి..

బాల్యమా.. యవ్వనమా..కౌమారమా.. వార్ధక్యమా..జీవితంలోని 

అన్ని దశలకు 

అన్ని రకాల పాటలు..

ప్రేమా.. విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా..

ఎప్పుడు ఏదడిగినా 

చిటికెలో 

తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక..

*_అసలు పాటకు_* 

*_ఆయనే పీఠిక...!_*


ఇక భక్తి గీతాలా..

*అయ్యప్ప దేవాయన మహ..*

అంటే పలకడా 

శబరిగిరీశుడు...

*జయజయ వినాయకా* 

*శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక..*

అని స్తుతిస్తే

నీ రూపంలోనే కదిలి రాలేదా గణపయ్య..

*నీవూ మా వలె మనిషివని..నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బతికేది..*

అంటే సమాధి చీల్చుకురాడా

షిర్డీ సాయిబాబా..

ఆ గళం విని 

మురిసిపోలేదా మల్లన్న..

ఏడుకొండలూ 

దిగిరాడా వెంకన్న.. 

మీటింగులో నీ గీతమే..

పెళ్ళిలో నీ గొంతే..

గుడిలో నీ పాటే..

మా గుండె గుడిలో 

నీ గళమే...

నువ్వు మా హృదయాలలో నింపిన జాలమే..

మా బ్రతుకులో 

*_నీ పాటలు కలకాలమే..!_*

         

*చేయెత్తి జై కొట్టు తెలుగోడా..*

ఈ ఒక్క పాట రాష్ట్రం మొత్తం మీద ప్రకంపనై..

తెలుగుదేశం పార్టీకి అలంబనై..

*ఎన్టీఆర్ విజయగీతికై..*

ఆ యుగపురుషుడి 

రాకకు సంకేతమై.. మారుమ్రోగిపోయి..

పల్లె..పట్నం ఊగిపోయి..

నాటి చరిత్రలో 

*నందమూరి మాట..*

*బాలసుబ్రమణ్యం పాట...* 

కూలిపోయె తెలుగునాట కాంగ్రెస్ కంచుకోట..!


*సంగీతమే నీ ప్రపంచం..*

మాకు వినిపించేవి 

నలభై వేల పాటలే..

వాటి వెనక 

ఎన్ని లక్షల రిహార్సల్స్ ..

ఎంత సాధన..

ఇంకెంత శోధన..

నిదురలో..మెలకువలో

*నీ గొంతు కువకువ..*

*నీ పాట మెళకువ..* 

సంగీత ప్రపంచానికి 

*_నీ స్వరమే వేకువ.._*

సంగీత సరస్వతికి 

*_దొరకునా ఇటువంటి సేవ.._*

*_నీ పదరాజీవముల చేరు_* 

*_నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ..!_*

         

నువ్వెళ్లిపోయావంటే 

చెప్పలేని బాధ..

గుండెలు పిండేస్తున్న ఆవేదన.. మౌనరోదన..

అంతలో నీ పాట.. 

నేల నలు చెరగులా 

అదే ప్రతిధ్వని.. 

అరె..అన్ని చోట్లా నువ్వున్నావే..

ఎక్కడ విన్నా 

నీ గొంతే..

అంటే నువ్వున్నావు..ఉంటావు. 

నేనున్నంత కాలం 

నా గుండెలో..

నా తర్వాత నా బిడ్డ గొంతులో..

సినిమా ఉన్నంత కాలం 

ప్రతి పాటలో..సంగీతమనే 

ఒక పాఠంలో..

ప్రతి పుటలో..!


షాదీలో..షామియానాలో..

ఖానాలో..ఖాందాన్లో..

హాల్లో..హల్లోలో..

షోలో..సోలోలో..

*తానాలో..*

*ప్రతి మనిషి* 

*తానా తందానాలో.!*


*అమర గాయకుడు ఘంటసాల

తరవాత, నిరంతర గాయకుడు బాలసుబ్రమణ్యం..*


*మనిషికే మరణం..*

*గొంతుకు కాదు..*


బాలు కనిపించరేమో

ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది.


*ఎక్కడికి వెళ్ళినా* 

*ఏదో ఒక భాషలో..!*

         

మూగవాడి గొంతులో కూడా *భలేభలే మగాడివోయ్*

అంటూ..అనిపిస్తూ..

తనలో తనకే వినిపిస్తూ..

బాలూ పాట..తేనెల ఊట..

చిన్నప్పటి నుంచి నాతోనే..

*ప్రతి వయసులో..*

*ప్రతి శ్రుతిలో..*

*నేను పాడే* 

*అపశృతిలో..*

*నిరంతరం నా స్మృతిలో..!*


**************

గానగంధర్వుడు దూరమై

రెండేళ్లు..

ఇది నా నివాళి..

✍️✍️✍️✍️✍️✍️✍️

     

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

           9948546286

కామెంట్‌లు లేవు: