26, అక్టోబర్ 2022, బుధవారం

కార్తీకపురాణం

 : _*కార్తీకపురాణం - 2 వ అధ్యాయం*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*సోమవార వ్రత మహిమ*

*కుక్క కైలాసానికి వెళ్లుట*



☘☘☘☘☘☘☘️☘☘



వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు *”జనకా ! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని , దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.


*”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని , పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి , తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి , సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి , పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి.*నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత ,  తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి , సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.


*🌹కుక్క కైలాసానికి వెళ్లుట🌹*


*”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు , శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’* అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో , కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను , భర్తను తిట్టడం , కొట్టడం , రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు , బట్టలు , పువ్వులు , ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.


ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని , అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి , నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు , పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి , పాడుచేసి , విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము , రక్తం కారుతూ , క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి , పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని , విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు , అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో , చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా , ఇటు ఏడు తరాలు , అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ , క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి , ఉపవాసము ఉండి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి , ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి , కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడము , శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క *‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’* అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. *‘రక్షించు… రక్షించు…’* అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు *‘ఎవరు నీవు ? నీ వృత్తాతమేమిటి ?’* అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు , భర్తను చంపడం , వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి , చనిపోయిన తీరును , నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. *‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి , ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి , నాకు మోక్షం కలిగించు’    అని ప్రార్థించింది.     దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి , సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”*



*ఇతి శ్రీ సాంద పురాణేతర్గత , వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్త: _*🚩కార్తీకపురాణం - 1 వ అధ్యాయం🚩*_


🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️


*కార్తీక మాసం మహత్యం*

*కార్తీక మాస వ్రతవిధానం*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ఒక రోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.


శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.


పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.


అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.


మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.


దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.


వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.


*కార్తీక వ్రతవిధానం*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.


వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.


*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

కామెంట్‌లు లేవు: