19, నవంబర్ 2022, శనివారం

తలపులోకి కూడా రానీయకు

 *భార్యా భర్తలమధ్య అభిప్రాయ బేధాలు, పోట్లాటలు పొరపొచ్చాలు ఎందుకు వస్తాయి ? వస్తే  పరిష్కార మార్గాలేమిటి?*

 

గొప్ప గొప్ప  రచయితలను అడిగి  వారి సంసారాలలో వచ్చే బేధాభిప్రాయాలను  ఎలా పరిష్కరించుకున్నారో తెలుసుకుందామనే 

ప్రయత్నం……


*ఇంద్రగంటి హనుమశ్ఛాస్త్రి* …..

మీ సంసారంలో భేదాభిప్రాయాలు వస్తే ఏంచేస్తారు? అన్నాను.

“నా అభిప్రాయం చస్తే చెప్పను.” అన్నాడు.


*ముళ్ళపూడి …*

“మీరూ మీ ఆవిడా మాటామాటా అనుకుంటారుట కదా? 

“నేను అనుకుంటాను.. ఆవిడ అంటుందండి!”



*కాటూరి………*

లేదు పోట్లాడుకోం, అన్నాడు. 

అంటే, మీరు చెప్పినట్లు ఆవిడ వింటుందా? అన్నాను. 

నేను చెప్పినట్లు ఆవిడ వింటుందని చెప్పానా? కోపంతో అరిచినంత పని చేశాడు.


*మునిమాణిక్యం....*

అమ్మో.. ఆమె అశ్రుధారాస్త్రాలను చూడలేను ఎన్ని తిట్లు తిన్నా.. నవ్వుతూ ఉండడమే. అన్నాడు.


*వేదుల....*

వున్నాయి కానీ నా బాధ ఎవరికీ చెప్పను.

కనుల  రానీయను  బాధను . “  అన్నాడు.


*మొక్కపాటి….*

నేను మద్రాసులో, ఆవిడ వైజాగ్ లో

ఫోనులో  దెబ్బలాడుకోవటం కుదరదు. పైగా డబ్బు ఖర్చు దండుగ కూడానూ, అన్నాడు.


*గిడుగు...* 

ఆవిడ అరిచి చచ్చినా నాకు వినపడదు.

నేను మాట్లాడటమే లేదు. మాట్లాడినా….సవర భాషలో మాట్లాడతాను, అన్నాడు.

( సవర " దక్షిణ  ముండా భాష .  మనదేశంలో 

మొట్టమొదట  ముండా భాషను శాస్త్రీయంగా 

పరిశీలించి ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 

సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు 

గిడుగు రామమూర్తి)


*వేలూరి …..*

వినపడనంత దూరంగా వెడతాను.”


*బుచ్చిబాబు…*

ఆవిడ విజ్ఞానఖని, విజ్ఞాన సర్వస్వం,

విజ్ఞాన భాండాగారం, అని తెలిసి నోరు మూసుకున్నా. ఎందుకంటే….ఎప్పుడు నేను నోరు విప్పబోతున్నా, ఆవిడ మీకేమీ   తెలియదు వూరుకోండి. మీకీ మాత్రం కూడా తెలియదేమిటండీ? అంటూ 

వుంటుందిలెండి.


*నారాయణబాబు……* "పెళ్ళికూతురిని చూడండి. చేసుకున్న 

తరువాత ఎలా వుంటుందో చూసి 

చెబుతాను" అన్నాడు.

(ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా జీవితం గడిపాడు)


*పండితరాజు …….* 

కావ్యానికే కాదు ధ్వని, అసలు ధ్వనితత్వం మా ఆవిడకి  తెలిసినట్లు 

ఆనందవర్ధనుడికి కూడా తెలియదేమో అన్నాడు.


*మధునాపంతుల……*

ఎన్ని అభిప్రాయబేధాలొచ్చినా

“ఆలి కుడిచేతి వేలికొసలు రాజుకొనువేళ 

రసఝరి వుప్పొంగు" అన్నాడు. 


*దేవులపల్లి....*

"పోట్లాట భరించలేను ఏడుపొస్తుంది.”

అన్నాడు.


*గరికపాటి...*

భార్యాభర్తలు రోజూ మనసు విప్పి కనీసం అరగంట  అయినా మాట్లాడు కోవాలి. అర్ధ గంటదాటితే మాత్రం మాట్లాడటం ఆపెయ్యాలి. లేకపోతే అనవసర విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అరగంట దాటితే  పని వుందని 

చెప్పి లేచి వెళ్ళిపోవాలి. కావాలంటే  మరల రెండోsitting వెయ్యాలి. వీలైనంత వరకు శ్రోతగా వుండటమే .

 

*అభ్యుదయ కవి…*

"అభ్యుదయ మార్గాన నడిచి చాల ముందు కొచ్చేశాను. ఇప్పుడు మా మధ్య దూరం బాగా ఎక్కువైంది" అన్నాడు.


*స్వామీజీ!...*

పోట్లాటలు ఎందుకు వస్తాయి, స్వామీ! తప్పించుకునే మార్గం ఏది? అని అడిగాను. 

“ఇది అనాది నుంచీ వస్తున్న సదాచారం నాయనా!! అనుకూలవతి అంటే ఏమీ

మాట్లాడకుండా వుండటం కాదు. 

తప్పించుకోవాలంటే నువ్వు రెండు మార్గాలు అనుసరించాలి…

1— విధేయత

2–సన్యాస స్వీకరణ.

*చివరగా ఓ మంచి ముక్క….“కొంపలో ఎప్పుడూ నీమాటే చెల్లాలని ఎట్టి  పరిస్థితుల్లోనూ అస్సలు అనుకోకు. తలపులోకి కూడా రానీయకు..."* 😁

🙏💐🙏శుభోదయం 🙏💐🙏

కామెంట్‌లు లేవు: