అయ్యప్పస్వామి కాల్పనిక దైవమా? లేక నిజంగానే హిందూధర్మంలోని దైవమా?
అయ్యప్పస్వామి ఉనికి మీద, పుట్టుకమీద ఎన్నో అనుమానాలు, అపహాస్యాలు మన హిందువులలోనే చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు బైరి నరేష్, రాజేష్ ల మూలంగా వచ్చిన వివాదం కారణంగా అయ్యప్పస్వామి భక్తులంతా ఏకమయ్యారు. హిందూ ధర్మంలో అయ్యప్పస్వామి ఉనికి గురించి చర్చించడానికి ఇది సరైన సమయం.
మన హిందూ వాజ్ఞ్మయం మొత్తం వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఆగమాల మీద ఆధారపడి ఉంది. గ్రామదేవతలనుంచి నిరాకారపరబ్రహ్మ
వరకు ఏ దేవతలను ఏయే మంత్రాలతో ఏవిధంగా ఏసమయంలో ఎలాంటి ద్రవ్యాలతో పూజలు, హోమాలు చేయాలో వీటిలో వివరంగా ఉంటుంది. దేవతలను మంత్రాలను వేదోక్తం, పురాణోక్తం అని రెండు రకాలుగా విభజన చేయాలి. అగ్ని, గణపతి, సుబ్రమణ్యం, సూర్యుడు, విష్ణువు, శివుడు, లక్ష్మీ, దుర్గ, రుద్ర, గౌరీ, సరస్వతి, బ్రహ్మ, ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, పితృ దేవతలు, వాస్తు, భూమి, సర్ప, గరుడ, గోవు లాంటి ప్రధాన దేవతల గురించి వేదమంత్రాలు ఉంటాయి. శ్రీ విద్య లాంటి కొన్ని పురాణోక్త మహావిద్యల గురించి కూడా వేదోపనిషత్తులలో వివరణ ఉంది.
పురాణోక్త దేవతలను గురించి చెప్పబడిన మంత్రోపాసనలకు పురాణాలతోపాటు విడిగా తంత్రాలు, కల్పాలు ఉన్నాయి. ఇలాంటి మంత్రాలు సప్తకోటి అంటే ఏడుకోట్లు ఉన్నాయని దాదాపుగా ప్రతి పురాణంలో వేదవ్యాసులు చెప్పారు. ఈ ఏడుకోట్ల మంత్రాలు పరమశివుని పంచముఖాలనుంచి వ్యక్తం కాగా కొన్నింటికి దక్షణామూర్తి ఋషిగా, కొన్నింటికి హయగ్రీవస్వామి ఋషిగా, మిగిలిన వాటిని ఆనందభైరవుడు ఋషిగా ఉండి దర్శించారు.
దక్షిణామూర్తి, హయగ్రీవస్వామి బోధించిన మార్గం దక్షిణాచారం, సమయాచారం అని, ఆనందభైరవుడు బోధించిన మార్గం వామాచారం అని ప్రసిద్ధి పొందాయి. వామాచారం బ్రాహ్మణులకు నిషేధం అని వాటిలో చెప్పారు. అలాగే వామాచారం పాటించేవారు తులసి, గంగలను వదిలేయాలని చెప్పారు. ఇక అందరికీ ఆమోదయోగ్యమైన దక్షిణాచారం లేదా సమయాచారాన్ని ఆరు ఆమ్నాయాలుగా విభజించారు. వీటిని షడామ్నాయ మంత్రాలు అంటారు. వేదంలో చెప్పిన మృత్యుంజయ, గాయత్రీ లాంటి సమస్త దేవతలకు తాంత్రిక బీజాక్షరమంత్రాలు వీటిలో చెప్పారు. వాసుదేవ ద్వాదశాక్షరి, శివపంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, కాళీ, తార , శ్రీ విద్య లాంటి మహామంత్రాలు, దశమహావిద్యలు ఈషడామ్నాయాలలో భాగమే.
వేదంలో చెప్పబడని చండీ, కాళీ, తార లాంటి దేవతామంత్రాలు కూడా షడామ్నాయాలలో కనబడతాయి. వీటిలో భాగంగా శాస్తా మంత్రం కూడా కనబడుతోంది. ఈ మంత్ర అంగన్యాస కరన్యాసాలలో శాస్తా, హరిహరపుత్ర, మహాశాస్తా, ధర్మశాస్తా, మహాశాస్త్రీ అనే పేర్లతో అయ్యప్పస్వామి మంత్రోపాసన గురించి ఉంది. ఈ మంత్రానికి బ్రహ్మ ఋషి అని చెప్పారు.
దీనితో పాటు ప్రసిద్ధ లలితా సమస్రనామం చెప్పిన బ్రహ్మాండపురాణం, లలితోపాఖ్యానంలో హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి ప్రాయశ్చిత్తకర్మల గురించి చెబుతూ "లక్ష్మీః సరస్వతీ గౌరీ చండికా త్రిపురాంబికా, భైరవో భైరవీ కాళీ మహాశాస్త్రీచ మాతరః" అంటూ లక్ష్మీ, సరస్వతి, గౌరి, చండిక, త్రిపురాంబిక, భైరవ, భైరవి, కాళీలతో పాటు మహాశాస్త్రీ అంటూ అయ్యప్పస్వామిని కూడా పూజించాలంటారు. ఈ లలితోపాఖ్యానంలోనే మహామాయ గురించి చెబుతూ మన్మథుడిని సైతం భస్మం చేసిన పరమశివుడు మహామాయ ప్రభావం వల్ల జగన్మోహిని అవతారం చూసి మోహానికి గురైన కారణంగా హరిహరపుత్ర జననం జరిగిందని స్పష్టంగా ఉంది.
సహ్యాద్రి నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ కనుమలలో అనేక ప్రాచీన దేవాలయాలను పరశురాముడు ప్రతిష్ట చేశారు. పోర్చుగీస్, టిప్పుసుల్తాన్, బ్రిటీష్ వాళ్ల దాడుల్లో వీటిలో ఎక్కువ శాతం ధ్వంసమై దోపిడీకి గురై దశాబ్దాల తరబడి ఆదరణ లేకుండా పోయాయి. స్వాతంత్ర్యం తరువాత ఈపరిస్థితి కొంత మారిన కారణంగా తిరిగి అయ్యప్పస్వామి దేవస్థానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ స్వామి మీద ఒక సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు తోడు కావడంతో దక్షిణాదిలో స్వామిమాలధారులు విపరీతంగా పెరిగారు. షిర్డీసాయి సినిమా కూడా దాదాపు ఇదే సమయంలో రావడం వల్ల కొంతమంది సనాతన వాదులు సాయిబాబాలాగా అయ్యప్పస్వామి కూడా ఈమధ్య కాలంలో పుట్టించిన దేవుడని అపోహ పడుతున్నారు.
దీనికి సినిమా వాళ్ళు సృష్టించిన వావరు స్వామి, మకరజ్యోతి గురించి కల్పనలే కారణం. వావరు స్వామి సెక్యులర్ రైటర్స్ సృష్టించిన కథ. అరుణాచలంలో ఏటా కొండమీద వెలిగించే అఖండ దీపం లాంటిదే మకరజ్యోతి. దీన్ని అర్థం చేసుకుంటే అయ్యప్పస్వామి గురించి ఎలాంటి అనుమానాలు అపోహలు ఉండవు.
- స్వామి శరణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి