నరసింహస్వామి – నరసింహుడు
దంపతులొకరికి పరమాచార్య స్వామివారిపై ఎనలేని భక్తి విశ్వాసాలు. స్వామివారికి పూజ చెయ్యకుండా వారి దినచర్య మొదలయ్యేది కాదు. ఆ ఇంటి ఇల్లాలు కడుపుతో ఉంది. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలని మహాస్వామివారిని ప్రార్థించని రోజు లేదు. వారి ఇంటి దైవం నరసింహ స్వామి అయినా వారి ఇంటి ఇలవేల్పు పరమాచార్య స్వామి అయ్యారు.
ఒకరోజు రాత్రి ఆవిడ పడుకుని ఉండగా కలలో నరసింహస్వామి ప్రత్యక్షమై పుట్టబోయే బిడ్డకి తన పేరు పెట్టాల్సిందిగా తెలిపాడు. కాని ఆమె తమ ఇంటిలో ఏపని చేసినా కంచి మహాస్వామి వారిని సంప్రదించకుండా చెయ్యమని దేవుడితో వాదులాడింది. కాని నరసింహ స్వామి వదలలేదు. చేసితీరవలసిందే అని చెప్పి అంతర్థానమయ్యాడు.
ఉదయం ఈ విషయమంతా తన భర్తతో చెప్పింది. వారు తమ పిల్లవానికి నరసింహుడు అని పేరుపెట్టడానికి నిర్ణయించారు. బిడ్డ పుట్టగానే మహాస్వామి వారికి ఈ విషయం చెపుదాము అని అనుకున్నారు. ఎంతైనా ఇంటి దైవాన్ని, ఆ వాక్కుని వదలకూడదు కదా!!
వారికి అందమైన ఒక మగశిశువు జన్మించాడు. జాతాశౌచాది కర్మలన్ని ముగియగానే వారు పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. తమకు వచ్చిన కల గురించి తెలిపి స్వామివారి సలహా తీసుకుందామని అనుకున్నారు.
దర్శనంలో వారి వంతు రాగానే బిడ్డని స్వామివారి పాదాల వద్ద ఉంచారు. ఆ పిల్లవాణ్ణ్ణి చూడగానే స్వామివారు చిరునవ్వుతో ఆ పిల్లాడితో మాట్లాడుతున్నట్టుగా, “సాధారణంగా జాతకర్మలు ముగిసిన తరువాతనే పిల్లలకు పేర్లు పెడతారు కాని వీడు కడుపులో ఉండగానే పేరు పెట్టుకుని పుట్టాడు. అవును కదా ‘నరసింహా’?” అని అన్నారు.
ఆ దంపతులు వారి ఇబ్బందిని స్వామివారికి చెప్పక మునుపే స్వామివారే దానికి పరిష్కారం చూపారు. స్వామివారు ఈ రీతిగనే భక్తులను అనుగ్రహిస్తుంటారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి