27, మార్చి 2023, సోమవారం

అంబికాతత్వము

 అంబికాతత్వము


అమెరికాదేశంలో ఫిలడెల్ఫియా అనే నగరంలో పెన్సిల్‌వేనియా యూనివర్సిటీ అనే సర్వకళాశాల ఒకటి ఉంది. అదే నగరంలో 'ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్' అనే ప్రదర్శనశాలకూడా ఒకటి ఉంది. దానిలో భగవత్పాదులు వ్రాసిన సౌందర్యలహరిలోని ఒక్కొక్క శ్లోకాన్ని అనుసరించి గీయబడిన చిత్రాలు ఉన్నాయట. అవి సర్వాంగ సుందరాలట! అచటి ప్రధాన సంస్కృతాచార్యులు మూడు చిత్రాలను ఫోటోతీసి మద్రాసు విశ్వవిద్యాలయం వారికి పంపి, ఆ చిత్రాల వివరణ ఏమిటని ప్రశ్నిస్తూ ఒక ఉత్తరం వ్రాశారట. ఆచిత్రాలలో ఒకటి ''మనస్త్వం వ్యోమత్వం'' అన్న శ్లోకానికి గీచిన చిత్రం. దానికి ముందున్న శ్లోకం ''శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం...'' 


పార్వతీ పరమేశ్వరుల సంబంధం - శరీర శరీరభావ సంబంధం; శేష శేషిభావసంబంధం. శరీరంలో ప్రాణం ఉంది. ఇవి రెండున్నూ ఒక దానిని విడచి మరొకటి ఉండటానికి వీలులేదు. 'శరీరం త్వం శంభోః' శంభునికి శరీరంగా అంబ ఉన్నదని ఆచార్యులంటున్నారు. 


మన కండ్లకు గోచరించే ఈ వ్యస్తప్రపంచం నిజానికి అంబికాస్వరూపమే. అఖండంగా సర్వత్ర వ్యాపించి సర్వ ప్రపంచాకృతిగ వెలుగుతూఉన్న ఆ పరదేవత యొక్క స్తనద్వయమే సూర్యచంద్రులు. సూర్యరశ్మి, వెన్నెల లేకపోతే అసలు జగత్తు అనేది ఉండదు. ప్రాణికోటి సమస్తమూ ఆ జగద్ధాత్రికి, శిశుప్రాయం అవటంచేత, తల్లి తన బిడ్డలకు స్తన్యమిచ్చే విధంగా సూర్యచంద్రులనే స్తనద్వయంతో అమృతధారలు వర్షిస్తుంది.


మనస్త్వం వ్యోమ త్వం మరు దసి మరుత్సారథి రసి 

త్వ మాప స్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహిపరమ్ 

త్వ మేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా 

చిదానందాకారం శివయువతిభావేన బిభృషే|| 


''అమ్మా! పంచభూతముల రూపు నీవై యున్నావు. వాని కతీతమైన మనస్సున్నూ నీవే. ఈ ఆకాశం, ఈ గాలి, ఈ భూమి, ఈ జలం, ఈ తేజస్సూ, ఈ మనస్సూ ఇవన్నీ నీవు కాకపోతే మరెవరు? 'త్వయి పరిణతాయాం నహింపరమ్' ''అన్ని స్వరూపాలున్నూ నీయొక్క పరిణామంగానే ఉన్నాయి. అంతేకాదు. మావద్ద ఉండే ఈ జ్ఞానలేశమూ, ఆనందమూ నీచిదానందచ్ఛాయలే నీవు శరీరము; శివుడు శరీరి. శివ యువతిభావం మీ యిద్దరిలోనూ ప్రస్ఫుటమౌతోంది'' అని ఆచార్యులు వర్ణిస్తారు. 


ఫిలడెల్ఫియా చిత్రాలను చూచినప్పు డీశ్లోకం గుర్తు వచ్చింది. 


లీయే పురహరజాయే మాయే తవ తరుణవల్గవచ్చాయే, 

చరణే చంద్రాభరణే కాంచీశరణే నతార్తిసంహారణే|| 


- మూకపఞ్చశతి. 


''అమ్మా! నీపాదాలు లేజిగుళ్ళవలె విలసిల్లుతున్నాయి. చంద్రావతంసవై కాంచీనగరాన్ని నీవాశ్రయించి, నీపాదాల నాశ్రయించినవారి దుఃఖాన్ని పోగొట్టుతున్నావు. నీ చరణాలపై నాచిత్తం హత్తుకొనిపోయింది. దానితోబాటు నా ఆత్మకూడా ఐక్యం అవుతూఉంది'' అని మూక కవి అంబికను స్తవంచేశాడు. ఇందు ''మాయే'' అనే పదం ఉంది. మాయ అంటే ఏమిటి? పురాణాలు మాయాశబ్దానికి అర్థం వివరిస్తూ 'యామా' ఏది లేదో అదే మాయ అని అన్నాయి. ఐతే లేని వస్తువుకు నామకరణ మెందుకు? ఉన్నదా లేదా అన్న విచికిత్స - ఒక వస్తువు ఉన్నట్లు తోస్తేనే కదా కలుగుతుంది? మాయావస్తువు ఉన్నట్లు కనిపిస్తుంది. పరిశీలన ప్రారంభిస్తే లేదని తేలుతుంది. అదే మాయ, మా శబ్దానికి లక్ష్మి అనికూడ ఒక అర్థం. 'విద్యుచ్చపలాలక్ష్మీః' మాయా గుణం లక్ష్మికి సంపూర్ణంగా అన్వయిస్తుంది. లక్ష్మి మన వద్ద ఉన్నట్లే ఉంటుంది. కాని ఉండదు. గోచరిస్తూ ఉంటుంది. తీరా చూస్తే మాయమౌతూ ఉంటుంది. 


లేని వస్తువు గోచరించడం దేనికి? పైగా చూడబోతే మాయ మవటమెందుకు? ఐతే ఇందులోనూ ఒక ఆనందం ఉందనక తప్పదు. ఇదీ ఒక ఉత్పాహమూ ఉల్లాసమూను. అంబిక ఆనందరూపిణి; ఆమె సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. సాధకుని ఆనందానికై తానొక రూపుదాల్చి, అనుగ్రహించడంకోసం అవతరిస్తూ ఉంటుంది. మన అల్పమైన మనస్సులకు ఒక ఆధారం కనిపిస్తేకాని ఆనందం కలగడం లేదుకదా! 


తల్లి వంటయింట్లో యేదో చక్క బెట్టుకొంటూ ఉంటుంది. వసారాలో బిడ్డ ఆడుకొంటూ ఉంటుంది. కాని బిడ్డకు తల్లి జ్ఞాపకం వచ్చినంతనే బొమ్మలను ఒక ప్రక్కకు నెట్టి ఏడుపు ప్రారంభిస్తుంది. లోపలనుండి తల్లివచ్చి సముదాయించేవరకు రోదనానికి ఉపసంహారం ఉండదు. అట్లే దర్శనానికి తహతహలాడే భక్తునికోసం నిరాకార అయిన అంబిక సాకార ఔతోంది. 'ఘృతకాఠిన్యవత్' - ద్రవరూపంలో ఉన్నప్పుడు నేతికి రంగులేదు. కాని చలికాలంలో నేయి పేరినప్పుడు లేదా గాలి తగిలినప్పుడు గడ్డకట్టి తెల్లనిరంగు ఏర్పడుతుంది. అట్లే భక్తకోటి హృదయసీమలో ప్రేమశైత్యం అధికమైతే, అఖండాకార నిరాకార పరమాత్మ ఘనీభూతమై ఒక రూపునెత్తి ఆవిర్భివిస్తూ ఉన్నది. ఆమెయే త్రిమూర్తి స్వరూపిణియూ అయిఉన్నది. 


'సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ, 

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ, 

సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణా||' 


అని లలితాసహస్రనామములు చెప్పుతున్నాయి. మూడు మూర్తులనియు ఐదు మూర్తులనియు ఒక లెక్క లక్ష్మీ సరస్వతుల అష్టోత్తర శతనామావళులలో బ్రహ్మ విష్ణు శివాత్మికా అన్న సంబోధన ఒకేతీరుగా కానవస్తుంది. కార్యాల నుద్దేశించి ఆకారాలున్నా స్వరూపం ఒక్కటే. 

అనంతపద్మనాభస్వామికూడ త్రిమూర్తిస్వరూపమే. తిరువనంతపురంలో ఆయన శేషశయ్యపై పండుకొని ఉంటాడు. ఆయన నాభికమలంలో బ్రహ్మ శిరఃపార్శ్వాన లింగాకృతియై శివుడు కానవస్తారు. అశ్వత్థవృక్షం కూడా ఇదేవిధంగా బ్రహ్మ విష్ణు శివాత్మకమని ఈ క్రింది శ్లోకం చాటుతూ ఉంది. 


మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే, 

అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః|| 


'నీవు నిరాకారవైనా నన్ను అనుగ్రహించే నిమిత్తం సాకార మవుతున్నావు; నీవు అనంతవు; నిరవధికవు! అని ఆచార్యులవారు అంబికను స్తవం చేస్తున్నారు. 


అంతములేనివాడనంతుడు.సంఖ్య ఒకటి, రెండు, మూడు అని పెరుగుతూపోతుంది. మరి అనంతానికి చిహ్నం ఏది? ఇన్ఫినిటీని (పారార్థ్యాన్ని) ఏ సంఖ్యతో చూపాలి? 


భాస్కరాచార్యులవారు బీజగణితాన్ని వ్రాశారు. దానిలో మంగళశ్లోకం వ్రాస్తూ - 'అనంతమైన పరమాత్మచాలు నష్టమౌతున్నాయి. సృష్టికాలంలో ప్రపంచాలు పుట్టుకొస్తున్నవి. కాని ఆయనలో మాత్రం అణుమాత్రమూ భేదంలేదు. సమస్తమూ ఆయనలోనుండి నిర్గమించి ఆయనలోకి లయం ఔతున్నవి. అందులో అల్పం అధికం అన్నది లేదు. ఆయనే అనంతుడు. అట్టి అఖండానంద పరమాత్మకు నాప్రణతులు.'అని పరమాత్మను ప్రార్థన చేశారు. 


దశోపనిషత్తులలో బృహదారణ్యకం ఒకటి. దానిపేరే దాని విస్తృతిని తెలుపుతుంది. ఆచార్యులు దీనికి భాష్యం కూడా విస్తారంగా వ్రాస్తూ సూక్ష్మంగా వ్రాస్తున్నానని సెలవిచ్చారు. తత్త్వంలో బృహదారణ్యం నిజంగా అరణ్యమే. అందులో శాంతిమంత్రం ఇలా ఉంది. 


ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణా త్పూర్ణ ముదచ్యతే, 

పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే|| 


'అది పూర్ణము, ఇదీ పూర్ణమే. ఈ ప్రపంచము నిరవధికం. ఈ నిరవధిక ప్రపంచం పరమాత్మలో ఉంది. ఆ పూర్ణంలో ఈ పూర్ణం కలిపినా తీసివేసినా మిగిలేది పూర్ణమే. 


'పరమాత్మ ఏకస్వరూపమూ అద్వితీయమూ అయిఉంది. లేనిదేదో అదే మాయ. ప్రకృతి మాయ. ప్రకృతిని తనలో కల పరమేశ్వరుడున్నూ మాయమే. అదీ లేనిదే, ఇతడూ లేనివాడే. పూజ్యమునకు పూజ్యముచేర్చిన మిగిలేది కూడ పూజ్యమేకదా! అందుచే ఎక్కువాలేదు. తక్కువా లేదు. అని ఆచార్యులన్నారు. పరమేశ్వరునే 'మాయ', 'లేనివాడు' అంటే మనల్ని పరిహసించరా? అని ఎవరో శంకిస్తే - పరమేశ్వరునే పరిహాసంచేస్తే మనలనూ చేయనీ - అని ఆచార్యులు బదులు చెప్పారట. 


రజ్జు సర్పన్యాయం మనమందరమూ ఎరిగినదే..రజ్జువులో సర్పాన్ని చూస్తే రజ్జువు ఏ విధంగానూ అధికంకాదు. మిథ్యాసర్పం రజ్జువుగా మారితే దానికి కలిగే కొరత కూడ ఏమీలేదు. 


సీతాదేవి ఎట్లున్నది? అని ఎవరో అడిగారట. దేవ మాయవలె ఉన్నదని సమాధానం. లేనివస్తువు ఉన్నట్లు కనబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నదన్నమాట. చిత్రంలో దృశ్యాన్ని గీస్తారు. అది దృశ్యాన్ని స్ఫురింపజేస్తుంది. కాని దృశ్యంకాదు. సీతాదేవి విషయంకూడా అంతే. 


అన్ని సంఖ్యలకు సంకేతాలున్నాయి. అనంతానికి సంకేతం ఏమిటి? భాస్కరాచార్యులు ఒకటిని లవంగాను పూజ్యాన్ని హారంగాను గ్రహించి ఒక భిన్నం చూపితే అది అనంతానికి సంకేతం అవుతుందన్నారు.(1/0). రెండును రెండుచే భాగిస్తే విభక్తం ఒకటవుతుంది. 2 ను విభాజ్యంగా తీసుకొని 1, ½, ¼  సంఖ్యలను విభాజకాలుగా తీసికొని భాగిస్తే 2, 4, 8 సంఖ్యలు విభక్తాలవుతాయి. ఇట్లే 16ను 1/8 చే భాగిస్తే విభక్తం 128 అవుతుంది. విభాజకం పెరిగేకొద్దీ విభక్తం తగ్గుతుంది. విభాజకం తగ్గేకొద్దీ విభక్తం పెరుగుతుంది. విభాజకము అత్యంత కనిష్టమై అణుపరిమాణమై సూక్ష్మాతి సూక్ష్మమైతే విభక్తం 'అనంతమౌతుంది.' సున్న అతి సూక్ష్మసంఖ్య. 'ఖ' అనగా ఆకాశము, పూజ్యము. హారమనగా భాగించుట. సున్నను విభాజకంగా తీసుకొని ఎంతటి పెద్ద సంఖ్యనైనాసరే భాగిస్తే వచ్చే విభక్తం ఒకటే అవుతుంది. ఖహారమంటే ఇదే. 


ఏ సంఖ్యనైనా భాగించేవేళ మనం కనుగొన్న విభక్తం సరైనదోకాదో తెలుసుకొనడానికి విభాజకాన్ని విభక్తంతో గుణించి విభాజ్యం వస్తున్నదా లేదా అని పరిశీలిస్తాం. ఈ ఖహారంలో - అంతే ఏ సంఖ్యనైనా సున్నతో భాగించే దానిలో విభాజ్యం ప్రపంచతుల్యం అవుతుంది. నానా నామ రూపాలతో అనంతంగా ఉన్న ఈ విశ్వమే విభాజ్యం సున్న లేక పూజ్యం, గణితపరిభాషలో అనిర్వచనీయం అనగా దాదాపు ఏమీలేని 'మాయచే' భాగిస్తే వచ్చే ఫలము లేక జవాబు-అనంతము! 'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' ప్రపంచాన్ని సృష్టించడానికి బ్రహ్మ (బ్రహ్మ్స విభక్తము) తన్ను మాయతో (మాయ్స విభాజకము) గుణించుకొంటూ ఉంది. సున్నచే ఏ సంఖ్యను భాగించినా వచ్చే విభక్తం ఒకటే. ఒకటి, రెండు, మూడు మొదలైనవి భేదసంఖ్యలు. అని ప్రపంచంయొక్క నానాత్వ చిహ్నాలు. ఏకమే అనేకం అయింది. ఆ అనేకం కావడం మాయాసంపర్కంచేత. అనంతుడైన పరమాత్మ మాయా సంపర్కంతో తన్ను గుణించుకొంటూ ఒకటి రెండు మూడు అని అసంఖ్యాక నామ రూపాదులతో ఒప్పారుతున్నాడు. ఐతే ఏ విభక్తాన్నైనా సున్నతో పెంచితే సున్నయే వస్తుంది గనుక అనంతాన్ని మాయతో గుణిస్తే వచ్చేదీ మాయయే. అనంతుడు గుణ్యము; మాయ గుణకము; ప్రపంచము లబ్ధము. ఈ హారంలో విభాజ్యం ప్రపంచంయొక్క నానాత్వమే. అనగా నానాత్వంలోని ఏకత్వమే, విభక్తం అంటే బ్రహ్మ (అనగా సత్యము) అఖండమూ, అనంతమూ అయిఉంది. శాంతి మంత్రంలో 'పూర్ణం అదః' అంటే విభక్తం; అద్వితీయమైన అనంతం. 'పూర్ణం ఇదం' అంటే విభాజ్యము; నానారూపాత్మకమైన అనంతం అద్వైతానంతాన్ని పూజ్యంచే గుణిస్తే ద్వైతానంతం లభిస్తుంది. ద్వైతానంతాన్ని ఖహారంచేసి, సున్న లేక మాయచే భాగించి దాని నానాత్వాన్ని తొలగిస్తే అద్వైతానంతం వస్తుంది. అనంతానికి రూపంలేదు. అది అద్వితీయం. మాయ దానిని గుణించి నానావిధ రూపాలను ధరిస్తూఉంది. ఉన్నది ఒక్కటి, దానికే విలువ, నానాత్వం మాయాకార్యం కనుక, మాయ అంటే ఏమీలేనిది కనుక ఈ నానాత్వంకూడా ఏమీ లేనిదే; అంటే విలువ లేనిది, అందుచే మాయ గుణించినా భాగించినా ఆ బ్రహ్మలో ఏవిధమైనా మార్పూ ఉండదు. ప్రపంచంయొక్క సృష్టిప్రళయాలు ఆ అనంతునిలో ఏవిధమైన మార్పూ కలిగించలేకున్నాయి. 


ఆ జగజ్జనని, శివయువతి, పురహరజాయ, నానా నామరూప భేదాలతో ఏకాన్ని అనేకం చేస్తూ నిరాకారబ్రహ్మకు ఆకారాలు అంటగట్టుతూ, మన ఆనందానికి, మనలను అనుగ్రహించడానికి చిదానందాకారంలో విశ్వశరీరయై విలసిల్లుతూ ఉంది. ఆ మాయాశక్తియొక్క అనుగ్రహం లేనిదే, అనేకత్వం నుండి ఏకత్వానికి చేరలేము. అద్వైతసిద్ధిని అందుకోవాలంటే ఆ ఆదిశక్తి అనుగ్రహం అవసరం.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: