26, మార్చి 2023, ఆదివారం

..మా తెలుగు.

 *నేను...మా తెలుగు....*


మేము మీకు అత్యంత సమీపములోయుండు తమిళనాడులో నివసిస్తుండే తెలుగు వాళ్ళము. మా జనాభా తమిళనాడులో దాదాపు రెండన్నర నుండి మూడు కోట్లు. ప్రస్తుత తమిళనాడు జనాభా 8 కోట్లు. అంటే తెలుగువారి సంఖ్య దాదాపు 35 శాతము.


సరే తెలుగు వారి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీ ఊహలకు కూడ అందని ఘోరమైన పరిస్థితి అది. ఒకింత ఓపికతో చదవండి.


01. ప్రస్తుతము మాకు మొత్త తమిళనాడులో  తెలుగు బడులు లేనే లేవు. 


02. మా ఇండ్లలో తెలుగు బాష మాటలాడడం కూడ దాదాపు మరచి పోయినాము. మూట కట్టి పడేశాము అనుకొండి. 


03. ఉద్యోగ నిమిత్తం తెలంగాణా కాని లేక ఆంద్రప్రదేశము నుండి వలస వచ్చిన వారిని వినహాయించి మాలో తెలుగు వ్రాయడం లేక చదవడం తెలిసినవారి సంఖ్య మొత్త తమిళ నాడులో రెండు లేక మూడు వందలను కూడ దాటదు. వారెవరంటే ఇప్పట్లో దాదాపు 70 సంవత్సరములు మించిన వారు అలనాడు తెలుగు బడులలో చదివిన వారౌతారు. వారికి పిదప స్థానీయ తెలుగు వారికి తెలుగు బాష చదవడం లేక వ్రాయడం కూడ తెలియదు. ఇది ముమ్మాటికీ సత్యం. మూడు కోట్లో మూడు వందలు.‍... ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి.


04. ప్రస్తుతం మా ఇండ్లలో మాటలాడడం కూడ తమిళ భాషలోనే చలామణి ఔతున్నది. మా పిల్లలు తెలుగు మాట్లాడడం మరచి పోయారు, లేక వారి మాటలలో దాదాపు 60 శాతము పదాలు తమిళ పదాలే. అంతఘోరమైన తెలుగు.


05. మా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలైన హోసూరు , చిత్తూరు పక్కలోయుండే ప్రాంతాలైన రాణీపేట, వేలూరు, నగరికి సమీపములోని తిరుత్తణి, తడకు సమీపములోని గుమ్మిడిపూండీ  కాక చెన్నైలోని ఉత్తరప్రాంతాలైన పారిస్ కార్నర్, ఫోర్ట్, చెన్నై సెంట్రల్, టి.నగర్ ప్రాంతాలు వినహాయించి వేరెక్కడను తెలుగు వార్తాపత్రికలు దొరకవు. పై ప్రాంతాలలోనూ ఏ అతి స్వల్పమైన కొట్లలో మాత్రము అందునా రోజుకు పదికి తక్కువైన సంఖ్యలోనే ఆ వార్తా పత్రికలు దొరకుతవి. ఇది మూడు కోట్ల జనాభా యుండే తెలుగువారి గతి.!!!


06. త్యాగయ్య జనించిన తిరువైయారులో తెలుగును భూతద్దం పెట్టి వెదకినా సరే, తస్మాత్ జాగ్రత్త,  సూక్ష్మరూపంలోకూడ కనబడదు సుమా.


07. దాదాపు 60 ఎళ్ళ క్రితం అనేక ప్రభుత్వ గ్రంథాలయములలో (లైబ్రరీ) తెలుగు పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఆ గ్రంథాలయములలోని అన్ని తెలుగు పుస్తకాలను తమిళనాడు ప్రభుత్వము లోబరచుకొని వాటిని ధ్వంసం చేసేసారు, ఏ కొన్ని తమిళనాడు ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణకు లోబడని (కేంద్ర ప్రభుత్వ సహఆయము పొందిన) ప్రాచీన గ్రంథాలయములు మాత్రమే ఆ చర్యకు లోబడలేదు. ఉదా సరస్వతీ మహల్ తంజావూరు మొదలైనవి. సరస్వతీ దేవి కదా!!! తన్ను జయింప సాధ్యమా.


07. జారీ చేయబడిన ఏకొద్ది (చేతి వేళ్ళతో ఎంచవచ్చు) తెలుగు బడులలో తెలుగు అధ్యాపకులు లేరు. వారి పరీక్షా పత్రములను ఎలా తిద్ది మార్కులేస్తారో, ఆ భగవంతునికే తెలియాలి. ఏవో కొన్ని బడులలో ఉండు ఆధ్యాపకులకెవరికైనా ఒకింత తెలుగు తెలిసియుంటే అతను గణితము, విజ్ఞనము లేక వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము,రసాయన శాస్త్రము,వంటి వేరేదైనా సాంకేతిక శాస్త్ర  అధ్యాపకుడైయుండినకూడా కనికరముపై ఆ పిల్లలకు ఒకింత తెలుగు నేర్పవచ్చును. తెలుగు పండితులు అనే జాతి ఇక్కడ అంతరించి పోయింది. అంతే.


08. ఇప్పటి ఇచ్చటి తెలుగువారికి ఏ ఒకింత తెలుగు తెలిసియుంటే అది గద్యరూప తెలుగే కాని భగవంతుని సాక్షిగా పద్యములంటే ఏమి, ఆ పద్యములలోని యతి,గణ,ప్రాస,అలంకార లక్షణములు గూర్చి ఏమియు తెలియవు. అసలు ప్రతిరోజు చలామణిలోయుండే మాటలలోనే  సాదారణమైన తెలుగు పదాలే అంతరించి పోయినవి. మా ప్రాంతాలలో తెలుగు భాష దౌర్భాగ్య స్థితి అనడంకన్నా భాష ఔన్నత్యమునకు మేమంత పాటుపడినాము. సంస్కృతము దేవ భాష, ఎందుకంటే కాల క్రమేణ దానిని మరచిపోయినాము. అదే స్థానానికి మేము తెలుగును తీసుకెళ్ళినామంటే అది మా భాషాభిమానము, నమ్మండి.


09. తెలుగు భాషలోని అరసున్నలు పూర్తిగా మరచిపోయినాము. మాకు "శ,స,ష" ల ఉఛ్ఛారణలు కూడ సరిగ్గా తెలియవు. "ర" మరియు బండి "ఱ" లు ఎప్పుడెలా ఉపయోగించాలో మరచి పోయాము. ఇప్పటి మా ప్రాంత తెలుగు వారికి తెలుగు బాషలోని అక్షరాల సంఖ్యకూడ తెలియవు. అలాంటప్పుడు ఇటువంటి సూక్ష్మ విషయాలను గమనింప సమయముందా. వదలేద్దాం.


10. కొలత మానికల పేర్లను సైతము మేము పూర్తిగా మరచిపోయినాము. ఉదాహరణకి తులము, పలము, వీశె. శేరు, మణుగు, భారము, అంగుళము, అడుగు, గజము, పొడుగు, వెడల్పు, పరిధి, వ్యాసము, వైశాల్యము, ఘనపరిమాణము, ఇలాంటి పదాలు ఏకొన్ని కోమిటి కుటుంబాల పిల్లలు తప్ప మరెవ్వరికి గుర్తు కూడా లేదు. ఈ పదాలలో కొన్ని కోమిటివారి పిల్లల రక్తంలో చేరి పోయిన పదాలు గనుక  నేటికీ వారిలో కొందరికైనను ఆ పదాలు గుర్తుంటుంది. పాపం వారిని క్షమిస్తాము.


11. అసలు రుచుల పేర్లను తెలుగులో చెప్పడం కూడ ఈ నాటి తమిళనాడులోని తెలుగు పిల్లలకు తెలియదు. అంత దిగజారిన పరిస్థితి. కాదు,కాదు, మేము అంత ఎదిగి పోయినాము. అసలు రుచుల పేర్లే తెలియక పోతే ఇక తెలుగు బాష రుచిని ఎలా వర్ణింపగలము.


12. మేము మాటలాడుకొను సందర్భాలలో మా దేహ పరిస్థితిని గూర్చి మా ఎదుటి తెలుగువారితో మాటలాడు సందర్భాలలో మాటలాడునపుడు మాకు అసలు దేహ ఆరోగ్యం, లేక స్థితిని గూర్చి తెలుప తెలుగు పదాలను కూడ పూర్తిగా మరచిపోయినాము తమిళ పదాలే నోటినుండి జారుతున్నవి. ఈ కాలములో మన దేహ ఆరోగ్యాలు ఏమి లక్షణంలో ఉందో మా ప్రాంతంలో మా తెలుగు బాష అదే లక్షణంలో ఉంది, కాక ఇంకా క్షీణించిన విధంగా ఉన్నది. ఏమో అంటారే యథా రాజా తథా ప్రజా అని. అలా మేము ఏమి లక్షణంలో ఉన్నామో, మా తెలుగు అదే లక్షణంలోనే ఉన్నది. 


13. ఇక మాకు, తెలుగు వ్యాకరణమునకు ఏ విదమైన సంబందము లేవు. మించి మించి పోతే అమావాస్యకు అబ్దుల్ ఖాదర్ కు ఉండే సంబందం. ఇక వర్తమాన, భూత, భవిష్యత్ కాల క్రియా పదములకు మాకు ఏ విదమైన పరస్పర సంబందము లేవు. మహాప్రాణముల ఉచ్ఛారణ, ఎప్పుడు ఎలా వాటిని ఉచ్ఛరించాలి అనే విషయము మాకిసుమింతయు తెలియదు, మరచి పోయినాము అంతే. అసలు తెలుగులోని మొత్త అక్షరాల సంఖ్యనే మరచిపోయిన మాకు ఇదొక లెక్కా. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు, సమాసములు,సంధులు, సంధి సూత్రములు, ఆమ్రేడితాలు, ద్వందములు, ద్విగువులు, ...ఇవంతా ఏమి, కిలో ఎంత, ఎక్కడ దొరకుతుంది అని అడిగే వాళ్ళమైపోయాము. 


14. సమయానికి ఒక్క పదమే సరిగ్గా తెలియని మాకు పర్యాయపదాలు తెలిసే భాగ్యమున్నదా. ఛీ..ఛీ.. లేదండి. దయచూపి మమ్మల్ని వదలేయండి, మేము అయ్యో పాపం కదా. కనికరించండి.


15. కనీసం తెలుగులో రంగుల పేర్లను కూడ గుర్తింప తెలియని వాళ్ళమైపోయాము. అచ్చ తెలుగులో పక్షుల పేర్లు, మృగాల పేర్లు, నానా రక వృక్షాల పేర్లు, ఇవంతాకూడ మాకు మరుగై పోయింది. అంతట్లోనూ అమాంతం తమిళ, ఇంగ్లీషులే చోటు చేసికొన్నవి. మాతృభాషను  కోల్పోయిన దౌర్భాగ్యులం.


ఇంకా ఇలా ఎంతో చెప్పుకో పోవచ్చు. 


ఒక్క క్షణం ఆగి కారణాలను వెదుకుదాం. 1960 లలో ఒక విష పురుగు మొలిచింది. అదే తమిళనాడులోని కళగంలు. చీడ పురుగులు. మేము పిల్లలుగా ఉండినపుడు మా ప్రాంతములో తెలుగు తమిళ కన్నడ పిల్లలు కుటుంబాలు చాల అన్యోన్యముగా మసలుతుండినాము. నేను పిల్లవానిగా ఉండినపుడు గ్రంథాలయంలో తెలగు,తమిళ, కన్నడ పత్రికలు, పుస్తకాలు, వార్తాశపత్రికలు అన్నీ ఉండేవి. నేను 5 వ తరగతి చదువుతున్నప్పుడే తమిళము, కన్నడం నేర్చుకోవాలనే తపన. దాదాపు అందరు అలాగే ఉండేవాళ్ళము. కానీ ఈ కళగంలు వచ్చిన వెంటనే బాష విరోదత్వ బీజాలు నాటినారు. తమిళనాడును మొత్త ఇండియానుండి విభజించి " తనితమిష్నాడు" అంటే ప్రత్యేక తమిళనాడును భారతమునుండే విభజించి తమిళ వాళ్ళు పాలించాలనే ప్రణాళిక తీసుకొచ్చారు. కాని అది కొనసాగలేదు, కాని విభజనా శక్తులు తలెత్తాయి. దానితో వేరు బాషలను అణగ త్రొక్క ప్రారంబించారు. 1964లో ఆంటీహిందీ అజిటేషన్ చైకొన్నారు. స్కూలు పిల్లలలో విభజనా విషాన్ని చేర్చారు. స్కూలు పిల్లలను, తమిళ టీచర్లను ఆ పనులకుని అప్పటి (డి.ఎం.కే) ద్రావిడ మున్నేట్ర కళగం తీర్చి తిద్దింది. 1967లో మొదటి తూరి ఈ కళగంల చేతిలోకి ప్రభుత్వం చేరింది. అప్పుడు పట్టిన ఈ శని నేటి వరకు తమిళనాడును విడువ లేదు. తమిళము తప్ప మరన్ని బాషలను అణగత్రొక్కింది. నేను స్కూలులో చదువుతున్న కాలమందు  అంటే 1960 ప్రాంతాలలో తెలుగు పిల్లల సంఖ్య 60 శాతము. తమిళం 40 శాతము. నేడు తెలుగు శూన్యము. తమిళం వంద శాతం. మా చుట్టు ప్రక్కని అనేక చిన్ని గ్రామాలలో కన్నడ బాష మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేవి. నేడు కన్నడం పూర్తిగా మటుమాయం‌ ఆ నాటిలో మూడు బాషలు సహోదర భావంతో అన్నీ ఒకటితో ఒకటి పెనవేసుకొని జీవించేది. కాని నేడు ఆ తమిళ బాష ఒకటి మాత్రం ఆక్రమించుకొనినది. నాకు ఏ బాష పైనను విరోదం లేదు. నాకు ఆ మూడు బాషలు బాగుగ చదువ, వ్రాయ, మాటలాడ వస్తుంది. అన్నింటిని ప్రేమిస్తాను. పోతే తెలుగుపై ఎక్కువ మక్కువ. ఈ కళగాలే రాజకీయ కారణాలచే తెలుగును అణగత్రొక్కి నిర్మూలం చేసింది. అదే నా ఆత్మ బోరున ఏడుస్తుండే దానికి కారణం. నిస్సహయముగా మా లాంటి కొందరు ఇక్కడ మిగిలి పోయాము.


విషాదంతో


రామమూర్తి

చెన్నై.

కామెంట్‌లు లేవు: