11, మే 2023, గురువారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 56*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 56*


"నీ పేరు చాణక్యుడా ! అయితే మాకేం ? ఆ స్థానం మా రాజగురువు సుబంధుల వారిది. లే... ! లేచి వెళ్లి బ్రాహ్మణ పంక్తిలో కూర్చో" అని ఆజ్ఞాపించాడు సుకల్పనందుడు. 


చాణక్యుడు ఏమాత్రం జంకకుండా "ఈ పీఠం వేదవేదాంగ వేత్త కోసమా ? లేక సుబంధుల వారి కోసమా?" అని రెట్టించాడు. 


ధననందుడు ఆవేశంతో అడుగు వేస్తూ "ఏం ? నీకు జవాబు చెప్పాలా ?" అరిచాడు. 


రాక్షసామాత్యుడు చప్పున తేరుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చి, చాణక్యునికి నమస్కరిస్తూ, "నన్ను రాక్షసామాత్యుడంటారు" అని పరిచయం చేసుకున్నాడు. చాణక్యుడు ప్రతినమస్కారానికి బదులు చేయెత్తి ఆశీర్వదిస్తూ "ఆయుష్మాన్ భవ...." అన్నాడు. 


ఆ ఆశీర్వచనానికి బిత్తరపోయిన రాక్షసుడు అరక్షణంలో తేరుకుని "ఆర్యులు మన్నించాలి, ఈ పీఠం వేదవేదాంత వేత్త కోసం నిర్దేశించబడినదే కానీ, చాలా కాలంగా రాజగురువు సుబంధుల వారే ఆశీనులవుతున్నారు. ప్రభులకి వారంటే అమిత గౌరవం. కనుక తమరు వేరొక పీఠాన్ని.... అభ్యంతరం లేకపోతే నా పీఠాన్ని అలంకరించండి" అని మనవి చేశాడు. 


"అభ్యంతరమే..." అంటూ చాణక్యుడు అడ్డంగా తలతిప్పి "ఈ స్థానం సుబంధులవారి కోసం అని మీరు ప్రకటిస్తే లేవటానికి నాకే అభ్యంతరం లేదు. అలాకాక ఈ ఆసనం వేదవేదాంగ వేత్త కోసమైతే, మీ సుబంధులవారిని నాతో వాదించి విజయం సాధించమనండి. అప్పుడు ఆలోచిస్తా" అన్నాడు గంభీరంగా. 


సుబంధులవారి ముఖంలో రంగులు మారిపోయాయి. ప్రభువువైపు వుక్రోషంగా చూస్తూ "భోజన వేళలో వాదనలా...? ఏమి సుకల్పనందా ? మీ సోదరులందరికీ విద్యాబుద్ధులు నేర్పిన గురువులం. మమ్మల్ని అవమానించడానికే ఈ ఏర్పాటు చేశారా ?" అడిగాడు. 


"అవమానమా ? మీకా ....? పండిత సమక్షమున రాజాజ్ఞను సైతం ధిక్కరించి, మిమ్మల్ని అవమానించిన వారికే ఇక్కడ అవమానము జరగనున్నది..." అంటూ ధననందుడు ఆవేశంతో అడుగు ముందుకు వేసి, చాణక్యుని భుజం మీద చెయ్యి వేస్తూ... "లే...." గద్దించాడు. 


బ్రాహ్మణ లోకమంతా ఆ చర్యకు కినిసి హాహాకారాలు చేసింది. చాణక్యుడు పటపట పళ్ళు కొరుకుతూ "మూర్ఖా ! బ్రాహ్మణ పరాభవాగ్ని దావానలమై దహించివేస్తుంది. జాగ్రత్త !" హెచ్చరించాడు కఠిన స్వరంతో. 


ఆ హెచ్చరిక విన్న సుకల్పనందుడు రెచ్చిపోతూ "దావనలమా... దర్భపోచా... నీ వంటి మూర్ఖుడి బెదిరింపులకి జడిసి చేతులు జోడించడానికి మేము నిమ్న వర్ణస్థులం కామురా... లేవరా... లే..." అని రంకలేస్తూ చాణక్యుని శిఖని పట్టి ఆసనం మీద నుంచి క్రిందికి ఒక్కలాగు లాగాడు అహంకార మదంతో. 


బ్రాహ్మణలోకం యావత్తు ఆ దుశ్చర్యని ఖండిస్తూ ఒక్కపెటున "సిగ్గు... సిగ్గు..." అంటూ హాహాకారాలు చేసింది. 


ఆ హాహాకారాలు వింటూ చాణక్యునికి పట్టిన గతిని చూస్తూ చేష్టలు దక్కి నిశ్చేష్టుడైపోయాడు రాక్షసుడు. 


చాణక్యుని శిఖ ముడి వూడిపోయి తోక త్రొక్కిన త్రాచులా వూగసాగింది. ఆతని కృష్ణవర్ణపు శరీరఛాయ చకచకా రంగులు మారి రక్త వర్ణపు జేగురుతో జలదరించసాగింది. పరమేశ్వరుని వలె భస్మధారణతో ప్రకాశించిన ఆతని వదనం కాలరుద్రుని వలె రుధిర వర్ణంతో భీతి గొలుపసాగింది. 


(ఇంకా ఉంది)...🙏

 *సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: