🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 112*
రాక్షసుడు తలత్రిప్పి నలువైపులా కలయాజూసి ఓ మూలనున్న వృక్షము వద్ద ఎవరో నిలబడివున్నట్లు గమనించి వడివడిగా అటువైపు అడుగులు వేశాడు.
"అయ్యో ! దైవమా ! నేడెంత దుర్ధినం... నిండు నూరేళ్లు జీవించవలసిన నేను... ఆ ద్రోహి ... రాక్షసుని కారణాన ఆత్మహత్య చేసుకుని అకాలమరణం పాలుకావల్సివస్తున్నది గదా... హతవిధీ .... ఇది ఏ జన్మలో చేసిన పాపమో గదా...." అంటూ బిగ్గరగా రోధిస్తున్నాడు మారువేషంలో ఉన్న శార్జరవుడు.
రాక్షసుడు గబగబా అతన్ని సమీపించాడు. ఆ వృక్షపు కొమ్మకి బిగించి కట్టబడిన త్రాటినీ, దాని చివరనున్న ఉరిని చూసి విచలితుడవుతూ "బాబూ.... ఎవరయ్యా నీవు ? ఆత్మహత్య మహాపాపమని నీకు తెలియదా ?" అని అడిగాడు.
"నాకు తెలుసయ్యా .... కానీ, ఇదంతా నా ఖర్మ .... ఏజన్మలోనో ఏ మిత్రునికో ద్రోహం చేసివుంటాను. ఈ జన్మలో నా మిత్రుని కోసం ప్రాణత్యాగం చేసి, ఆ పాపం బావుకుంటున్నా.... మిత్రమా... విష్ణువర్మా.... నేనూ నీ వెంటేవస్తా .... నీవులేని ఈ లోకం, ఈ జీవితం నాకు వృథా..." అంటూ బిగ్గరగా రోదించసాగాడు శార్జరవుడు.
రాక్షసునికి విషయం ఏమీ అర్థం కాలేదు. ఆ వ్యక్తిని వూరడిస్తూ "చూడు బాబూ... అసలు విషయం ఏమిటో చెబితే చేతనైన సహాయం చేస్తా..." అన్నాడు.
శార్జరవుడు బిగ్గరగా విలపిస్తూ "అయ్యా... ! ఏం చెప్పమంటారు నా బాధ.... కుసుమపురంలోని వ్యాపారి విష్ణువర్మ నాకు ప్రాణమిత్రుడు. నా మిత్రునికి ప్రముఖ రత్నాలవ్యాపారి చందనదాసు అత్యంత ప్రియమిత్రుడు. ఆ చందనదాసుకు సంభవిస్తున్న ఆపదను భరించలేక నా మిత్రుడు విష్ణువర్మ అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. నా ప్రాణమిత్రుడు లేనప్పుడు ఇక నా బ్రతుకు ఎందుకు ? అందుకే విష్ణువర్మ కంటే ముందుగా నేనీ ఆత్మహత్యా ప్రయత్నానికి వొడిగట్టాను. చెప్పండి. చందాన దాసు కోసం నా మిత్రుడు ఆత్మత్యాగం చేస్తున్నప్పుడు, నా మిత్రుని కోసం నేను ప్రాణత్యాగం చెయ్యడం తప్పంటారా ?" అని ప్రశ్నించాడు.
రాక్షసుడు కంగారుపడుతూ "చందనదాసుకి ఆపదా...? చెప్పు నాయనా... ఆతనికేమీ ఆపద సంబంధించింది ?" అని అడిగాడు ఆందోళనగా.
"అయ్యా...! అది మామూలు ఆపదకాదు. చందనదాసు తనకి ప్రాణమిత్రుడైన రాక్షసామాత్యుని భార్యాబిడ్డలను ఎక్కడో దాచి పెట్టాడు. అది రాజద్రోహంగా భావించాడు చాణక్యుడు. "రాక్షసకుటుంబాన్ని అప్పగిస్తారా ? ఉరిశిక్షకు సిద్ధపడతావా ?" అని చాణక్యుడు నిలదీశాడు. మిత్రద్రోహము చెయ్యడానికి చందనదాసు ఇష్టపడక మరణమునకే సిద్ధపడ్డాడు. రాక్షసుని కోసం తను ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు ఆ స్వామి భక్తుడైన చందనదాసు. అతన్ని విడిచి బ్రతకలేని నా మిత్రుడు అగ్నిప్రవేశం చెయ్యనున్నాడు. వానిని విడిచి నేనూ జీవించలేను... మిత్రులారా... మీకంటే ముందుగా నేనే .... నేనే ...." అని బిగ్గరగా విలపిస్తూ ఉరిత్రాడును మెడకి తగిలించుకోబోయాడు శార్జరవుడు.
రాక్షసుడు అతన్ని వారిస్తూ "ఆగుబాబూ.... ఆగు... తొందరపడకు... మీ ఆపదను నేను తొలగిస్తాను... మీ అందరి దుఃఖాలకి కారకుడయిన ఆ రాక్షసుడ్ని నేనే...." అన్నాడు బాధగా.
"ఆ ! తమరేనా, రాక్షసామాత్యుల వారు ? అయ్యా ... ! త్వరపడండి. చందనదాసుని శూలరోహణం చేయించడానికి తలారులు ఇప్పుడే వధ్యస్థానానికి తీసుకుపోయారు. ఆలస్యం చేస్తే ఆఖరి చూపు కూడా దక్కదు..." అంటూ తొందరపెట్టాడు శార్జరవుడు.
"భయంలేదు బాబూ ... నా ప్రాణం ఇచ్చి అయినా నా మిత్రుడు చందనదాసుని కాపాడుకుంటాను. నువ్వు వెళ్ళి యీ విషయం చెప్పి నీ మిత్రుడు అగ్నిప్రవేశం చెయ్యకుండా కాపాడుకో...." అని అతనికి అభయమిచ్చిన రాక్షసుడు "నా ప్రాణమిత్రమా చందనదాసూ... వస్తున్నానయ్యా..." అంటూ దుఃఖోద్వేగంతో వధ్యస్థానంవైపుకి పరిగెత్తాడు.
శార్జరవుడు కన్నీళ్లును తుడుచుకుంటూ "ఆర్యా... చాణక్యదేవా ... ! మానవుల మానసిక దౌర్భాల్యాలను అంచనా వేసి దానికి తగ్గట్టు పావులు నడపగలిగిన మీ రాజకీయ విజ్ఞతకి జేజేలు... గురుదేవా .... మీకు మీరే సాటి..." అనుకున్నాడు.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి