రింగులు రింగులు (కథ)
(ప్రభాకర్ పెదపూడి).
అరవిందరావు ఆరువందలోచుట్ట కాలుస్తూ పొగమేఘాలు తయారు చేస్తున్నాడు. చాలా ఏళ్లక్రితం కరివేపాకు మొక్క దగ్గర మొదటి చుట్ట వెలిగించాడు. ఇప్పుడా మొక్క పెరిగి పెద్దదయ్యి కరివేపాకు చెట్టు అయ్యింది. గతంలో చుట్టుపక్కల ఇళ్ళవాళ్లు కరివేపాకు కోసుకుపోయేవారు. ఇప్పుడు కరివేపాకు కోసం ఒక్క పిట్టకూడా రావడంలేదు, ఇంట్లోవాళ్లు కూడా కూరల్లో, చారులో, పులుసుల్లో బయటినుంచి తెచ్చుకుంటున్నారు కానీ ఆ చెట్టు ఆకులు వాడటం లేదు. ఎందుకంటే వంటకాలన్నీ చుట్ట వాసన వస్తున్నాయి. చెట్టు దగ్గరకి వెడితే గతంలో కరివేపాకు సువాసన వచ్చేది, ఇప్పుడు అరవిందరావు దయవల్ల చుట్ట వాసన వస్తోంది.
అరవిందరావుకు ఎంతో గర్వంగా ఉంది, ఆరువందల చుట్టలు కాల్చడమంటే తమాషానా అనుకుంటాడు అదే మాట జనంతో అంటూ ఉంటాడు. గతంలో చుట్టతో సావాసం చేసిన అతని స్నేహితులు పట్నంనుంచి ఓడాక్టర్ని తీసుకొచ్చి అరవిందరావుని చూపించి చూడమన్నారు. ఆయన రకరకాల పరీక్షలు చేసి “ఈయన ఊపిరితిత్తులు ఫ్యాక్టరీ గొట్టాల్లా మసిబారిపోయాయి, చుట్ట మానేసినా చస్తాడు, కాల్చినా చస్తాడు కనుక అంతా ఆయన ఇస్టమ్” అని వెళ్లిపోయాడు.
ఆరోజు ఆదివారం, సెలవు దినం. అరవిందరావు నేలకు సెలవు తీసుకుని నింగికి చేరుకున్నాడు. శవంతోపాటు ఊరంతా శ్మశానానికి గుప్పు గుప్పుమని చేరుకున్నారు. ఎంత సేపు ప్రయత్నించినా కింద కర్రలు కాలాయి కానీ శవం పిసరంతకూడా కాలలేదు. చివరికి ఓముసలాయన ఓ చుట్టని వెలిగించి శవం నోట్లో పెట్టాడు. పదినిమిషాల్లో శవం గుప్పు గుప్పుమని కాలి బూడిద అయ్యింది. పొగ రింగులు రింగులుగా ఆకాశంలోకి ఎగిరింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి