గురు శిష్యుల లడాయి!
------------------------------------
పండిత లోకంలో " శిష్యాదిచ్ఛేత్పరాజయం"- అనే ఆభాణకం ప్రచారంలో ఉంది. అంటే శిష్యుని చేతిలో గురువు పరాజయాన్ని కోరుకుంటాడని. ఉత్తమ గురువు విద్యలో తనకన్నా తన శిష్యుని గొప్పవానిగా, సమున్నతునిగా , చూడగోరుతాడని,
దీనిభావం. శిష్యుడు అల్పుడై యెదిరిస్తేమాత్రం చీల్చి చెండాడుతాడు.
గురువుగా చెళ్ళపిళ్ళవారి పరిస్థితిమాత్రం చిత్రాతి చిత్రమైనది.ఈవిషయంలో ఆయనకన్నా అదృష్టవంతుడూ లేడు, ఆయనకన్నా దురదృష్టవంతుడూ కనిపించడు.
తెలుగు వారికి మాత్రమే స్వంతమైన అవధాన కళకు అత్యద్భుతమైన జనాకర్షణ కలిగించిన జంటకవులు
తిరుపతి వేంకట కవులు వారిలో చెళ్ళపిళ్ళవేంకటశాస్త్రి యొకరు. వారిశిష్యులలో ప్రముఖుడు విశ్వనాథ సత్యనారాయణ. ఆయన తమ గురువుగారిని
గురించి మహోన్నతంగా సంభావిస్తూ యిలాచెప్పుకున్నారు.
" అల నన్నయ్యకు లేదు తిక్రనకు లేదాభోగ మస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనాడట్టి దావ్యోమ పే
శల చాంద్రీమృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్;
ఇందులో స్వోత్కర్ష ఉన్నప్పటికీ
. తనవంటి శిష్యుడుండేభాగ్యం నాడు నన్నయకూ, తిక్కనకూ
కలుగలేదు చెళ్ళపిళ్ళ వారికి మాత్రమే దక్కిందంటాడు విశ్వనాధ! ఇలా ఒకవంక తనగొప్పతనం చాటుకుంటూనే గురువుగారి గౌరవాన్ని ఆకాశమంత యెత్తు కుపేంచేశాడు. మాగురువుగారు నన్నయ తిక్కనకన్న గొప్పవాడని సాటుకున్నాడు. అటువంటి శిష్యుడు దొరికితే గురువు కింకేమి కావాలి? అనిపించాడు. ఇది మొదటి కోణం!
ఇక రెండో కోణంతోనే ఉంది సమస్యంతా !
చెళ్ళపిళ్ళ వారికి 'ఓలేటి వేంకట రామ శాస్త్రి' అనే శిష్యుడుండేవాడు. ఎందుకో ఆయనకూ చెళ్ళపిళ్ళ వారికి చెడింది.
"నీవునాగురువువు కానేకాదు పొమ్మన్నాడు ఓలేటి. చెళ్ళపిళ్ళవారికి మండింది. కాదంటే ఊరుకుంటాడా ? అద్యతనాంధ్రకవిత్వ ప్రపంచ
నిర్మాతగదా! వారికి కోపమొచ్చినా తాపమొచ్చినా 'పద్యాలలోనేకదా! ఒకసీసాన్ని గుప్పించి తనదగ్గర గలసాక్ష్యాలన్నీ యేకరువు పెట్టారిలా పద్యంమాట యెటున్నా చూచేవారికది వినోదంగా మారింది.
సీ: ఇంజరం బొకసాక్షి- యేనాము తా సాక్షి
పల్లె పాలెంబు తానెల్ల సాక్షి!
ఇపుడు నీవున్నట్టి- యీపిఠాపురిసాక్షి
ఏలూరుసాక్షి నీయిల్లు సాక్షి
వల్లూరు నృపతి శ్రీ- భాష్య కారులు సాక్షి
నూజివీడ్రామచంద్రుండు సాక్షి
మంజువాణీప్రెస్సు- మానేజరొక సాక్షి
శంకరుండాతని సాని సాక్షి
తే: మధున పంతుల సూరయ బుధుడు సాక్షి
యయ్యనఘు, నన్నసాక్షి సుబ్బయ్యగారు
సాక్షులున్నారు పద్యంబు చాలదింక
వేంకటేశ్వరు శిష్యుడవే! నిజమ్ము !
చిత్ర మైన విషయమేమిటంటే యీవిషయంలో అటూ ఇటూ మధ్యవర్తు లుండటం. చెళ్ళపిళ్ళవారి తరపున వారి సోదర కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఓలేటిని గట్టిగా మందలించారు.
" వ్యాకరణంబుఁ జెప్పె , నది యంటక పోయిన పోవుగాక , నీ
కీ' కవి'నామ మయ్యనఘుఁడే కద పెట్టిన దంతఁ బోక తా
నే కడ కేగె , నిన్ను గొనియే చనె నచ్చటి , కట్టివాని , సు
శ్లోకు , సభాస్థలిన్విడచి చోరుగతి న్మెలగంగ నేమొకో?
" వేంకటేశ్వరు పాదంబు వీడి పిదప
నెవని సేవించితివి? చెప్పు మింత యేల?
యే విషయమీవు సాధించినావొ పిదప?
వ్రాయుమా వేంకటేశ్వరు పదము లాన !
అంటూ హితవు చెప్పారు. అయినా ఇతరుల దుర్బోధలకు లోగిన ఓలేటి యామాటలను లేక్క సేయలేదు.
వారి మనసు మారలేదు. ఓలేటి వారికి వేదుల రామకృష్ణ శాస్త్రి యను మిత్రుడున్నాడు. అతడే ఓలేటివారికి వెనుక నున్నదన్ను.
" పాఠంచెప్పేవాడు గురువైతే, గుణపాఠం చెప్పేవాడే శిష్యుడనే" వాదాన్ని నమ్మేవ్యక్తి రామకృష్ణశాస్త్రి. చెళ్ళపిళ్ళవారికి తమకు మధ్యగల వైరానికి ఓలేటినొక అస్త్రంలా వాడుకోదలచారు. అందుకే ఓలేటివారి పక్షాన చెళ్ళపిళ్ళపై వారోపద్యాస్త్రాన్ని సంధించారు.
" ఎట్టొ చదివితి మూనాళ్ళ పట్ట పగలు,
పట్టుమని రెండు ముక్కలు పలుక కున్న,
తిరుగడిక నెన్ని చెప్పిన గురుడ ననుచు,
తగులు కొన్నాడు , నిన్ను 'సైతాను' లాగు;
"- అనేశాడు.చూశారా ! యెంత నీచంగా వ్రాశాడో! చెళ్ళఫిళ్ళవారిగురించి ఇంతనీచంగామాట్లాడినా
వారిని గురువుగా తానేయొప్పుకున్నాడు.
పాపం చెళ్ళపిళ్ళవారికి శిష్యులతోనేకాదు.గురువుగారు చర్లబ్రహ్మయ్యశాస్త్రిగారితో గూడా గొడవ తప్పలేదు. ఒకసారి గురువుగారిమీద ఒళ్ళుమండి"గురుడైనన్ హరుడైననేమి?"- అంటూ పద్యంచెప్పారట! కొంతకాలానికి అదే తనకూప్రాప్తించింది. ఆయన శిష్యుడు ఓలేటి గట్టిగానే యిచ్చుకున్నాడు "శ్రుత పాండిత్యము దక్క లేనిగురుడు"- అంటూ చెళ్ళపిళ్ళవారిపాండిత్యాన్ని వేళాకోళమాడాడు. చెళ్ళపిళ్ళ యేదో అక్కడాయిక్కడా విని నేర్చుకున్నదే తప్ప డొక్క శుధ్ధిగా చదువుకొన్నవాడు కాదని దాని సారాంశం!
ఏది యేమైనా " వరంవిరోధోపి సమం మహాత్మభిః"- (మహాత్ములతో విరోధంకూడా మంచిదే) అనే' భారవి'
వాక్యం మరువరాదు.
క
స్వస్తి!
తెలుగు వెలుగుల సౌజన్యంతో--🙏🙏🙏🌷🌷💐💐🌷🌷💐💐🌷🌷💐🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి