నన్నెచోడకవి వర్ణనా వైభవం!
సీ: శశిబింబ మణిహేమ సౌదామినీ చయో
త్కరము లన్నియు గూడ నరసి దెచ్చి ,
నవలతా పుష్ప పల్లవ బిస కోమల
విభవంబు లన్నియు వెదకి తెచ్చి ,
కర్పూర చందన కాశ్మీర మృగమదా
మోదంబు లన్నియు ముంచి దెచ్చి ,
పరివాదినీ శుక పరిపుష్ట మధుకరా
రాకంబు లన్నియు రాచి దెచ్చి ,
ఆ: హావ భావ రూప లావణ్య సారముల్
త్రిభువనముల నేర్చి తెచ్చి, నేర్పు
సూపఁదలచి యాడు రూపజుఁడొనరించె ,
నని నుతింప నొప్పు నగతనూజ!
----- కుమార సంభవము-- తృతీయాశ్వాసము-121పద్యం--నన్నెచోడుడు .
సతిగా దేహమును చాలించి పార్వతిగా హిమవంతుని యింట జనించిన యభవుని పత్ని కాత్యాయని దిన దిన ప్రవర్ధమానయై అపురూప సౌందర్యరాసిగా రూపొందెను. ఆమె యతిలోక మనోహర మైన రూపమును నన్నెచోడుడీ పద్యమున కడు రమ్యముగా వర్ణించినాడు.
బ్రహ్మగారు సృష్టిలోని అపురూప వస్తు సముదాయములను యేర్చికూర్చి యొక లోకోత్తర సౌందర్యవతి యగు స్త్రీని
సృష్టింప దలచినాడట. అందుకు పార్వతియే తగినపిల్ల యని నిర్ణయించి ఆపదార్ధాలను తెచ్చి యోజన చేశాడట.! ఆసౌందర్య నిర్మాణ సామగ్రి యేదో మనమిపుడు తెలిసికొందాము.
చంద్ర బింబము,బంగారము మణులు, మెఱపుతీగెలు ,మున్నగు వాని సముదాయమును, నవతలలు ,పుష్పములు ,చిగురుటాకులు ,తామరతూడుల వంటి మృదువైన వస్తు సముదాయమును , కర్పూరం( పచ్చకర్పూరం) మంచిగంధం ,కస్తూరీ, మొన్నగు సుగంధపరిమళములను , కోకిల ,చిలుక ,తుమ్మెద , మొన్నగువాని ధ్వనులను, తెప్పించి.
చంద్రబంబాదులతో రూపాన్ని దిద్దాడు. అందుకే ఆమె మోమున వెన్నెలవంటి కాంతులు. శరీరమున సువర్ణచ్చాయలు, తనువున మెరపులను బోలిన లావణ్యకాంతులు అలముకొన్నాయి.
నవలతా పుష్పాదులతో ఆశరీరానికి మెత్తదనం కల్పించాడు. అందుకే ఆమెతనువు నవ వికసిత పుష్పసదృశం. పల్లవ బిసరుహ మృదులం.
కర్పూర చందన కస్తూరికాదులతో మెదపి ఆమెతనువునకు సుగంధమలదినాడు. అందుకే ఈమె శరీరము సహజసువాసితమై సన్నిహితులకు ఆమోదకారక మైనది.
కోకిల ,చిలుక ,తుమ్మెదల కూజితముల తో నామె కంఠమును సవరించినాడు. అందుకే ఆమె కలభాషిణి యైనది.
ఈరీతిగా ఆమె హావ , భావ ,రూప,లావణ్యాదులను సవరించి, బ్రహ్మ యద్భుతమైన స్త్రీ మూర్తిని సృజియింపగల
దిట్ట యనిపించు కొన్నాడట! యేమి వర్ణనమిది!! ఒక్క కాళిదాసుకు తప్ప నితరు లెవ్వరకు నిట్టి వర్ణనమును చేయనవకాశములేదు.ఆమహానుభావుడు విక్రమోర్వశీయమున ఊర్వసి నిట్లే మనోహరముగా వర్ణించినాడు.
శ్లో: అస్యాః సర్గవిధౌ ప్రజాపతి రభూశ్చంద్రోను కాంతిప్రదః /
శృంగారైక రసస్వయన్ను మదనో మాసోను పుష్పాకరః /
వేదాభ్యాస జడః కధన్ను విషయ వ్యావృత్త కౌతూహలః /
నిర్మాతుం ప్రభవేన్మనోహరమిదం రూపం పురాణోమునిః !
విక్రమోర్వశీయం- 2 అంకం-- కాళిదాసు.
భావం: ఈపిల్లని కాంతిప్రదుడైన చంద్రుడు గాని , లేదా పుష్పాకరుడైన వసంతుడుగాని , శృంగార రస ప్రచోదకుడైన మన్మధుడుగాని సృజియించి ఉండాలి. వేదాభ్యాస జడుడు , సంసార సుఖవిముఖుడూ ,అయిన ఆముసలిబ్రహ్మ సృష్టించాడంటే
నేను నమ్మను. అని ఢంకా బజాయించాడు. కాళిదాసు. నన్నెచోడకవి మరింతగా మెఱుగులు దిద్దాడు.
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి