ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
భాగం 8/12
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
-----------------------
7. భౌతిక శాస్త్రాలు
ఐన్ స్టీన్, రూథర్ ఫర్డ్ వంటి శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేసి కొత్తకొత్త విషయాలు కనుగొన్నారు.
తద్వారా తరువాతి తరాలు పరిశోధనలు కొనసాగించే విధంగా మార్గం చూపారు.
అనేకమంది శాస్త్రవేత్తలు నిరంతరమూ పరిశోధిస్తూ, క్షిపణులవంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని నిరంతరమూ అభివృద్ధి చేస్తున్నారు.
శ్రీమద్వాల్మీకి రామాయణంలో అభివృద్ధి చెందిన భౌతిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం
అబ్బురపరచేదిగా దర్శించగల్గుతాం.
శస్త్ర - అస్త్ర పరిజ్ఞానం
విశ్వామిత్రుడు శ్రీరామునికి శస్త్రపరిజ్ఞానం అంతా అందించాడు.
ధర్మచక్ర,
కాలచక్ర,
విష్ణుచక్ర వంటి చక్రాలనీ,
శివుని శ్రేష్ఠమైన శూలాన్నీ,
మోదకి,శిఖరి అనే ప్రజ్జ్వరిల్లే రెండు గదలనీ,
శుష్కము - ఆర్ద్రము అనే రెండు పిడుగులనీ, రెండు శక్తులనీ,
కంకణమనే ముసలాన్నీ గ్రహింపమని
- విశ్వామిత్రుడు శ్రీరామునికి శస్త్రాలని అందించాడు.
(గమనిక : శస్త్రము - పదునైన ఆయుధము)
ఐంద్ర, బ్రహ్మాస్త్రాల వంటి మంత్రపూరితంగా విడిచే అస్త్రాలనీ కూడా విశ్వామిత్రుడు శ్రీరామునికి ఉపదేశించాడు.
(గమనిక: అస్త్రము - మంత్రపూరితమైనది)
అస్త్ర ఉపసంహారం
రెండవ ప్రపంచ యుద్ధంలో, హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల ప్రయోగ విషఫలితాలు అందఱికీ తెలిసినవే కదా!
అస్త్రాన్ని ప్రయోగిస్తే, దాన్ని తిరిగి ఉపసంహరించడం అనేది ఇప్పటివరకూ ఎవరూ కనుగొనలేక పోవడం గమనించవలసిన విషయం.
కానీ పైన పేర్కొన్న అస్త్రశస్త్రాలని స్వీకరించిన శ్రీరాముడు, వాటి ఉపసంహారం కూడా విశ్వామిత్రుని నుండి అడిగి తెలుసుకున్నాడు.
శ్రీరాముడు వాటి ప్రయోగాన్నీ, ఉపసంహారాన్నీ రెంటినీ అనేక సందర్భాలలో ధర్మబద్ధంగా ఉపయోగించాడు.
కాకాసురుని పై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దాని ప్రాణాలు పోకుండా - అవయవలోపంతో సరిపెట్టి కాపాడడం ప్రయోగ - ఉపసంహారాలకి గొప్ప ఉదాహరణ.
ఆయుధాల ప్రయోగం - విరుగుడు
అస్త్ర శస్త్రాలలో, ఒకరిచేత ప్రయోగింపబడినదానిని నిర్వీర్యంచేస్తూ, విరుగుడుగా ప్రత్యర్థిచేత మరొకటి విజయవంతంగా ప్రయోగించబడడం శ్రీమద్రామాయణంలో మనకి అనేకసార్లు కనిపిస్తుంది.
శక్తి అనే ఆయుధాన్ని రావణుడు ప్రయోగిస్తే, ఒక్కొక్కసారి
- దానంతటదే వెనుదిరగడం,
- విభీషణునిపై పడడాన్ని లక్ష్మణుడు ఎదుర్కొని నిర్వీర్యం చేయడం,
- లక్ష్మణుని శరీరంలోకి దిగి మూర్ఛిల్లితే,
రాముడు దానిని భౌతికంగా తొలగించగా,
సుషేణుని ఓషధి చికిత్సతో లక్ష్మణుడు పూర్తి స్వస్థత పొందడం కూడా గమనార్హం.
అస్త్ర - శస్త్రాల ద్వారా గొప్ప ఫలితాలు పొందడం, ఆనాటి భౌతిక శాస్త్ర విజ్ఞానం ఎంత ఆదర్శంగా నిలచిందో తెలుస్తుంది కదా!
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి