3, సెప్టెంబర్ 2023, ఆదివారం

రామాయణమ్ 313

 రామాయణమ్ 313

...

నేను ఇంద్రుడి గూఢచారిని కాను!

విష్ణువు దూతనూ కాను.

నేను వానరుడను,

 వనచరుడను.

.

రాజదర్శనము లభించవలెనన్న కోరికతో మాత్రమే వనభంగము చేసినాను.

ఆత్మరక్షణ కొరకు మాత్రమే రాక్షసులను సంహరించినాను.

.

ఏ అస్త్రములు నన్ను బంధించలేవు కేవలము రాజదర్శన కాంక్షవలన మాత్రమే నేను కట్టుబడినాను. 

.

అని  రాక్షసేశ్వరుని చూసిపలుకుతూ హనుమంతుడు ...

.

మహారాజా! నేను శ్రీరామచంద్రుని కార్యము నిమిత్తమై నీ వద్దకు వచ్చితిని.ఆయన దూతను నేను.

.

సోదరుడైన సుగ్రీవుడు నీ కుశలమడిగి తన సందేశము నీకు చెప్పమనినాడు.

.

పరమ ధర్మమూర్తి రామచంద్రుడు తన భార్యతో దండకారణ్యములో నుండగా ఒక రోజు ఆయనకు తన భార్య కనిపించలేదు.

.

తమ్మునితో కూడి తన భార్యను వెతుకుతూ ఋష్యమూకము చేరినాడు .అక్కడ సుగ్రీవునితో ఆయనకు సఖ్యమేర్పడినది.

.

 వాలిని సంహరించి సుగ్రీవుని దుఃఖము పోగొట్టి ఆయనను రాజ్యాభిషిక్తునిగావించినాడు

రామచంద్రుడు.

.

నీవెరుగుదువు కదా వాలిని ! 

అట్టి వాలిని ఒక్కబాణముతోనే నేలకూల్చినాడు రాముడు .

.

రాముడి కొరకై సుగ్రీవుడు తన వానర సైన్యమునంతా సన్నద్ధము చేసినాడు.వానర వీరులందరినీ నలుదెసలా పంపినాడు ,సీత జాడ తెలుసుకొని రమ్మని .

.

నేను వాయుపుత్రుడను హనుమంతుడను ! దక్షిణదిక్కుగా సీతమ్మను వెతుకుతూ వచ్చి ఇట లంకలో అశోకవనములో ఆమె జాడ కనుగొంటిని.....ఇంకా ఇలా అంటున్నాడు హనుమస్వామి.

.

NB.

ప్రశ్నించినది ప్రహస్తుడు కానీ వాడి వైపు కూడ చూడకుండ  రావణుడికే సరాసరి చెప్పడంమొదలు పెట్టారు స్వామి. 

.

అంతటి వాలికే ఒక్కబాణం సరిపోయింది ,నీ గతి ఏమిటో ఆలోచించుకో అని బెదిరించడం కూడా అయ్యింది....రామ దాసుడిని నేనే ఏ అస్త్రా‌నికీ కట్టు బడను ,ఇక నా రాముడి శక్తి నీకేం తెలుస్తుంది ?

.

ఇదీ స్వామి సంభాషణా చాతుర్యం !

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: