22, నవంబర్ 2023, బుధవారం

పెరియ పురాణం⚜️* . *నాయనార్ల చరిత్ర - 06*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 06*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *6. అమర్నీతి నాయనారు*


‘ఏళైయారై’ అనే నగరంలో ఒక వైశ్య కుటుంబంలో అమర్నీతి

నాయనారు అనే శివభక్తుడు జన్మించాడు. ఒక పర్యాయం పరమేశ్వరుడు

కౌపీన మహిమను అమర్నీతి నాయనారుకు తెలియజేసి అతన్ని తన కరుణా

కటాక్షాలచే అనుగ్రహించాలనే తలంపుతో బ్రాహ్మణ బ్రహ్మచారి వేషాన్ని

ధరించి వచ్చాడు. 


బ్రహ్మచారి వేషధారిని చూడగానే అమర్నీతి నాయనారు వేగంగా వచ్చి బ్రహ్మచారికి నమస్కరించి అతన్ని తన మఠానికి

ఆహ్వానించాడు. "మీరు ఈ రోజు మా మఠంలో భోజనం ఆరగించి మమ్మల్ని

ధన్యులను చేయాలి” అని నాయనారు ఆ మాయాబ్రాహ్మచారిని అర్ధించాడు.

బ్రహ్మచారి దానికి అంగీకరించి "నేను కావేరినదిలో స్నానం చేసివస్తాను.


ఈ కౌపీనాన్ని మీరు భద్రంగా దాచి ఉంచి నేను స్నానం చేసి తిరిగి వచ్చినపుడు మీరు నాకు ఇవ్వండి" అని చెప్పి కౌపీనాన్ని నాయనారు

చేతుల్లో పెట్టి స్నానానికి బయలుదేరాడు. నాయనారు ఆ కౌపీనాన్ని తీసుకొని

దానిని ఒక భద్రమైన స్థలంలో జాగ్రత్తగా ఉంచాడు. మాయా బ్రాహ్మణుడు

ఆ కౌపీనాన్ని మాయ మయ్యేటట్లుగా చేశాడు. 


కొంత సమయమైన తరువాత

కావేరినదిలో స్నానంచేసి మాయా బ్రాహ్మణుడు మఠానికి తిరిగి వచ్చాడు.

“నదిలో స్నానం చేయడం వలన నా శరీరం తడిసిపోయింది నేను నీ

దగ్గర ఇచ్చిన కౌపీనాన్ని తెచ్చి ఇవ్వు" అని బ్రాహ్మణుడు నాయనారుతో

చెప్పాడు. నాయనారు వేగంగా లోపలికి వెళ్లి తాను పూర్వం కౌపీనాన్ని

భద్రపరిచిన స్థలంలో చూడగా అది కనిపించలేదు. ఎంత వెతికినా ఆ

కౌపీనం వారికి దొరకలేదు. 


అప్పుడు నాయనారు బ్రాహ్మణుని దగ్గరికి

వెళ్లి "స్వామీ! మీరు నాదగ్గర ఇచ్చి వెళ్లిన కౌపీనం నేను పెట్టిన చోటులో

కనిపించలేదు. నేను వేరొక మంచి కౌపీనం తీసుకువచ్చాను. దానికి

 బదులుగా మీరు దీనిని ధరించి నా తప్పులను క్షమించండి" అని ప్రార్థించాడు.


 బ్రాహ్మణుడు కోపంతో "నేను నీ దగ్గర ఇచ్చి వెళ్లిన కౌపీనాన్ని

అపహరించి దానికి బదులుగా వేరొక కౌపీనాన్ని తీసుకోండి అని చెప్పడం

న్యాయమా?” అంటూ కోపంతో ఎగసి పడ్డాడు. నాయనారు "స్వామీ! ఈ

దాసుడు చేసిన అపరాధాన్ని క్షమించండి. ఈ కౌపీనానికి బదులుగా మీకు

ఇష్టమైన పట్టువస్త్రాలను, మాణిక్యాలను తీసుకొని నన్ను అనుగ్రహించండి"

అని ఆ బ్రాహ్మణుని తిరుచరణాలపై భక్తితో వాలిపోయాడు. 


బ్రాహ్మణుడు కోపాన్ని ఉపశమించుకొన్న వాడివలె "బంగారం, మాణిక్యాలు, నూతన వస్త్రాలు నాకెందుకు? కౌపీనం బరువుకు సమానంగా ఒక కౌపీనం నాకు

ఇస్తే చాలు” అన్నాడు. నాయనారు త్రాసును తీసుకురాగా బ్రాహ్మణుడు

తన కౌపీనాన్ని ఒక తట్టలో ఉంచాడు. నాయనారు శివభక్తులకు ఇవ్వడం

కోసం తన దగ్గర ఉన్న కౌపీనాలన్నింటిని తట్టలో పెట్టినప్పటికీ అవి

బ్రాహ్మణుని కౌపీనానికి సమానం కాలేక పోయాయి. 


నాయనారు తన

దగ్గరున్న బంగారం, వెండి, అపూర్వములైన రత్నాలు, ధన ధాన్యరాశులు

త్రాసుతట్టలో పెట్టినప్పటికీ ఆ త్రాసుపైనే నిలిచింది. అప్పుడు నాయనారు

"స్వామీ! నా సిరి సంపదలన్నింటినీ ఏ ఒక్కటీ వదలక త్రాసులో పెట్టాను.

ఈ దాసుడు, దాసుని భార్య, కుమారుడు అర్హులుగా భావిస్తే ఈ త్రాసులో ఎక్కడానికి అనుమతించండి" 


అని బ్రాహ్మణుని ప్రార్ధించగా బ్రాహ్మణుడు

దానికి సమ్మతించాడు. భగవంతుని విభూతికి నిజమైన దాస్యభక్తిని గల

మేము భక్తిలోను, ప్రేమలోను కళంకం ఏదీ చేయనట్లేతే మేము ఎక్కిన

వెంటనే ఈ త్రాసు సరిసమానంగా తూగాలి" అని తిరునల్లూరులో నెలకొని

ఉన్న కళ్యాణ సుందరేశ్వర స్వామికి ప్రణమిల్లి పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ

అందరితో కలసి త్రాసు ఎక్కాడు. ఆ బ్రాహ్మణుడు ధరించిన కౌపీనము,

 అమర్నీతి నాయనారు శివునికి భక్తితో చేసిన దాస్యం రెండూ సమానంగా

ఉండడంవల్ల రెండూ తట్టలూ సరిసమానంగా తూగాయి.


ప్రజలందరూ అద్భుతాశ్చర్యాలతో నాయనారుకు నమస్కరించారు.

కళ్యాణసుందరేశ్వరస్వామి జగన్మాత అయిన కళ్యాణసుందరితో కలసి

ఆకాశంలో ప్రత్యక్షమై అమర్నీతి నాయనారుకు దర్శన భాగ్యంతో పాటు

అక్షీణమైన శివలోక పదవిని అనుగ్రహించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

      *ఆరవ చరిత్ర సంపూర్ణం*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: