కార్తీక మాస విశేషాలు - 2
తిల తైల దీపాలు
కార్తీక మాసమునందు పగలు తక్కువ రాత్రి కాలము ఎక్కువగా నుండును. అంతేకాక వాతావరణములో వ్యత్యాసము ఏర్పడి చలి మొదలవుతుంది. దీనితో మానవుని దేహములో ఉష్ణము తగ్గుతుండును. దీని వలన అనేక దేహ అనారోగ్యములు సంభవిస్తాయి. వీటిని సాధ్యమైనంత వరకు నివారించుటకు సాయంత్రం పూట తైల దీపాలను వెలిగిస్తారు. తిల అనగా నువ్వులు. నువ్వుల నుండి తీసిన నూనెతో దీపాలు వెలిగిస్తారు.
నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వెనుక ఆధ్యాత్మికను పరిశీలిస్తే నువ్వులు శని గ్రహానికి చెప్పబడిన ధాన్యము. మూల వ్యాధి స్త్రీల రజో దోషములను నివారించడంలో నువ్వులు ఎంతో సహాయ కారిగా ఉంటాయి. ఈ తిల తైలము మానవుని ఆరోగ్యానికీ మంచిది. తిల తైల దీపములు నుండి వెలువడు ధూపము (పొగ) వాతావరణమును శుద్ది చేయడమే కాక ఉష్ణాంశను ఎక్కువ చేయును. ఈ దీపమును చూచుట కన్నులకు కూడా మంచిది. కంటికి సంబంధించిన నరములపై (optic nerve) మంచి ప్రభావం పడి నరములు బలము పుంజుకొని దృష్టి దోషము పరిహారమగును. అంతేకాక ఈ పొగను పీల్చుట వలన శ్వాస కోశముల మూలకముగా హృదయంపై మంచి ప్రభావం కలుగును. మనుష్యుని శరీరమందుండు జీవనాడి యొక్క ఒక శాఖ (a branch of the vagus nerve) హృదయపు స్పందనను నియంత్రించునని శరీర శాస్త్రము చెబుతున్నది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారము vagus nerve కు శని కారకమని చెప్పినారు. ఇందు చేత శని గ్రహపు ధాన్యమైన నువ్వుల నూనె జ్వాల నుండి జనించు ధూమము శ్వాస కోశముల మూలముగా హృదయంపై అనగా ఈ జీవనాడిపై ప్రభావం చూపి హృదయ రోగములను నివారించుటకు సహాయకారి అగును. అంతేకాక దేహములోని ఉష్ణోగ్రత సమస్థితిలో నుండి చలి ప్రభావమును తగ్గించును.
అందువలన ఈ మాసంలో సాయంత్రపు వేళలో నువ్వుల నూనె దీపములు వెలిగించిన వాతావరణములో సమ శీతోష్ఞ స్థితి ఏర్పడటమే కాక శని భగవానుని అనుగ్రహము కూడా కలుగును. ఇంత ఆలోచించిన మన మహర్షులు కార్తీక మాసములో దీపాలు వెలిగించడాన్ని ఒక సదాచారముగా మనకు అందించినారు.
శుభం భూయాత్ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి