10, జనవరి 2024, బుధవారం

వినయాంజలి

 కవియోగి పోతనకు

         వినయాంజలి 


సీ. బమ్మెర గ్రామాన ప్రభవించి యుర్విపై

               భక్తి పంచిన యట్టి  భాగవతుడు

    పద్యముల్  సేద్యమున్ పరవశంబున చేసి

               సన్నుతుండైనట్టి  సవ్యసాచి

    మకరంద సాహిత్య మాధుర్య రసమును 

               తెలుగుజాతి కిడిన వెలుగు రేఖ

    భక్తి సాహిత్యంబు పంచియున్ మేనున

               పులక లెత్తించిన నలువపట్టి 

తే. రాజులకు కావ్య మీయక రక్తి తోడ 

     భక్తితో రామవిభునకు ముక్తి గోరి

     కావ్య మంకింత మొనరించి ఘనత గాంచె

     భక్త పోతన పావన భాగవతుడు          



 సీ. 'కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి'

                పరికించి చూచిన భక్తవరుడు

     'ఎవనిచే జనియించు నీ జగమ్మ 'నుచును 

               'కరిచేత' తెల్పిన పరమబుధుడు

     'రాజులు గల్గరే ! రాజ్యంబు లేలరే !

               యవనిలో  నుండిరే!' యనిన ఘనుడు

      కన్నీరు నింపిన కమలాసనునిసతి 

                న్నోదార్చి పొగడిన యోగివరుడు

తే. భక్తి వైరాగ్య కావ్యమౌ భాగవతము

      రచన జేసియు నత్యంత రమ్యముగను 

      తెలుగు వారికి నిచ్చిన  దివ్య సుకవి

      పోతనకు మించి యెవ్వరు పుడమి గలరు ?  


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: