23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

పెద్దిశెట్టి గారు...పాలరాతి విగ్రహం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పెద్దిశెట్టి గారు...పాలరాతి విగ్రహం..*


"శ్రీధరరావు గారూ..స్వామివారి సమాధి వద్ద స్వామివారిది పాలరాతి విగ్రహం ప్రతిష్ట చేస్తే ఎలావుంటుందీ?..మా ఇద్దరికీ ఆలోచన కలిగింది..మిమ్మల్ని సలహా అడిగి ఆపైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము.." అన్నారు శ్రీ చక్కా కేశవులు గారు, శ్రీ మీరాశెట్టిగారు..నాన్నగారు కొంచెం సేపు ఆలోచించారు.."స్వామివారి సమాధి మందిరం చాలా చిన్నది కదా..అందులో విగ్రహం ఎలా పెట్టాలి?.."అన్నారు..


"పడమర వైపు గోడ ను కొద్దిగా తొలగించి ఆ ప్రదేశం స్వామివారి విగ్రహాన్ని పెడదాము..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది..మంటపం లో ఉన్న భక్తులకు కూడా శ్రీ స్వామివారి విగ్రహం చక్కగా కనబడుతుంది..ఏమంటారు?.." అన్నారు కేశవులు గారు..


ఈ ఆలోచన అందరికీ నచ్చింది..కానీ ఎంత పరిమాణం లో విగ్రహం చేయించాలో ఎవరికీ తోచలేదు..శ్రీ స్వామివారి సమాధి గది చాలా చిన్నది..అందులో ఎటుచూసినా మూడు అడుగుల వెడల్పుతో సమాధి నిర్మాణం జరిగింది..సమాధికి, గది గోడకు మధ్య రెండు అడుగుల ఖాళీ స్థలమే ఉన్నది..మంటపం లో ఉన్న భక్తులకు కూడా స్పష్టంగా కనబడేలా..సమాధి వద్ద ప్రదక్షిణాలకు ఇబ్బంది లేకుండా ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..ఇది కొంచెం కష్టం తో కూడుకున్న పని..రెండు మూడు రోజుల పాటు ఈ విషయమై ఆలోచన చేశారు..


ఆ సమయం లోనే గోనుగుంట పెద్దిశెట్టి గారు తాను శ్రీ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని..అందుకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తాననీ తెలిపారు..శ్రీ కేశవులు గారు, మీరాశెట్టి గారు ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు..శ్రీధరరావు గారితో చెప్పారు..వారూ సరే నన్నారు..రెండు మూడు రోజుల పాటు తర్జన భర్జన చేసిన తరువాత కూడా..విగ్రహం ఎత్తు ఎంతవుండాలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు..మరో రోజు గడిచింది..అందరూ కూడా ఇక స్వామివారే ఈ సమస్య ను తీర్చాలి అని ఒక నిశ్చయానికి వచ్చారు..ఎప్పుడైతే వీళ్ళందరూ శ్రీ స్వామివారిని శరణు వేడారో.. ఆరోజే పెద్దిశెట్టి గారికి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలో మనసులో తట్టింది..తనకు వచ్చిన ఆలోచనను అందరికీ చెప్పారు పెద్దిశెట్టి గారు..అదే ఖరారు చేశారు..


శ్రీ స్వామివారి విగ్రహాన్ని పాలరాతి తో చేయించారు..ముందు అనుకున్న విధంగానే..శ్రీ స్వామివారి సమాధి గది లో పడమర వైపు ఉన్న గోడలో..విగ్రహం పట్టే విధంగా కొంతమేర తొలగించి..శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు..ప్రతిష్ట కార్యక్రమం మాత్రం పెద్దిశెట్టి గారి కుమారుడు సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా జరిగింది..మళ్లీ కొన్నాళ్ల తరువాత..శ్రీ స్వామివారి విగ్రహానికి వెండితో కవచం చేయించాలని ఒక ప్రతిపాదన చేశారు గానీ..కార్యరూపం దాల్చలేదు..శ్రీ స్వామివారు దిగంబరి గానే వుండేవారు కనుక..కవచం తో విగ్రహాన్ని కప్పివేయడం సరికాదు అనే భావన తో ఆ ఆలోచనను విరమించుకున్నారు..


శ్రీ స్వామివారి విగ్రహం ప్రతిష్ట జరిగిన సంవత్సరం నుండీ..శ్రీ స్వామివారి ఆరాధన ఉత్సవం లో భాగంగా..శ్రీ స్వామివారి విగ్రహానికి, మరియు శ్రీ స్వామివారి సమాధి కి గంధాన్ని అద్ది..తరువాత ఆ గంధాన్ని దత్తదీక్షాపరులకు పంచడం జరుగుతున్నది..ప్రతిరోజూ శ్రీ స్వామివారి సమాధిని దర్శించే భక్తులు..ఈ పాలరాతి విగ్రహానికి మ్రొక్కుకుంటూ వుంటారు..అదొక ఆనవాయితీగా మారిపోయింది..


ఆనాడు శ్రీ పెద్దిశెట్టి గారికి మనసులో తట్టిన ఆలోచన కార్యరూపం దాల్చి..ఈనాడు ఎందరో భక్తుల ఆరాధ్య హేతువుగా మారిపోయింది.."నాదేముంది..? స్వామివారే తన విగ్రహం ఎంత పరిమాణం లో ఉండాలో నిర్ణయించి..నా ద్వారా పలికించారు.." అనేవారు వినయంగా పెద్దిశెట్టి గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: