23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

చదువు,మిత్రుల కోసం

 (నాన్న నేర్పిన చదువు,మిత్రుల కోసం)


[[తండ్రి]]

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ, పద్మము - అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


{{కొడుకు}}

కమలము, నళినము, తామరపూవు


[[తండ్రి]]

అంతేనా?


{{కొడుకు}}

నాకంతే తెలుసు.


[[తండ్రి]]

నేను చెబుతాను చూడు - వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

నాన్నా, నాన్నా, ఆగు.


[[తండ్రి]]

చెప్పు.


{{కొడుకు}}

వీటన్నిటికీ అర్థం పద్మం అనేనా?


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

మరి #డిక్షనరీ వెదికితే ఇవన్నీ దొరుకుతాయా?


[[తండ్రి]]

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది. అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


{{కొడుకు}}

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు నీకెలా దొరికాయి?


[[తండ్రి]]

నేను #అమరకోశం చదువుకున్నాను. అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


{{కొడుకు}}

అదెలా?


[[తండ్రి]]

#అమరం లో కొన్ని పర్యాయపదాలను #అమరసింహుడు ఉపదేశించాడు. వాటికి కొన్ని ప్రత్యయాలు జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


{{కొడుకు}}

ఎలా?


[[తండ్రి]]

చెబుతా చూడు - 1 వారి, 2 నీరమ్, 3 జలమ్, 4 సలిలమ్, 5 కమ్, 6 తోయమ్, 7 ఉదకమ్, 8 పుష్కరమ్, 9 పయః, 10 అంభః, 11 అంబు ... ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు నీరు అనే అర్థంలో చెప్పాడు.


{{కొడుకు}}

అయితే?


[[తండ్రి]]

పద్మము పుట్టేది ఎక్కడ? నీటిలో కదా? అందువల్ల పైన చెప్పిన పదాలకు 'జ' అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - పద్మము అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి. మళ్లీ చెప్పనా? వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

చివరలో 'జ' - అని ఎందుకు చేర్చాలి?


[[తండ్రి]]

'జ' - అంటే జాతము, జన్మించినది అని అర్థం వస్తుంది. జలజ అంటే జలములో జన్మించినది అని అర్థం. అలాగే నీరజ అంటే నీటిలో జన్మించినది అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


{{కొడుకు}}

జ అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా?


[[తండ్రి]]

జాతము అనవచ్చు.


{{కొడుకు}}

అయితే నేను చెబుతాను చూడు. వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము..


[[తండ్రి]]

బలే. నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


{{కొడుకు}}

జ, జాత మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా?


[[తండ్రి]]

భవ, ఉద్భవ, సంభవ అనే పదాలను చేరిస్తే పుట్టినది లేదా పుట్టినవాడు అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు జలభవము, జలోద్భవము, జలసంభవము అంటే జలంలో పుట్టినది అని అర్థం. అలాగే నీరభవము, నీరోద్భవము, నీరసంభవము అని చెప్పవచ్చు.


అలాగే రుహ అనే ప్రత్యయం చేర్చవచ్చు. రుహము అంటే పెరిగేది. 


{{కొడుకు}}

అయితే నేను చెబుతా దానితో పేర్లు - వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము..


[[తండ్రి]]

బాగా చెప్పావు. ఏక సంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా పద్మము అనే అర్థం. ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా?


{{కొడుకు}}

నీటికి 11 పర్యాయవాచకాలు చెప్పావు. వాటికి జ అనే ప్రత్యయం చేర్చి, పద్మం అనే అర్థంలో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. జాత అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. రుహ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, ఉద్భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, సంభవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను. అంటే, మొత్తానికి పద్మము అనే అర్థంలో ఇప్పటికిప్పుడు 66 పదాలను చెప్పగలను.


[[తండ్రి]]

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు? ఇప్పుడేమో ఏకంగా అరవై ఆరు పదాలు చెప్పగలనంటున్నావు?


{{కొడుకు}}

నువు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను?


[[తండ్రి]]

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


{{కొడుకు}}

అదెలా నాన్నా?


[[తండ్రి]]

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు?


{{కొడుకు}}

పద్మాన్ని హస్తంలో ధరించే విష్ణువు ఉన్నాడు. పద్మాన్ని నాభిలో ధరించిన అదే విష్ణువు ఉన్నాడు. పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు ఉన్నాడు. క్షీరసాగరమధ్యంలో పద్మంలో జన్మించిన లక్ష్మీదేవి ఉన్నది. 


[[తండ్రి]]

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు? సరే, ఇప్పుడు చూడు. పద్మం అనే అర్థంలో నీవు 66 పదాలు చెప్పగలవు కదా? వాటికి చివర హస్తుడు అని చేర్చు. వాటన్నిటికీ పద్మాన్ని చేతిలో ధరించినవాడు అనే భావంలో విష్ణువు అనే అర్థం వస్తుంది. అంటే ఈ క్షణంలో నీవు విష్ణువు అనే పదానికి పర్యాయవాచకాలు 66 చెప్పగలవు.


{{కొడుకు}}

ఓహో. బలే. అర్థమైంది. వారిజహస్తుడు, నీరజహస్తుడు ఇలా అన్నమాట.  


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

అయితే నాన్నా, హస్తం అనే పదంతో పాటు కరము, పాణి అనే పదాలను కూడా చేయి అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా, వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా?  


[[తండ్రి]]

హాయిగా ఉపయోగించవచ్చు. ఆవిధంగా హస్తుడు అనే ప్రత్యయాన్ని చేర్చి 66, కరుడు అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66, పాణి అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66 మొత్తం 198 పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


{{కొడుకు}}

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే?


[[తండ్రి]]

నీటికి ఇంకా కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము - ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి. నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను. ఆ పదాలతో పద్మం అనే అర్థం సాధించి, మరలా ఆ పద్మాన్ని చేత ధరించినవాడనే అర్థంలో ఇంకెన్ని విష్ణుపర్యాయవాచకాలను సృష్టించవచ్చో చూడు. 


{{కొడుకు}}

బలే నాన్నా, బలే. అలాగే పద్మంలో పుట్టిన బ్రహ్మ అనే అర్థంలో - పద్మం యొక్క 66 పర్యాయవాచకాలకు జ, జాత, భవ, సంభవ, ఉద్భవ, రుహ అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం 396 (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


[[తండ్రి]]

ఓహో, సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా? పద్మజుడు, పద్మసంభవుడు అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే బ్రహ్మ అనే అర్థం వస్తుంది.  


వాటిని పద్మజ, పద్మసంభవ అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే లక్ష్మి అనే అర్థం వస్తుంది.


మరి ఆ బ్రహ్మకు తండ్రి విష్ణువు అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు? 

 

{{కొడుకు}}

పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా, తండ్రి అనే అర్థాన్నిచ్చే జనక, గురు, పితా, జన్మద అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ 396 పదాలకు చేరిస్తే (396x4) 1584 పదాలను విష్ణువు అనే అర్థంలో సృష్టించగలను.


[[తండ్రి]]

మరి లక్ష్మీదేవికి భర్త విష్ణువు అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు?


{{కొడుకు}}

పద్మంలో పుట్టినది లక్ష్మి అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా, వాటికి పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ వంటి నాకు తెలిసిన ఓ 6 ప్రత్యయాలను చేర్చి (396x6) 2376 పదాలను సృష్టించగలను. 


[[తండ్రి]]

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు. విష్ణువుకు మొత్తం 3960 నామాలను సృష్టించావు. (1584+2376)


{{కొడుకు}}

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


[[తండ్రి]]

పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు అంటే విష్ణువు కదా, పద్మానికి 66 పర్యాయపదాలు నీకు తెలుసు కదా, వాటికి చివర నాభుడు అనే ప్రత్యయం తగిలించు. వారిజనాభుడు, జలజనాభుడు అంటూ. కాబట్టి, 3960+66=4026 నామాలు వచ్చాయి. మొత్తానికి ఇలా విష్ణుచతుస్సహస్రనామాలు సృష్టించగలవు.


{{కొడుకు}}

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా.


[[తండ్రి]]

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు. ఇన్నేసి పదాలను #డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు. అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ అంటూ ఉంటారు.  


{{కొడుకు}}

అవును నాన్నా, ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


[[తండ్రి]]

సరే, నళినదళేక్షణ అనే పదం విన్నావా?


{{కొడుకు}}

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా?


[[తండ్రి]]

నళినదళేక్షణుడు అంటే అర్థం ఏమిటి?


{{కొడుకు}}

రాముడు.


[[తండ్రి]]

ఆ కీర్తన విని, ఆ కీర్తనలో రామపరంగా వాడిన పదాన్ని బట్టి రాముడు అంటూ రూఢి-అర్థాన్ని గ్రహించావు. మరి #యౌగికార్థం చెప్పు?


{{కొడుకు}}

అదేమిటి?


[[తండ్రి]]

నళినము అంటే పద్మము. నళినదళము అంటే పద్మదళము, ఈక్షణము అంటే చూపు లేదా కన్ను. కాబట్టి నళినదళేక్షణుడు అంటే పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు అని అర్థం. అది యౌగికార్థం అంటే. అటువంటి కళ్లు ఎవరికి ఉన్నా సరే, వాళ్లందరూ కూడా నళినదళేక్షణులే. నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


{{కొడుకు}}

ఓహో.


[[తండ్రి]]

ఓహో అని ఆశ్చర్యపోవడం కాదు. నళినదళేక్షణుడు అంటే యౌగికార్థం తెలిసింది కదా? మరి ఇప్పుడు సమానార్థకాలైన ఇంకెన్ని పదాలను సృష్టించగలవు?


{{కొడుకు}}

నళినము అంటే పద్మము అనే అర్థంలో మునుపు 66 పదాలను సృష్టించివున్నాము కదా, వాటికి చివర కన్ను అనే అర్థంలో ఈక్షణ, నేత్ర, నయన, లోచన, చక్షు, అక్ష అని నాకు తెలిసిన ఆరు ప్రత్యయాలను ఉపయోగించి పద్మేక్షణుడు, పద్మనేత్రుడు, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మచక్షువు, పద్మాక్షుడు ఇలా 396 పదాలను (66x6) సృష్టించగలను. ఇలా పుంలింగంలో ఉపయోగిస్తే 396 పదాలతో రాముడు వస్తాడు. అలాగే పద్మేక్షణ, పద్మనేత్ర, పద్మనయన, పద్మలోచన, పద్మచక్షువు, పద్మాక్షి అంటూ మరో 396 పదాలను స్త్రీలింగంలో ఉపయోగిస్తే సీతమ్మవారు. అంతేనా?


[[తండ్రి]]

అవును. ఆ పదాలకు రాముడు, సీతమ్మ అని మాత్రమే అర్థాలను గ్రహిస్తే అవి నీకు రూఢార్థాలు. అలా కాదు, పద్మం వంటి కన్నులు కలిగిన ఎవరైనా పద్మాక్షుడు లేదా పద్మాక్షి కావచ్చును అనే అర్థంలో గ్రహిస్తే అవి యౌగికార్థాలు.




{{కొడుకు}}

ఓహో, మరి అకాయుడు అనే పదాన్ని మనం రూఢార్థంలో గ్రహించాలా లేక యౌగికార్థంలో గ్రహించాలా?


[[తండ్రి]]

ఎలాగైనా గ్రహించవచ్చు.


{{కొడుకు}}

అర్థమైంది నాన్నా.


[[తండ్రి]]

శుభమస్తు.


{{కొడుకు}}

సర్వం శ్రీ నళినదళేక్షణార్పణమస్తు.  

అంటే #శ్రీరామార్పణమస్తు.


[[తండ్రి]]

తథాస్తు.


Note: ఈ సందర్భంలో ప్రత్యయం అనే పదం ఆంగ్లంలోని Suffix అనే పదానికి సమానార్థకంగా వాడబడింది.  



"నాన్న నేర్పిన చదువు" 



మాఘశుక్లచతుర్దశీ, శోభకృత్, శుక్రవాసరః

రచన :- శ్రీ శ్రీనివాసకృష్ణ గారు

కామెంట్‌లు లేవు: