24, ఫిబ్రవరి 2024, శనివారం

సూక్తము అంటే

 🙏🙏🙏🙏🙏


సూక్తము అంటే సు ఉక్తము - సుష్ఠు ఉక్తము - బాగుగా, చక్కగా చెప్పబడినది. ఉక్తము అంటే చెప్పబడినది అని అర్థం. బాగా చెప్పబడింది ఎప్పుడు కూడా పరమాత్మ గురించే అవుతుంది, భగవత్తత్త్వాన్ని గురించే అవుతుంది కనుక వేదములో పరమాత్మ వివిధ శక్తులను గురించి చేసే స్తోత్రాలను సూక్తములు - అంటాము. ఋగ్వేదంలో ఎన్నో సూక్తములు ఉన్నాయి. మనకి పురుష సూక్తము, నారాయణ సూక్తము, శ్రీ సూక్తము, ఇళా సూక్తము, మన్యుసూక్తము, రాత్రి సూక్తము, దూర్వా సూక్తము ... ఇలా అనేకమైనవి ఉన్నాయి. శ్రీ రుద్ర నమక చమకములను కూడా రుద్ర సూక్తము అంటాము. ఉన్న ఒక్క పరతత్వాన్ని మన కోర్కెలను తీర్చడానికి మనకు ఏమేమి కావాలో వాటిని మనకు ఇచ్చే స్వరూపాలుగా, అనేక నామరూపాలతో స్తోత్రించే సూక్తాలను మహర్షులు మనకి సూక్తముల రూపంలో అందించారు.


పురుష సూక్తంలో పరబ్రహ్మమును విరాట్ స్వరూపునిగా వర్ణించారు. నారాయణ సూక్తము నారాయణని గురించి, ఆయనే పరబ్రహ్మము అని వర్ణిస్తుంది. అలాగే శ్రీ సూక్తంలో శ్రీదేవి - మహాలక్ష్మి దేవి వర్ణించబడింది. భూ సూక్తం భూమాతను గురించి స్తోత్రిస్తుంది. అలాగే అన్ని సూక్తాలూను. వేదములలో వంద కంటే ఎక్కువ సూక్తాలున్నాయి. వేదంలోని సూక్తములన్నీ కూడా మంత్రభరితమైనవి. ప్రతి అక్షరము కూడా మంత్ర శక్తి యుతమైనవి. పరమాత్మ యొక్క విభూతులను గురించి చెప్పేవి వేదంలో ఉన్నవి. వీటిని సూక్తములు అంటాము. 


"పురుష సూక్తము.

నారాయణ సూక్తము.

శ్రీ సూక్తము.

భూ సూక్తము.

నీళా సూక్తము." - వీటిని పంచ సూక్తములు అంటారు. 

యజుర్వేదములో ఉన్న శ్రీ రుద్ర నమక చమకములను కూడా శ్రీ రుద్ర సూక్తము అంటాము.


లౌకికంగా చెప్పే మంచి మాటలను "సూక్తులు" అంటాము. సూక్తి అంటే కూడా మంచిగా, బాగుగా, చక్కగా చెప్పబడిన మాట అని అర్థం.చక్కగా ప్రజలందరికీ ఉపయోగపడే నీతి భరితమైన, దైవ సంబంధమైన, ఆధ్యాత్మికమైన ఏ మంచి మాటలనైనా సూక్తులు అని అంటాము. 


సూక్తి వేరే ! సూక్తము వేరే ! "సూక్తము" అనేది దైవం గురించి మనకు తెలియజేది, వేదములలో ఉన్నది. 


ఈ సూక్తాలన్నిటిని కూడా సమయం ఉన్నప్పుడు ఒక్కొక్క సూక్తాన్ని, ఆ సూక్తంలో ఏమేం చెప్పారు అన్నది అందరం కూడా భావన చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: