2, మార్చి 2024, శనివారం

🪐శ్రీ కృష్ణావతారం

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *107వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శ్రీకృష్ణ నిర్యాణంబు* 


ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాతృడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. “నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.” అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.

అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు. ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు. నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.


 


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: