1, మార్చి 2024, శుక్రవారం

పేరు మార్చుకోరా

 😀😀😀😀

"ఏమండీ! మన పెళ్లి అయిన దగ్గర నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను పేరు మార్చుకోరా మీరు?" కోపంగా అడిగింది సుప్రియ.


"నువ్వు ఎన్ని సార్లు అడిగావో నేనూ అన్ని సార్లు చెప్పాను మార్చుకోనని. నా పేరు మా నాయనమ్మ పెట్టింది మా తాతగారి పేరుట", అంతే కోపంగా చెప్పాడు అప్పారావు. 


"మరీ అప్పారావు ఏమిటండీ? అప్పుల అప్పారావు లాగ. మీ వాళ్లు అందరూ 'ఒరేయ్ అప్పిగా అప్పిగా' అని పిలుస్తుంటే నాకూ ఒళ్లంతా కారం రాసుకున్నట్టుగా భగభగ మండి పోతోంది." 


"ఇప్పుడు ఏమీ చేయమంటావ్ నన్ను! ఎంతో అభిమానంతో పిలుస్తున్నారు. వాళ్లతో అలా పిలవద్దని చెప్పలేను. ఈ విషయంలో నేనూ ఏమీ చేయలేను." 


"అయితే నా కొడుక్కి మాత్రం నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటాను. అందులో మీరు తల దూర్చకండి.

ఖరాఖండిగా చెప్పింది సుప్రియ."


"సరే నీ ఇష్టం" ముఖం మాడ్చుకుని చెప్పాడు అప్పారావు.

 

చాలా బుక్స్ లో, ఇంటర్నెట్ లో వెదికి ఒక మంచి లేటెస్ట్ పేరు సెలెక్ట్ చేసి ప్రజ్వేష్ అని పెట్టింది సుప్రియ. ఆ పేరుతోనే పిలవమని ముద్దు పేర్లతో పిలవద్దని అప్పారావుకు మరీ మరీ చెప్పింది.


ఒకసారి అప్పారావు దగ్గర బంధువుల ఇంట్లో పెళ్లికి భార్యని కొడుకుని తీసుకు వెళ్లాడు.  అందరూ పిల్లాడిని ఎత్తుకుని 'మన అప్పిగాడి కొడుకు' మన 'అప్పిగాడి కొడుకు' అనుకుంటూ పిల్లాడిని ఒకరి తరువాత ఒకరు ఎత్తుకుంటూనే వున్నారు. అందులో ఒక్కరు కూడా ఆ పిల్లాడిని అసలు పేరుతో పిలవలేదు.

 

ఆ పెళ్లికి వెళ్లి వచ్చిన దగ్గరనుండి 'నీ పేరేమిటి' అని ఆ పిల్లాడిని ఎవరైనా అడిగితే వచ్చీరానీ మాటలతో  'అప్పిగాడి కొడుకుని' అని చెప్పడం మొదలు పెట్టాడు. 


తల కొట్టుకుంటూ సుప్రియ అలా 'అప్పిగాడి కొడుకు' అని చెప్పకురా! మీ నాన్నతో పోట్లాడి అందమైన పేరు పెట్టాను నీకు. ఎవరైనా అడిగితే నీ పేరు చెప్పరా అంటూ కొడుకును బ్రతిమాలి, ఆ అలవాటు మార్చడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది పాపం సుప్రియ.* 


కొన్ని రోజుల తరువాత ఊరునుంచి అప్పారావు మేనమామ వచ్చాడు. "నువ్వు మా అప్పిగాడి  కొడుకువు కదూ"? చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అంటూ ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకున్నాడు.  


"అవునండీ! అప్పిగాడి కొడుకునే! కానీ మా అమ్మ ఒప్పుకోవట్లేదు..... కాదంటోంది.....


ఆ మాట విని ఆ పెద్దాయన షాక్....తిన్నారు. 😃🙃😁😃😉😃😁

కామెంట్‌లు లేవు: