శు భో ద యం🙏
.నల్లనయ్యకై గోపికల యన్వేషణము
ఉ: నల్లనివాఁడు పద్మ నయనంబులవాఁడు కృపారసంబు పై
జల్లెడువాఁడు మౌళి పరిసర్పిత ఫింఛమువాఁడు నవ్వురా
జిల్లెడు మోమువాఁడొకఁడు చెల్వల మాన ధనంబుఁదెచ్చె నో
మల్లియలార ! మీ పొదల మాటున లేఁడు గదమ్మ! చెప్పరే?
భాగవతము-- దశమస్కంథము--1010 వ:పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.
భక్తిని శృంగారాన్ని మిళితం చేసి ,దానికి 'మధుర భక్తి ' యనేసంకేతాన్ని పొందేలా మనోజ్ఙంగా మధుర మధురంగా గోపికా కృష్ణుల ప్రణయాన్ని చిత్రించాడు పోతన కవి. ఏమా కృష్ణుడు? ఒకచో తుంటరి .మరియొకచో భక్త రక్షణాపరాయణుడు.కొండొకచో దుష్ఠ సం హారి.వేరొచోరాసవిహారి. అతనిలీలలనుపమానముములు.
పాపమామా వెర్రిగొల్ల పడుచులు ఆయన ప్రేమలో చిక్కుకున్నారు. తలస్పర్శిప్రణయమున మునిగిన వారికి కృష్ణయ్య యెడబాటు. మిగుల దుర్భరమైనది. కంసుని పనుపున కృష్ణుడు మధురకేగినాడు. వచ్చుటకు తడవైనది. ఆవిరహమునోర్వజాలక గోపికలు బృందావనమునకు బరువెత్తినారు. కృష్ణుడెందైన దాగియున్నాడేమోనని వారిభ్రమ. చెట్టును పుట్టను గుట్టను కృష్ణుని జాడదెలుప గోరుచున్నారు.
ఆసందర్భములోనిది యీపద్యరత్నము! ఎవరిజాడ గోరెదరో వారిరూపురేఖలను చెప్పవలసియుండునుగదా!
గోపికలు మల్లెపొదల కడకేగి ఆపనియే చేయుచున్నారు.
" ఓమల్లియలారా! నల్లనిమేనివాడు .తామరలవంటి విశాలనేత్రములుగలవాడు ,దయావర్షమునుగురియు వాడు ,నెమలిపింఛమును శిరమున ధరించువాడు, నగుమోముతో నొప్పువాడు.అగు దొంగయొకడు వనితామానధనమును కొల్లగొని
యిటువచ్చినాడు. వాడేమైన మీపొదల మాటున లేడుగదా! చెప్పుడు? -- అంటున్నారు.
అసలు చెట్లనడగటం యేమిటి? ఉన్మాదం. విరహంలోకూడా ఉన్మాదం వస్తుంది. అదిగో విరహాధిక్యతచే వారంతా ఉన్మాదులయ్యారు. అందుచేత వారికి యెవరిని యడుగు చుంటిరో తెలియుపరిస్థితికాదు. అయినను కృష్ణుని ఆకారమును గుణములను చక్కగాచెపుతున్నారు. ఇదినిరంతరము కృష్ణదర్శనముచేత వారికి గలిగిన జ్ఙానము.
నీలమేఘ శ్యాముడై విశాలనేత్రుడై దయాప్రవర్షియై శిఖిపింఛమౌళియై సుందర దరస్మిత వదనుడై యొప్పు నల్లనయ్య గోపవనితా మానస చోరుడగుట విచిత్రముగదా!చివరకు గోపికలకడ నతడు దొంగయైనాడు. ఆహా !కృష్ణయ్యా! ఏమినీమాయ? ఏమినీలీలలు? విన్నంతనే పులకితులమగుచుంటిమే , నిను గని నీసన్నిధి ననుభవించిన గోపిక లెంతధన్యలో?
మనసార నిను వర్ణించిన మాపోతనకవీంద్రుడు ధన్యతముడనుటయదార్ధమే!
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి