*🙏జై శ్రీమన్నారాయణ 🙏*
ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. మనస్సాక్షి మూడు రకాలు. నిర్ధారిత మనస్సాక్షి అనుమానకర మనస్సాక్షి, సున్నిత మనస్సాక్షి అనేవి ఆ మూడూ. తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహ నివృత్తి చేసేది మొదటిది. మంచి చెడుల మధ్య భేదాన్ని తెలిపేది రెండోది. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మాంశాలను జాగ్రత్తగా గమనించి ఎరుక పరచేది మూడోది. మనస్సాక్షి చెప్పేదాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారవుతారు.
మన గురించి మనకు తెలియజేయడం, మన లోపలి ఆలోచనల్ని, భావాల్ని నిజాయతీగా ఉండేటట్లు నియంత్రించడం మనస్సాక్షి చేసే పని. అందుకే నీ ఆత్మ చెప్పినట్లు చేయడమే శ్రేయస్కరం (ఆత్మ బుద్ధిః సుఖంచైవ) అని సూక్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి