11, సెప్టెంబర్ 2024, బుధవారం

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు --

 🙏🙏🙏యుగ కర్త అవడానికి అన్ని అర్హతలు ఉన్న 

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు -- వ్యాసం 

జ్ఞానపీఠఅవార్డు గ్రహీత, పద్మభూషణ్ శ్రీ విశ్వనాథ

సత్యనారాయణ గారు 1895 సెప్టెంబర్‌ '10'న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించినారు. వీరు వెలనాటి శాఖీయులు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.తల్లిదండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి, సంపన్న కుటుంబంలో పుట్టినా దారిద్య్ర వ్యధలను( చిన్నతనములో తల్లిని, యవ్వనములో భార్యను, వార్ధక్యములో కుమారుని కోల్పోయినారు ) అనుభవించిన వ్యక్తి ఆయన , విద్యార్ధి దశ అంతా బందరు హిందూ హైస్కూల్ లో, నోబుల్ కాలేజీ లో గడిపారు. హిందూ హై స్కూలు ఆవరణంలోకానుగ చెట్లెక్కి అలవోకగా 'శృంగార వీధి' పద్యాలు చెప్పారట!


విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివిఎన్నో ఉన్నాయి. 

తెలుగుదనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి

వారి గ్రంథ సముదాయం!

నవలా సాహిత్యం 

వేయిపడగలు, స్వర్గానికి నిచ్చెనలు, చెలియలికట్ట

ఏకవీర, తెఱచిరాజు, మాబాబు, జేబుదొంగలు

వీరవల్లడు,వల్లభమంత్రి, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, దేవతల యుద్ధము,పునర్జన్మ, పరీక్ష

నందిగ్రామ రాజ్యం, బాణావతి, అంతరాత్మ

గంగూలీ ప్రేమకథ, ఆఱునదులు, చందవోలు రాణి

ప్రళయనాయుడు, హాహాహూహూ మ్రోయు తుమ్మెద, సముద్రపు దిబ్బ, దమయంతీ స్వయంవరము, నీల పెండ్లి, శార్వరి నుండి శార్వరి దాక,కుణాలుని శాపము,ధర్మచక్రము, కడిమిచెట్టు

వీరపూజ, స్నేహఫలము, బద్దన్న సేనాని

నేపాళ రాజవంశ నవలలు (ఆరు నవలలు)

దిండు క్రింది పోకచెక్క, చిట్లీచిట్లని గాజులు

సౌదామిని, లలితాపట్టణపు రాణి దంతపు దువ్వెన దూతమేఘము

కాశ్మీర రాజవంశ నవలలు (ఆరు నవలు)

కవలలు, యశోవతి, పాతిపెట్టిన నాణెములు

సంజీవకరణి,మిహిరకులుడు, భ్రమరవాసిని

పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)

భగవంతుని మీది పగ, నాస్తిక ధూమము

ధూమరేఖ, నందోరాజా భవిష్యతి, చంద్రగుప్తుని స్వప్నము, అశ్వమేధము, అమృతవల్లి పులిమ్రుగ్గు, నాగసేనుడు, హెలీనా వేదవతి

నివేదిత.

పద్య కావ్యాలు

శ్రీమద్రామాయణ కల్పవృక్షము (6 కాండములు)

ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషము, విశ్వనాథ మధ్యాక్కఱలు, ఋతు సంహారము

శ్రీకుమారాభ్యుదయము, గిరికుమారుని ప్రేమగీతాలు, గోపాలోదాహరణము

గోపికాగీతలు, భ్రమరగీతలు, ఝాన్సీరాణి

ప్రద్యుమ్నోదయము, రురుచరిత్రము, మాస్వామి

వరలక్ష్మీ త్రిశతి, దేవీ త్రిశతి (సంస్కృతం)

విశ్వనాథ పంచశతి, వేణీభంగము, శశిదూతము

శృంగారవీధి, శ్రీకృష్ణ సంగీతము, నా రాముడు

శివార్పణము,ధర్మపత్ని, భ్రష్టయోగి (ఖండకావ్యము)

కేదారగౌళ (ఖండకావ్యము), గోలోకవాసి

దమయంతీస్వయంవరం మొదలగునవి 

నాటకములు!


అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)

గుప్తపాశుపతమ్ (సంస్కృతం)

గుప్తపాశుపతము, అంతా నాటకమే అనార్కలీ

కావ్యవేద హరిశ్చంద్ర, తల్లిలేని పిల్ల, త్రిశూలము

నర్తనశాల, ప్రవాహం, లోపల - బయట, వేనరాజు

అశోకవనము, శివాజి - రోషనార, ధన్యకైలాసము

నాటికల సంపుటి (16 నాటికలు)

విమర్శనా గ్రంధములు!


అల్లసానివారి అల్లిక జిగిబిగి, ఒకనాడు నాచన సోమన్న, కావ్య పరీమళము, కావ్యానందము

నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి

విశ్వనాథ సాహిత్యోపన్యాసములు

శాకుంతలము యొక్క అభిజ్ఞానత

సాహిత్య సురభి, నీతిగీత

సీతాయాశ్చరితమ్ మహాత్ కల్పవృక్ష రహస్యములు, సాహితీ మీమాంస.

శతక సాహిత్యం


విశ్వేశ్వర శతకము, విశ్వనాథ పంచశతి

శ్రీగిరి శతకము, శ్రీకాళహస్తి శతకము 

భద్రగిరి శతకము, కులస్వామి శతకము 

శేషాద్రి శతకము, ద్రాక్షారామ శతకము 

నందమూరు శతకము , నెకర కల్లు శతకము

మున్నంగి శతకము, వేములవాడ శతకము

పైన పేర్కొన్న శతకము అన్ని మధ్యాక్కఱలు


ఇతర రచనలు 

కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెండ్లి

పాము పాట, చిన్న కథలు, "ఆత్మ కథ"



తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠఅవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నారు. తమిళనాడులోని మదురై ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించారు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు ఆనాటి యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితరసాధ్యమైన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.


విశ్వనాథ సత్యనారాయణ వారి ముఖ్య రచనా సాహిత్యంలో శతకములు ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి, వీటి గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.

శ్రీ విశ్వనాధ వారి 10 శతకాలు వాటి పేర్లు, మకుటము కొఱకు మళ్ళీ ప్రస్తావించటం జరిగింది.

1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ!

2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ!

3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!

4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!

5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ!

6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ!

7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల!

8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!

9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల!

10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి!


ఆయన తొలినాళ్ళలో వ్రాసిన "గిరికుమారుని ప్రేమగీతాలు" `రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రిలతో పాటుగా విశ్వనాథ సత్యనారాయణ కూడా భావకవిత్వ రంగంలో ప్రముఖునిగా పేరొందారు. విశ్వనాథ రచించిన ఋతుసంహారం, తెలుగు ఋతువులు వంటి కావ్యాలలో ఆయన చేసిన వర్ణనలు తెలుగు నాట ఋతువుల సూక్ష్మమైన వర్ణనలు చాలా పేరుపొందాయి

. భావకవిత్వంలో అతికొద్ది ఇతివృత్తమో, అసలు ఇతివృత్తమే లేకుండా కేవల ఖండకావ్యమో వ్రాయడం మరింత పెరగడం, నాజూకు దనంతో, ప్రతి పద్యమూ మాధుర్యంతో ఉండాలనే రీతులు ప్రాచుర్యం పొందడంతో విశ్వనాథ ఆ మార్గానికి దూరం కావడం జరిగింది. కథాంశం అత్యంత కీలకమని, కథను చెప్పడంలో వివిధ మలుపుల్లో అవసరమైనంత మేరకే ఏ చమత్కృతి అయినా రాణిస్తుందని విశ్వనాథ భావించేవారు, తదనుగుణమైన రచనలు చేసేవారు. నిజానికి తొలినాటి రచనలైనా ఈ పద్ధతిలో భావకవిత్వానికి ఎంతో భేదం ఉన్నాయి. కిన్నెరసాని పాటలు అమలిన శృంగారం వంటి భావకవితా లక్షణాలను కొంత కనబరిచినా, మౌలికమైన కథాంశ రాహిత్యం లేకపోవడంతో భావకవిత్వానికి - ఆయన మార్గానికి సంబంధం లేదని విమర్శకులు భావించారు. ఆతరువాత కాలంలో ఆయన చేసిన అనేకమైన పద్య రచనల్లో భక్తిరచనలు ముఖ్యమైనవి.


"విశ్వనాధ వారి మాటలు వారి కావ్యల గూర్చి" 

     

ఏ కవి అయినా 'తన కావ్యం గొప్పదంటాడు. ఎవరో నా 'ఏకవీర' ఉత్తమమని అన్నారు..నేను ఉత్తమమని ఎందుకనాలి?ఒక తరం పోయి మరొక తరం వచ్చినట్టు చెప్పిన'వేయి పడగలు' గొప్పది కాదా? దాని గుణ గణాలు ఎవరైనా పరిశీలించారా?ఎంతో సైకాలజీ గుప్పించిన 'చెలియలి కట్ట' ఏమైనట్టు? 'పురాణ వైర గ్రంధ మాల' లో ఒక్కొక్క నవలలో ఒక్కొక్క శిల్పం చూపానే! ఎవరైనా చూశారా? మన ప్రమాణాలునిలుస్తాయా? ఎంతో పోయె..దేవాలయాలే కూలి పోయె! ''...అని కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పిన వాడు..


       ''రామాయణ కల్ప వృక్షాన్ని మించిన కవిత్త్వం ఉండదు..సర్వ శక్తులూ పెట్టి వ్రాశాను..పరమేశ్వరుడు అనుగ్రహించాడు..నారాయణుడే పరమేశ్వరుడు..'' అన్న ధీశాలి, జ్ఞాని...జ్ఞాన పీఠానికి ఘనతను తెచ్చిన ప్రజ్ఞాన ఖని.. '' సనాతన ధర్మం రాదు..కానీ..వేద మతానుసరణం తప్పదు..ఆది వినా ప్రపంచ శాంతిఉండదు..ఏ ఇజమూ గట్టెక్కించదు ..వేదిజం ఒక్కటే శరణ్యం..'' అని నిష్కర్షగాచెప్పిన వాడు... ''ఇంగ్లీషు లో ఏ రవీంద్రుడి లాగానో..ఇలియట్స్ లాగానో కవితా భాష వ్రాసే అలవాటుపోయింది..సంస్కృతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యిన్నొకటో వాడినో అవుతాను..తెలుగులో నంటారా..పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తర్వాతపదమూడవ వాడిని నేను..'' అని రొమ్ము విరుచుకుని చెప్పగలిగిన దమ్మున్నదక్షుడు.. 


     సాక్షాత్తూ వారణాసి సంస్కృత విశ్వ విద్యాలయ ఆచార్యులచేత పొగడ్తలు పొందినారు '" ఈ గమకం, సంస్కృతవృత్తాల శయ్య, గతి ఈ దేశంలోనే అపూర్వం! సంస్కృతాంధ్రాలు ఇంత అందంగాసహజీవనం చేస్తాయని మాకు తెలియదు, .వీరి రచనా రీతి విశిష్టమైనది..దీనిని ఆంధ్రరీతి అని కానీ..విశ్వనాధరీతి అని కానీ పిలుద్దాము..'' అనిపించుకున్న మహాకవి సామ్రాట్టు..విశ్వ నాధ సత్యనారాయణ గారు.వారు స్వయం కృషితో,పట్టుదలతో తనను ఒక్కొక్క భాషా సాహిత్యం గురించి ఎవరైనా ఎద్దేవా చేసినప్పుడల్లా..ఆ భాషా సాహిత్యాన్ని మథించి...లోతులు తుద ముట్టిన వారు, 


. 1920 ప్రాంతంలో 'సాహితి' లోఅచ్చైన 'గిరికుమారుని ప్రేమ గీతాలు' వారి తొలి కవితలట. మొదటి నవల పేరు 'అంతరాత్మ'అట, జాతీయోద్యమ నేపధ్యంలో మొదలు పెట్టిన దీన్ని ఎందుకనో సగం వ్రాసి వదలి పెట్టారుట. 


              ఆయన రచనా విధానం అత్యంత విచిత్రమైనది. పద్యాలయితే ఒకేసారి ఒక వంద తమమనసులోనే పూర్తి చేసుకొని, ఒకే సారి వాటిని కాగితం మీద పెట్టేవారట. ప్రయాణం లోనో,వేరే ఎక్కడనో ఉన్నప్పుడైతే ఒక్కొక్క పద్యానికి అంగవస్త్రానికి ఒక్కొక్క ముడి వేశే వారట.ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక్కొక్క ముడి విప్పుతూ ఒక్కొక్కటి స్ఫురణకు తెచ్చుకునేవారట. వచనం అయితే చెప్తుంటే వేరే ఎవరైనా లేఖకుడు వ్రాయాల్సిందే. ;ఏక వీర' వ్రాస్తున్నప్పుడుమాత్రం ప్రతి శుక్ర వారం టెంకాయ కొట్టి, పూజ చేసి..ఆశువుగా వినిపించే వారట. 'వేయి పడగలు'మాత్రం మొదట్లో స్వయంగా వ్రాయడం మొదలు పెడితే..మూడు ప్రకరణాలకు మూడు నెలలు పట్టిందట, ఇలా కాదని, చెప్పడం.. లేఖకుడు వ్రాయడం మొదలు పెట్టిన తర్వాత..29 రోజులలో వేయి పేజీలు ఏక బిగిన చెప్పారట! 


        సుష్టుగా భోజనం చేసే భోజన ప్రియుడు, ఆవకాయలో పచ్చి మిరప కాయ కొరుక్కునే ఆశ్చర్యకరమైన అలవాటు, కామిక్స్ అన్నా..స్టంటు సినేమాలన్నా..ఇంగ్లీషు సినిమాలన్నావదిలిపెట్టని ప్రీతీ.. ఇవి కొన్ని వారి అభిరుచులు, అలవాట్లు! అప్పుడప్పుడు ఆయన పీఠికలు గొప్పవా.. ఆ పీఠికలు వున్న గ్రంధాలు గొప్పవా.? అని అనేకులు తర్కించుకునేవారు అంటే ఆయన పీఠికలు ఎంత గొప్పవో అర్ధం చేసుకోవచ్చు 


             ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. ద్రావిడ భాష సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. 

          ''ఒక జాతి జాతీయతకు సంప్రదాయము ప్రాణము.అదే ప్రాణశక్తి'' అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సంప్రదాయ భీష్ముడు. ఆయన మాట కరుకు, మనసు వెన్న, ఆయన మరెవరో కాదు తెలుగు సాహితీకారులకి జ్ఞాన పీఠాన్ని రుచి చూపిన కవిసామ్రాట్‌, కళాప్రపూర్ణ, పద్మభూషణ్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకే పురాకృతి సుకృతమైన ప్రతిభకు భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే సాహిత్యాన్ని ఒక మార్గంగా తీసుకుని వర్తమాన కాలంలో ఆర్షధర్మానికి ఏకైక ప్రతినిధిగా నిలిచారాయన. తన జీవితాన్ని, సాహిత్యాన్ని, భారతీయ వైభవ పునరుద్దానికై త్రికరణశుద్ధిగా అంకితం చేసిన రుషి వంటి కవి ఆయన. 

                 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును. 

                విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం.

అందుకే ఆయనను 20 వ శతాబ్దానికి యుగ కర్తగా సంపూర్ణము అర్హులు.ఆయన అభినవ శ్రీనాధుడు.శ్రీనాధుని వలెనే ఈయన కూడా బహు గ్రంథ కర్త. ఇరువురు కూడా అమరణాంతము కవితా వ్యవసాయం చేసి అద్భుతమైన కావ్య ఫలాలు అందించిన వారు. సమున్నత వ్యక్తిత్వం ఉన్నవారు ఆయన కవి సార్వభౌముడు అయితే ఈయన కవి సమ్రాట్ 

              

పాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. 

                 ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన 'విశ్వనాధ' గారి 'వేయి పడగలు' మాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతహాసం 'వేయిపడగలు'. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ఆ కాలంలో విశ్వనాధ వాణి ఆంధ్ర పౌరుష(1917), ఆంధ్ర ప్రశస్తుల(1919) రూపంలో సాహితీ రంగ ప్రవేశం చేసింది. 

              తన తొలి రచనలతోనే శ్రీశ్రీ వంటి ప్రతిభావంతున్ని మంత్రముగ్థుణ్ణి చేసి అనుకర్తగా ఆరాధకుడుగా, తీర్చిదిద్దినవాడు విశ్వనాధ. ఆ తరువాత శతాధికరచనలు చేసిన కొద్ది మందిలోనూ ఆయనే అత్యంత ప్రశస్తి పొందినవాడు. శ్రీనాధుడు తరువాత పరిసర ప్రకృతిని అంతగా పరిశీలించి వర్ణించిన మరో కవి విశ్వనాథే. ఆయన భాషా జాత్యభిమానాలకు తెలుగు రుతువులే నిదర్శనం. ఆయన రచనల్లో ప్రజాభిమానం సంపాదించినవి' 'కిన్నెరసాని' పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఆంధ్రా ప్రశస్తులు, విశ్వనాథ సత్యనారాయణ అభిమానించిన రచన మాత్రం శ్రీ మద్రామాయణ కల్పవృక్షము మహారచన. ఆ రచనకు జ్ఞానపీఠ్‌ పురస్కారం లభించింది. ఏకవీర చలన చిత్ర మయింది. చెలియలికట్ట పేరు తెచ్చింది. వరలక్ష్మి శ్రీశతి అనే స్మృతికావ్యం గుండెలు కరిగిస్తుంది. చారిత్రక నవలగా బద్దెన్న సేనాని ప్రతిష్టతెచ్చింది. నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితాధోరణుల మీద ఆయన విమర్శ వ్యాసాలు ప్రశంసలు కురిపించాయి. ఆంధ్రసాహిత్య చరిత్రను, భారతావతరణము'వంటి పది రేడియో నాటికలుగా మలిచారు. అమృత శర్మిష్ఠమ్‌, గుప్తపాశుపతమ్‌, అనే నాటకాలను 'ఆశ నిరాసకు' అనే నాటికను, 'దేవీ త్రిశతి' శివసాహస్రకు, వంటి కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించాడు. సత్యనారాయణ గారి రచనలో ప్రతిదీ ఒక సంచలన రచనే అయింది. ఆ రచనలు వస్తురీత్యా, ప్రయో గరీత్యా, శిల్పరీత్యా, ప్రమాణాల రీత్యా సంచలనం కలిగించినవే. ఈ సంచలనంలో ఆయనను సాంప్రదాయకులూ, సాంప్రదేయే తరులూ విమర్శకుల రూపంతో సమంగానే ఎదుర్కొన్నారు. అడ్డగించటానికి ప్రయత్నించారు.

            అయినా ఈ అవరోధాలన్నింటినీ సమర్థంగా తొలగించుకొంటూ విశ్వనాధ తొలిసారిగా సాహిత్య సరస్వతి ప్రవహించింది. తెలుగు నవలా సాహిత్యంలో తొలిసారిగా నవలకు 'కావ్య' గౌరవం సంపాదించి పెట్టింది. 'ఏకవీర' వస్తువు,దీని నిర్వహణపరంగా నూత్న ద్వారాలు తెరిచింది. కిన్నెరసాని పాటలు తెలుగులోని మాధుర్యాన్ని వాగులు పారించింది. 

               ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా విశ్వనాథ సత్యనారాయణ మహాకవి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించనివారు కూడా ఆయన ప్రతిభని కొనియాడారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదీ ఆయన గొప్పదనం. అదీ ఆయన సాధించిన సర్వకాలీన సార్వత్రిక సాహితీ విజయం. ఆయన రామాయణ కల్ప వృక్షం అర్థం కాక పోతే కిన్నెసాని పాటలు ఆస్వాదించవచ్చు. ‘వేయి పడగలు’... అంత బృహత్‌ నవల చదివే తీరిక, ఓపిక, సమయం లేదనుకొంటే ‘చెలియలికట్ట’ లేదా ’ఏకవీర’ లేదా పులి ముగ్గు వంటివి చదవచ్చు. ఏ ప్రక్రియను అభిమానించే వారికి ఆ ప్రక్రియలో ఎన్నో రచనలు చేసిన జ్ఞానపీఠి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రచనలు ముద్రించే కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రితో ఏమాత్రం సంబంధం లేకుండా ‘‘విశ్వనాథ సాహిత్య పీఠం’’ వెలిసింది. ఆ సంస్థ ప్రచురించిన ‘‘విశ్వనాథ వారి ముద్దు వడ్దన్లు’’లో ఏముందో చూద్దాం. 

                 ఆయన చేపట్టని ప్రక్రియా ప్రయోగమూ లేదన్నట్టుగానే, మానవ జీవితంలో ఆయన స్మృశించని సమస్య కూడా లేదేమోననిపిస్తుంది. ఆయన ప్రతి నవలా, ప్రతి కథా ఏదో ఒక సామాజిక సమస్యనో, మానసిక సమస్యనో, ఆధ్యాత్మిక సమస్యనో, సాహిత్య సమస్యనో, ఆర్థిక, రాజకీయ సమస్యనో...ప్రధానీకరిస్తుంది. విశ్వనాధ సత్యనారాయణ ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, ఆధునికాంధ్ర సాహిత్యంలో వారసత్వం, గురువు చూపిన పద్యరచనా సంప్రదాయం ఆయనలో స్థిరంగా నిల్చిపోయాయి. తరతరాలుగా అవిచ్ఛన్నంగా వున్న భారతీయ ధర్మం, మాత్రమే ఏక కాలానికి అయినా మానవజాతికందరికి ఆదర్శం. అనుసరణీయమని ఆయన అచంచల విశ్వాసం. భారతీయ ధర్మాన్ని, ప్రతిభాపాండిత్యాన్ని విజ్ఞాన విశేషాలన్నీ కవిత్వంలో రసమయంగా మలచి అందించిన మహాకవి విశ్వనాథ. దాదాపు అరవై నవలలు రాసి, ఆ నవలా సృష్టిలో భారతీయ ధర్మంతో పాటు, ఆధునిక భావాలను వ్యాఖ్యాన ప్రాయంగా కథ కల్పన చేసిన నవలా చతురాస్యుడు. సంస్కృతనాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష్ఠ, తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి, కావ్యతేదహరిశ్చంద్ర ప్రసిద్ధమైనవి. దాదాపు 150 గ్రంథాలకు పైగా రచన చేసిన ఏకైక తెలుగు కవి, విమర్శకుడు విశ్వనాథ. ఆయనకు 1958లో శాసన మండలి సభ్యత్వం వచ్చింది. 1971లో ఆస్థానకవి పదవి సంక్రమించింది. 1942లో కలకత్తాలో పుష్పకిరీటసన్మానం జరిగాయి. 'విశ్వనాధ' కొలవెన్నురామకోటేశ్వరరావుతో కలిసి ''త్రివేణి' అనే దైవమాసికాంగ్ల పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు. ....'జయంతి' అనే దైవమాసిక తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించారు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. 

                ఆయన మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఈ చిన్ని ఉదాహరనే చాలు...బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది. ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా ! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు. ” నీ పేరేమిటి ? ” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు…. ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. 

” ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? ” అనడిగాడు. 

” ఆయనతో నీకేం పని ” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. 

” పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ! ” అన్నాడా అబ్బాయి తాపీగా. 

అంతే… ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది. 

” వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో ! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది ” అని గయ్యిమన్నారు. దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే ! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి…” లేరా అబ్బాయ్ ! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా ! “…… అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు.

విశ్వనాథవారి మాటల చమత్కారం అదీ ! 


            రచయితగా ఆయన సుదీర్ఘ జీవితంలో ఎదురైన వ్యక్తులతో జరిపిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వం, సాహిత్యంపై ఇతరుల అభిప్రాయాలు, వివిధ సంఘటనలపై ప్రతి స్పందనలు ఆయన వివిధ అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ నాలుగు సంకలనాల్లో ఉన్నాయి. అటువంటివి కొన్ని చూద్దాం. 

* ‘‘మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు చప్పండి’’ అని శ్రీశ్రీని ఎవరో అడిగారట ఒక తూరి. దానికి వారు ‘‘ఒకటి- మహా ప్రస్థానం గీతాన్ని భారతి మాసపత్రిక తిరగ్గొట్టడం. రెండు- కవితా! ఓ కవితా అనే గీతం చదువుతూ ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశ్వసిక్త( కన్నీరు )నేత్రులు కావడం’’ అని అన్నారట.’’ 

* ఈ జ్ఞానపీఠ బహుమతికి తగుదునా? తగనా? అన్న విచారణ ఉంది. ఇదివరకు వచ్చిన వాళ్లంతా తగితే నేను మాత్రం ఎందుకు తగకూడదు? అనే దురహంకారము లేకుండా ఉండేందుకు అంత చేవ చచ్చిలేను గదా. నాకు అవార్డు ద్వారా లభించిన లక్ష రూపాయలలో చాలా మొత్తాన్ని మా తండ్రిగారు అరవై యేండ్ల క్రితం నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు వినియోగిస్తాను. మిగతాది అనేక రంధ్రాలున్న నా జేబులో వేసుకొంటాను.

.   

నేషనల్ కాలేజి, హిందూ కాలేజి, ఏ సీ కాలేజి,విజయవాడ లో కళాశాలలో, కరీంనగర్ కళాశాలతొలి ప్రిన్సిపాల్ గా, సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసన మండలి సభ్యులుగాఎక్కడ వున్నా రచనా వ్యాసంగమే వారి ప్రధాన వ్యాసంగము.


కల్పవృక్షముల వంటి సాహితీ సంపదని మనకి వారసత్వంగా అందించి 1976 అక్టోబరు 18న శివైక్యం చెందారు

ఎవరేమన్నా నా ఉద్దేశ్యం ఆధునిక యుగానికి యుగ కర్త శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారే అర్హులు

                         స్వస్తి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: