15, డిసెంబర్ 2024, ఆదివారం

కురుపురము

 #కురుపురము ( దత్త జయంతి సందర్భంగా)                


కురుపురం, కురువాపురం, కురుంగడ్డ మొదలైన పేర్లతో పిలువబడే ఈ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో వుంది. 


హైదరాబాద్ నుంచి మంత్రాలయం , కాని రాయచూర్ వెళ్ళే బస్సులో మెహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వరకు వెళ్ళాలి. 


ఆతరువాత అనుగొండ వెళ్ళే బస్సులో పంచదేవ్ పహాడ్ గ్రామాన్ని, అక్కడి నుంచి దగ్గరలోనే కురుపురం చేరుకోవచ్చు. 

కర్ణాటక రాష్ట్రం లోని రాయ్ చూర్ దగ్గర నుంచి కూడా కురుపురం వెళ్ళచ్చు. 

ఇటైనా, అటైనా కృష్ణానది దాటాలి. -


కురుపురం ఒక ద్వీపంలో వుంది. 

చుట్టూ కృష్ణానది. 

ఆనది దాటితే ఆలయం. 

శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరములు ఇక్కడే తపస్సు చేశారు. 

ఆంధ్ర ప్రాంతంలోని పీఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరములు తల్లితండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు. 


ఇక్కడే శ్రీపాద వల్లభులు తమ మహిమ లెన్నిటినో చూపారు. 

ఇప్పటికీ ఇక్కడే సుక్ష్మరూపులై ఉంటారని భక్తుల నమ్మకం. 


ఆశ్వీయుజ..మాస..కృష్ణద్వాదశి..హస్తా నక్షత్రం..రోజున కృష్ణానదిలో వారు అంతర్దానమయ్యారు. 

శ్రీగురుచరిత్ర, 


శ్రీవల్లభుల చరిత్ర, 

శ్రీ నృసింహ సరస్వతీ స్వామి చరిత్ర, 

మొదలైన సిద్ధపురుషుల చరిత్రలు చదివే వారికి ఈ క్షేత్రం గురించి బాగా తెలుస్తుంది. 

ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటు వేపు సూర్యనమస్కారాలు చేసేవారని, దర్బారు నడిపేవారని తెలుస్తోంది. 

అటు కర్నాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసేవారని తెలుస్తోంది. 

అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతోంది. :


శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనం వున్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం వుంది. 

అదే కురుపురం (కురువాపురం). శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, కురుపురాన్ని బుట్టీల (పుట్టీలు) ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు.

ఇది చాలా మహిమగల శ్రేత్రం. 

వెయ్యి సంవత్సరాల పైనే వయసు వున్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రివల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి వుంది. 

దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దాని పైన వున్న శివాలయం దర్శించుకోవచ్చు. 

కురు మహరాజుకు ఙ్ఞానోపదేశం అయిన ప్రాంతం కాబట్టి కురువపురమనే పేరు వచ్చింది. 


కురువపురం ఆలయంలో ప్రతిరోజూ అభిషేకం, పల్లకీసేవ జరుగుతాయి. 

శ్రీపాదశ్రీవల్లభుల జయంతి, దత్తజయంతి, వంటి ఉత్సవాలు జరుగుతాయి. 

అలాగే కృష్ణానదిలో అంతర్థానమైన శ్రీపాదవల్లభుల గుప్తదినం (ఆశ్వీయుజ బహుళ ద్వాదశి), 

గురుద్వాదశి, (మాఘ బహుళ పాడ్యమి) శ్రీనృసింహ సరస్వతి గుప్తదినాలు కూడా ఉత్సవాలు జరుపుతారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, కురుపురం లో విశేష పూజలు జరుగుతాయి. 

ఆ రోజు భక్తుల కూడా ఎక్కువ మందే దర్శించుకుంటారు. 


ఇక్కడ చూడవలసిన ఆలయాలు:💐

పంచదేవపహాడ్ ఇవి కృష్ణా నది కి ఇవతలే వున్నాయి. 

ఈ ఆలయం పంచదేవ్ పహాడ్ గ్రామంలో మఖ్తల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లాలో వుంది. 

ఇది తెలంగాణా ప్రాంతంలోకి వస్తుంది. 

కృష్ణానదిలో ఇక్కడి నుంచే కురుపురం చేరాలి. 

ఈ ప్రాంతంలో ఐదుగురు దేవతలు కొలువై పూజలందుకుంటున్న ప్రాంతం ఇది. 

పాండురంగస్వామి, 

శ్రీలక్ష్మీనరసింహస్వామి, 

ఆంజనేయస్వామి, 

రాఘవేంద్రస్వామి, 

విఘ్నేశ్వరుడు. 

ఇంకా అనఘ దత్త దేవాలయం, 

ఒకే చోట వున్నాయి.


శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయస్వామి మహాసంస్థానపీఠము:💐

ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలున్నాయి. 

శ్రీపాద శ్రీ వల్లభుల దర్బార్. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్ జరిగే ప్రాంతం ఉంది. 

ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు.. చేసుకునేటప్పడు తన కమండలం ఆన్చిన రాయి (త్రిశూలం) కూడా వుంది. 


ఈ ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 

కురుపురంలోను , రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. 

ఉచిత రూములు వున్నాయి. 

ఇవి పురాతన ఆలయాలైనా మళ్ళీ కొత్తగా రంగులు వేసి వాతావరణం పరిశుభ్రంగా వుంచుతూ ఆధునీకరించారు. 


పంచదేవతాపహాడ్ దగ్గరలో లార్డ్ దత్తాత్రేయ స్పిరిచ్యువల్ సొసైటీ, శ్రీ పాద దత్తసాయి సొసైటీవారి అధ్వర్యంలో శ్రీపాద ఛాయ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ దత్తాత్రేయుని ఆలయం ఉంది. 

అన్ని వసతులు, ఆధునిక కట్టడాలతో రూములు లక్ష్యమవుతున్నాయి. చాలా మటుకు పూర్తి అయింది. 

ఈ ఛాయ ఆశ్ర్రమంలో విశ్వ కుండలిని జాగరణకై నిత్యాన్నదాన శాంతి మహా యఙ్ఞాలు, గోశాల పరిరక్షణ, 

ప్రతి రోజూ దత్త యఙ్ఞం,

గాయత్రీ యఙ్ఞం, అనఘా వ్రతం, గో పూజలు 

నిర్వహిస్తుంటారు. 

కొంచం ముందుగా వారికి ఫోన్ చేసి రూముల గురించి అడిగి బయలు దేరవచ్చు. 

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తక్కువ.

 ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళటం మంచిది.

కాని ఈ ఆలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. భక్తులు కూడా ఎక్కువగానే వస్తున్నారు.


🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

కామెంట్‌లు లేవు: