29, జనవరి 2025, బుధవారం

మహాభారతం

 🙏మహాభారతం శాంతి పర్వం 🙏

                      పదవ భాగం 

 వంధిమాగదులు ధర్మరాజు గుణగణాలను కురువంశ చరిత్రను కీర్తిస్తున్నారు. వేదపండితులు వేదపాఠాలను భోధిస్తుండగా ధర్మరాజు హస్థినాపుర ప్రవేశం చేస్తున్నాడు.

ధర్మరాజు వచ్చేవేళకు హస్థినాపురప్రజలు నగరమంతా పచ్చనితోరణాలు కట్టి, గుమ్మాలకు అరటిచెట్లు కట్టి, పూర్ణకళశాలను ఇంటి ముందు అలంకరించి, వాకిట కళ్ళాపిచల్లి ముత్యాలముగ్గులు పెట్టారు. ఆ బాలగోపాలం కొత్తబట్టలు కట్టుకున్నారు. అంతటా పండుగవాతావరణం నెలకొంది. ధర్మరాజు రాజవీధిలో ప్రవేశించాడు. హస్థినాపుర వాసులు తమలోతాము " నలుదిక్కులా రాజులను జయించిన అజాతశత్రువు ఇతడే. రాజసూయయాగము చేసి బ్రాహ్మణులకు ధన, కనక, రత్నములను దానంగా ఇచ్చినది ఇతడే. ధర్మనిరతుడు అని చెప్పతగిన వాడు, శత్రురాజులను జయించి, విజయలక్ష్మిని వరించినది ఇతడే " అని ధర్మరాజును పొగడసాగారు. మరి కొందరు భీమార్జున నకులసహదేవులను పొగడుతున్నారు. వ్రతములు ఆచరించుటలోనూ, అదృష్టంలోను, పాతివ్రత్యంలోనూ ద్రౌపదికి సాటి ద్రౌపదియే నని పాండవసతిని పొగడుతున్నారు. ధర్మరాజు రాజమందిర ముఖద్వారం వద్దకు రాగానే బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలు శోభనద్రవ్యములు తీసుకుని ఎదురువచ్చారు. వారు ఇచ్చినవి పుచ్చుకుంటూ ధర్మరాజు గజశాల వద్ద తనరధమును దిగాడు. పురోహితుడైన ధౌమ్యుడు పెదనాన ధృతరాష్ట్రుడు మున్నగు వారితో సహా అంతఃపురప్రవేశం చేసాడు. గృహదేవతలకు పూజచేసాడు. బ్రాహ్మణ సంఘములను పిలిచి వారికి బంగారం గోవులను దానంగా ఇచ్చాడు. వారి ఆశీస్సులు తీసుకున్నాడు.


ఆ సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు అనే రాక్షసుడు బ్రాహ్మణవేషంలో వచ్చి మిగిలిన బ్రాహ్మణులతో కలిసాడు. అతడు ధర్మరాజుతో " ఓ ధర్మరాజా ! సకలబ్రాహ్మణులు నన్ను తమ ప్రతినిధిగాపంపారు. వారిసందేశం విను. మహాపాపములు చేసిన వాడు ఇతడు ఎలా రాజౌతాడు. తండ్రులను, అన్నలను, పుత్రులను శంకలేకుండా చంపాడు. విద్యనేర్పిన గురువు అని చూడక ద్రోణుడిని చంపాడు. వీడిజన్మ ఎందుకు కాల్చనా ! ఈ విధంగా అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఇంకా నీకీ రాజ్యమెందుకు ? బంధువులను అందరినీ చంపి రాజ్యభోగాలు అనుభవిస్తున్నావు. నీకు మహాపాపం చుట్టుకుంటుంది " అని పలికాడు. చార్వాకుడి మాటలను విన్న బ్రాహ్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ధర్మరాజు వారివంక చూసి చేతులుజోడించి " బ్రాహ్మణోత్తములారా ! నేను మీకు మొక్కి వేడుకుంటున్నాను. నన్ను మీరు నిందించకండి. ఆదరించండి వ్యాసుడు నారదుడు మొదలగు మహా మునులు నన్ను ఆజ్ఞాపిస్తేనే నేను ఈ రాజ్యపాలనకు ఒప్పుకున్నాను " అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు " మహారాజా ! ఈ మాటలు మావి కాదు. ఇవి ఎలా వచ్చాయో మాకు తెలియడం లేదు. నీవు ఉత్తమక్షత్రియ ధర్మంతో సముపార్జించిన ఈ రాజ్యలక్ష్మి సుస్థిరతను పొందుతుంది " అని ఆశీర్వదించాడు. వెంటనే చార్వాకుని వంక చూసి దివ్యదృష్టితో అతడు సుయోధనుడి అనుయాయుడు అని తెలుసుకున్నారు. " మహారాజా ! వీడు బ్రాహ్మణుడు కాదు. సుయోధనుడి అనుయాయుడు అయిన రాక్షసుడు. కపటసన్యాసివేషంలో వచ్చి మిమ్మలిని అనరానిమాటలు అన్నాడు. వీడు కుక్కలాగా మొరిగినంత మాత్రాన మీ కీర్తికి కళంకంరాదు. ధర్మాత్ములైన నీ తమ్ముల సాయంతో మీరు రాజ్యలక్ష్మిని చేపట్టవచ్చు " అని పలికారు. వెంటనే బ్రాహ్మణులంతా చార్వాకుడిని చూసి ఒక్కసారి హుంకరించారు. ఆ హూంకారానికి భయకంపితుడై చార్వాకుడు నిజస్వరూపం ధరించి భస్మం అయ్యాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణులందరిని ఆదరించి పంపాడు.


అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! కృతయుగంలో చార్వకుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపమాచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తనకు సకల భూతములవలన భయంలేకుండా వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు " నీవు బ్రాహ్మణులకు ఇష్టంలేని పనులు చేయకు. వారికి కోపంతెచ్చినప్పుడు మాత్రమే నీకు మరణం సంభవించగలదు " అని అన్నాడు. ఆ ప్రకారం బ్రహ్మ వరంపొంది చార్వాకుడు దేవతలను పీడించ సాగాడు. దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి చార్వాకుడి నుండి రక్షణ కల్పించమని ప్రార్ధించాడు. బ్రహ్మదేవుడు దేవతలతో " ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకని నేను తగినఏర్పాటు ముందే చేసాను. ద్వాపరయుగంలో చార్వాకుడు సుయోధనుడు అనే రాజుకు మిత్రుడుగా ఉంటాడు. సుయోధనుడి మరణం తరువాత ఈ చార్వాకుడు బ్రాహ్మణులకు మనోవ్యధ కలిగించే పనులు చేసి ఆకారణంగా వారి ఆగ్రహానికి గురి అయి భస్మంఔతాడు " అని చెప్పాడు. శ్రీకృష్ణుడు తరువాత " ధర్మరాజా ! నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి. ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడు. బ్రాహ్మణులను ఆదరించు. బంధుమిత్రులను సుఖంగా ఉండేలాచేయి. కురుసామ్రాజ్యముకు పట్టాభిషిక్తుడివి కమ్ము " అని పలికాడు.

పట్టాభిషేకముకు తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కురుమహాసభలో ఎత్తైన బంగారు సింహాసనం ఏర్పాటు చేసారు. పెద్దలకు, మంత్రులకు, సామంతులకు సైన్యాద్యక్షులకు ఎవరికి తగిన ఆసనములు వారికి ఏర్పాటు చేసారు. ఒక శుభముహూర్తాన ధర్మరాజు మనసులోని బాధను దిగమింగుకుని బంగారుసింహానం మీద తూర్పుముఖంగా కూర్చున్నాడు. అతడికి ఎదురుగా బంగారు ఆసనమున శ్రీకృష్ణుడు సాత్యకి సమేతంగా కూర్చున్నాడు. ధర్మరాజు ఇరు పక్కలా మణిమయ పీఠముల మీద భీమార్జునులు కూర్చున్నారు. వెనుక పక్క బంగారు పీటముల మీద నకులసహదేవులు కూర్చున్నారు. వారిపక్కన ఉచితాసనం మీద కుంతీదేవి కూర్చుంది. శ్రీకృష్ణుడి దక్షిణభాగంలో ఒక ఉజ్వలమైన ఆసనంమీద ధృతరాష్ట్రుడు కూర్చుని ఉన్నాడు. అతడికి తూర్పు పడమర దిక్కున విదురుడు, ధౌమ్యుడు కూర్చుని ఉన్నారు. ధృతరాష్ట్రుని వెనుక భాగాన అర్హమైన ఆసనముల మీద గాంధారి, యుయుత్సుడు, సంజయుడు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కృపాచార్యుడికి ధర్మరాజు ధౌమ్యుడి పక్కన ఉచితాసనాన్ని ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు తెల్లని పూలతోను, అక్షితలతోను, బంగారుతోను, వెండితోను భూదేవిని పూజించి ఆమెను తాకాడు. పండితులు, వివిధ దేశాధీశులు, మంత్రులు, ఉన్నతోద్యోగులు, వ్యాపారవేత్తలు, పరిచర్యలు చేసే సేవకులు, వైశ్య ప్రముఖులు, పౌర సంఘాలు, కర్షకులు, జానపదులు, గాయకులు, విదూషకులు, వేశ్యలు మున్నగు వారంతా ధర్మరాజుని సందర్శించారు. ధర్మరాజు వారికి ఉచితమైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ఇంతలో అభిషేకద్రవ్యములు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అనుమతితో ధౌమ్యుడు ఈశాన్య దిక్కుగా ఉన్న వేదికను అలంకరించాడు. అందు నవరత్నఖచిత సింహాసనమును ప్రతిష్టించాడు. దానిమీద పులితోలు కప్పాడు. శంఖమును స్థాపించి పూజించాడు. దాని చుట్టు గంగాజలం నింపి వాటిని మంత్రసహితంగా ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుపంచితం, గోమయము మొదలగు పంచగవ్యములతో శుద్ధి చేసాడు. ధర్మరాజు చుట్టూ బ్రాహ్మణులు మంత్రపఠనం చేస్తున్నారు. ధౌమ్యుడు ధర్మరాజును తీసుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చుండ చేసాడు. ఎదురుగా అగ్నినివేల్చి దేవతాయజ్ఞం చేసాడు. ఇంతలో శుభముహూర్తం సమీపించగానే శ్రీకృష్ణుడు ధర్మరాజును సమీపించి శంఖం పైకెత్తి" ధర్మజా ! నీవు ఈ కురుసామ్రాజ్యానికి అధిపతివి కమ్ము " అని అభిషేకించాడు. ఆ సమయంలో ప్రశాంత చిత్తుడై ధౌమ్యుడు అందించిన బంగారుకలశం లోని గంగాజలాన్ని ధృతరాష్ట్రుడు ధర్మరాజు మీద అభిషేకించాడు. ఆ తరువాత వారి వారి ప్రాధాన్యతను అనుసరించి అందరూ ధర్మరాజును అభిషేకించారు. శంఖములు, భేరీ మృదంగ నాదములు మిన్నంటేలా మ్రోగాయి. ఇలా ధర్మరాజు కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు.

                      సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: