6, ఫిబ్రవరి 2025, గురువారం

పోతన --భాగవతము 🙏

 🙏పోతన --భాగవతము 🙏

                మొదటి భాగం 

ముందుగా పోతన పోతపోసిన పద్యరాజములు చూద్దాము. గజేంద్ర మోక్షం నుండి తీసుకున్నాను.

కొన్ని పద్యాలలో సగుణాన్ని, కొన్ని పద్యాలలో నిరాకార నిర్గుణాన్ని వర్ణించారు.శివ కేశవులకు అభేదం పాటించారు. భాగవతన్ని మోక్ష విద్య అని పేర్కొన్నారు. బీజాక్షర శక్తిని పద్యాలలో సమకూర్చారు. 

భక్త పోతన తన తపస్సుశక్తిని ధార పోసి, తెలుగు భాషలోని అక్షరాలలో ఉన్న అమృతాన్ని పిండి, తన రామ భక్తిని రంగరించి , భాగవత పద్యాలలోకి మంత్ర శక్తిని ఆవహింపచేసిన మహా గ్రంథం- భాగవతం

బతుకుతెరువు కోసమో లేదా రాజులిచ్చే అగ్రహారాల కోసమో కవులు కావ్యాలు రాస్తారన్న అపవాదు భాగవతానికి రాకూడదని, తనకున్న కాసింత పొలాన్ని పండించుకుని ఎంతో నిరాడంబరంగా జీవించిన మహా ఋషి, మహా యోగి రాసిన మహా గ్రంథం - భాగవతం

భగవంతుడు అను భద్ర శబ్దమునకు అర్థము, ఆకృతి గా అతిశయించి నిలబడగలిగిన రామభద్రుడు, శ్రీరామనారాయణుడే స్వయంగా పోతనచే రాయించుకున్న మహా కావ్యం - భాగవతం

సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా భాగవతం నా అక్షర స్వరూపంగా ఉంటుందని వెల్లడి చేసిన మహా గ్రంథం - భాగవతం

భక్తి వైభవాన్ని, గొప్పతనాన్ని పతాకస్థాయిలో మేరు పర్వత శిఖరాలు దాటించి, వైకుంఠం అంచుల దాకా తీసుకెళ్ళి వివరించిన మహా కావ్యం- భాగవతం

లక్ష్మీ దేవి కౌగిటిలో ఉన్నా కూడా, పరమాత్మున్ని తన భక్తుల రక్షణకై పరుగులు పెట్టించిన లీలలు తెలిపే గ్రంథం (గజేంద్ర మోక్షం) - భాగవతం

ఏ శ్రీమన్నారాయణుని పాద పద్మములచే పునీతమైన భూమాత రోమాంచితమైనపుడు నిక్కబొడుచుకున్న రోమాలే, ఈ పచ్చదనమంతా అని అప్పుడు మోహపరవశయై రంజిల్లగా, ఆనంద పరవశయైన భూమాత రాల్చిన ఆనంద భాష్పధారలే ఈ సెలయేరులన్నీ అని అట్టి శ్రీహరి పాదారవిందముల శుభ చిహ్నముల వైభవాన్ని కీర్తించే మహా కావ్యం - భాగవతం

పోతన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 

పోతన బ్రహ్మ ,పోతన విష్ణువు, పోతన శివుడు పోతన శక్తి.సాక్షాత్తు పోతన గారే పరబ్రహ్మ స్వరూపము.

పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం

శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో

రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరంజాలరా దంచు స

వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్..

భావము:- గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగేడు.

"ఏరూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె

వ్వారింజీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్

వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్

లేరే?మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్ 

- ఏ = ఏ; రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.


నానానేకపయూధముల్ వనములోనంబెద్దకాలంబు స

న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ

ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే

కీనీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!


భావము:- చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

భావము:- ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.


ఒకపరి జగములు వెలి నిడి

యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై

సకలార్థ సాక్షి యగు న

య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

భావము:- ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.


లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుఁగు నతని నేసేవింతున్.


భావము:- లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.


నర్తకుని భంగిఁ బెక్కగు

మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం

గీర్తింప నేర? రెవ్వని

వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.

భావము:- అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో? ఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరో? ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో? అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.


ముక్తసంగులైన మునులు దిదృక్షులు

సర్వభూత హితులు సాధుచిత్తు

లసదృశవ్రతాఢ్యులైకొల్తు రెవ్వని

దివ్యపదము వాఁడు దిక్కు నాకు..


భావము:- ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.

                       సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: