🙏తెలుగు లిపి పరిణామం -- నన్నయ పాత్ర🙏
భాషా చరిత్రలో కూడా నన్నయకు సముచిత స్థానం ఉంది
మౌర్యుల తరవాత బ్రాహ్మీ లిపి దేశమంతా విస్తరించింది. మెల్లమెల్లగా, ఉత్తరాది లిపికి, దక్షిణాది లిపికి మధ్య తేడాలు కనిపించడం మొదలయ్యింది. ఇంతకు ముందు భారత లిపులలో, హల్లులో అకారాన్ని అంతర్గతం చెయ్యడానికి తలకట్టు, పైన గీత వంటి ఒక గుర్తు ప్రతి హల్లు రూపానికి ఉంటుంది . ఈ పద్ధతి మౌర్యుల కాలం తర్వాత వ్యవస్థీకృతం అయ్యింది. ఒరియా లిపిలో గొడుగు, తెలుగులో తలకట్టు, నాగరి లిపిలో పైన అడ్డంగా గీసే గీత – ఇవన్నీ హల్లుకి అ-కార సంపర్కాన్ని తెలియజేసేవే. అందుకే కాబోలు, దక్షిణాది ఉత్తరాది లిపుల మధ్య తేడాలు కూడా ఈ కాలంలోనే ప్రస్ఫుటమైన ముద్రతో వచ్చాయి. నిలువు గీతలున్న అక్షరాల్లో గీత పరిణామం ఒకే పొడుగుకి చెయ్యడం, క, గ అక్షరాల్లో నిలువుపాటి గీతలను కాస్త సాగతీసి వాటిని గుండ్రంగా చెయ్యడం, ఇవన్నీ ఈ కాలంలో లిపి స్వరూపంలో వచ్చిన మార్పులు.
తమిళ బ్రాహ్మీ లిపి
ఉత్తరాది లిపులకంటే దక్షిణాది లిపులలో ఎన్నో మార్పులు వచ్చాయి. భట్టిప్రోలు శాసనాల లిపిలో ప్రత్యేకత హల్లు నుంచి అంతర్గతమైన అ-కారాన్ని తీసేసి, అకారాన్ని సూచించడానికి మిగిలిన అచ్చుల లాగానే ఒక ప్రత్యేకమైన గుర్తుని హల్లుకి జత చెయ్యడం. అంటే భట్టిప్రోలు శాసనలిపిలో ‘క’ మిగిలిన లిపులలో ‘క్’ అనే వ్యంజన రూపానికి సమానమైనది. ఇది కాక, ఘ, జ, మ, ల స (శ) లకు కూడా బ్రాహ్మీ కంటే వేరు రూపాలున్నాయి.
ఈ కాలంనాటి దక్షిణాది లిపులలో ముఖ్యంగా చెప్పుకోవలసినది తమిళ బ్రాహ్మీ శాసనలిపులు. ఈ శాసనాలన్నీ కూడా నాలుగైదు వాక్యాల దానాల పట్టాల వంటివి. ఇవి ఏ కాలానికి చెందినవనే విషయంపై ఇంకా ఏకాభిప్రాయం లేదు. ఈ తమిళ బ్రాహ్మీ లిపికి కూడా రెండు ప్రత్యేకతలున్నాయి: 1. నాలుగు కొత్త అక్షరాలు (న, ఱ, ఱ (ఇది డ్జ) ళ ) – ఇవి బహుశ ద్రావిడ భాషల లోని శబ్దాల కోసం అవసరమై ఉండొచ్చు. 2. అచ్చులను రాసే పద్ధతి భట్టిప్రోలు శాసనాలలో లాగానే, బ్రాహ్మీ లిపికి వేరుగా ఉంటుంది.
భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. ఇతడే కన్నడ సాహిత్యానికి ఆది కవి.తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. .
తెలుగున నన్నయ్య కావ్యవ్యాకరణచ్చంద సంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రథమాచార్యుడు. నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి. ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలకొరకు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. ఒ కార చిహ్నమగు కొమ్ము ొ ా అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.
ఉదాహరణకు : పఞ్చాఙ్గము అని పూర్వము వ్రాసేవారు తాటాకు ఇది వ్రాయడం కష్టం కావున -పంచాంగము అని ఇటువంటి మార్పులతో నన్నయ గారు వ్రాశారు. ఇటువంటి ఉదాహరణలు భారతములో ఎన్నైనా చూపవచ్చు.
నన్నయ వీటిని పరిశీలించి, పైగా తెలుగు లిపిని చతురస్ర స్వరూపమునుండి గుండ్రదనమునకు మార్పు చేసి పలు మార్పులు చేసాడు. అవే తలకట్టునకు ా గాక ప్రస్తుత తలకట్టు లాగా, కొమ్ముల మార్పు ప్రస్తుత వరుసగా, ర్గ సంయుక్తాక్షరములు అనునవి పంకచంక-ఖండ-నంద-డింబ-అనురీతి పూర్ణబిందువులుగా వ్రాయుట, రకార సంయుక్తాక్షరములను ర్క, ర్త, ర్చ మొదలగునవి అర్క-అక౯, కర్త-కత౯, కర్చ-కచ౯ గా వ్రాయుట మొదలుచేసాడు. ౯ ఈ చిహ్నమునకే వలపలగిలక అని పేరు. ఈ వలపలగిలక వలన రకార సంయుక్తాక్షరములుగా నుండక ఏకాక్షరములుగా ఉండును. ఇందువలన లిపికి సమత ఏర్పడినది, అంతకుముందున్న ఒక అక్షరము శకటరేఫముకన్నా భిన్నమైనది, ష్జగా పలుకునదానిని "డ"గా మార్చాడు. ఈ మార్పుల వలన తెలుగు లిపికి గుండ్రనిదనము, సౌందర్యము చేకూరినవి. తెలుగులిపినందు ఈమార్పులు చేయుటయేకాక నన్నయ, తాను వ్రాసిన నందంపూడి శాసనము లో తాను ప్రతిపాదించిన సంస్కరణలిపిని ప్రవేశపెట్టి - ఆవెనుక తాను వ్రాసిన మహా భారతమును ఆ లిపిలోనే వ్రాసినాడు. తెలుగు అక్షరములకు అంతకుముందులేని రమ్యతను-లేక మనోహరత్వమును తాను ప్రతిపాదించుటచేత - నన్నయ తెలుగులిపి సౌందర్యమును వ్యక్తపరిచాడు. అక్షర రమ్యత లిపి సంబంధమైనది అనే విషయాన్ని గమనించగలరు
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి