19, ఫిబ్రవరి 2025, బుధవారం

తాళపత్ర గ్రంధాలు

 🙏పూర్వకాలపు తాళపత్ర గ్రంధాలు🙏

పూర్వకాలంలో వాడిన తాళ పత్రాలు ఇప్పటికి గ్రంథాలయాలలో భద్రపరచారు. ఇన్నివేల సంవత్సరాలనుండి ఎలా ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.పూర్వకాలంలో కాగితాలు లేవు.అవి ఇన్ని వేల సంవత్సరాలు ఉంటాయి అని నమ్మకం లేదు. అసలు మన పూర్వీకులు తాళ పత్రములను ఎలా తయారుచేసేవారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.అప్పట్లో తాళ పత్రములను గ్రంధములుగా తయారుచేసిన విధానం పరిశీలిద్దాము.

సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ముందుతరాలకు అందించడానికి మన పూర్వికులు ఎంచుకున్న గొప్ప మాధ్యమం తాళపత్ర గ్రంథాలు. వివిధ రోగాలను నయంచేసే ఆయుర్వేద విజ్ఞానంతోపాటు పురాణేతిహాసాలు, పంచాంగాలు, శాస్ర్తాలు, లౌకిక గ్రంథాలు, వ్యాకరణాలు.. అన్నిటినీ తాళపత్రాలపైనే గ్రంథస్థం చేశారు. బృహత్‌ గ్రంథాల రచనకూ తాటాకులనే ఉపయోగించారు. అందుకే.. ఆ చారిత్రక ప్రతులు విలువైన సాంస్కృతిక సంపదగా నిలుస్తున్నాయి.

తయారీ విధానం..

తాళపత్రాల తయారీకి ప్రధాన ముడిసరుకు భూలోక కల్పవృక్షంగా పేరున్న తాటిచెట్లే. ఇందుకోసం 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరిగే తాటిచెట్ల నుంచి ఒక మీటరు పొడవుతో పొరలు పొరలుగా ఉండే ఆకులను సేకరిస్తారు. ఎక్కువ పొరలు ఉన్న ఆకులు రాతకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలం మన్నుతాయి. ఇలా సేకరించిన ఆకులను శుభ్రపరిచి ఎండబెట్టి, తాటి రేకులుగా తయారుచేస్తారు. తాటి ఆకుల నుంచి రాయడానికి అనుకూలంగా ఉండే ‘తాళపత్రాలు’ తయారుచేయడం అన్నది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే, అమూల్యమైన జ్ఞాన సంపదను నిక్షిప్తం చేసుకున్న తాళపత్రాలు వందల ఏండ్లు మన్నేలా కాపాడుకోవాలి. అందుకే, వీటి తయారీలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఇందుకు రకరకాల పద్ధతులు.

 ముందుగా తాటి ఆకులను నీడలో ఆరబెడు తారు. అవి మెత్తగా తయారవడానికి నువ్వుల నూనెను దట్టంగా పట్టిస్తారు.

› ఆకులను ఎండబెట్టిన తర్వాత మట్టిలో కానీ, ఇసుకలో కానీ 15 రోజులపాటు ఉంచుతారు. తర్వాత బయటికి తీసి శుభ్రపరుస్తారు. ఆకులకు చెదలు పట్టకుండా పసుపు రాస్తారు.

› తాటి ఆకులు సన్నగా, మృదువుగా మారడానికి వేడినీళ్లలో ఉడికిస్తారు. ఎక్కువ కాలం మన్నేలా ఆ నీటిలో పసుపు వేస్తారు. అనంతరం వాటిని ఎండలో ఆరబెడుతారు.

ఆకు పరిమాణాన్ని బట్టి ఒక్కో తాళపత్రంపై ఆరు నుంచి ఎనిమిది వరుసలు రాసేవారు. రెండువైపులా కలిపి నాలుగైదు పద్యాలను లిఖించేవారు. ఎడమవైపు పైభాగంలో తమ ఇష్టదైవాల చిత్రాలు వేసేవారు. ఇలా రాసిన పత్రాలను ఒక దగ్గర చేర్చి, గ్రంథాలుగా మారుస్తారు. ఇందుకోసం పత్రాలకు రెండు వైపులా (కొన్నిటికి ఒకవైపు మాత్రమే) రంధ్రాలు చేస్తారు. పత్రాలు విడిపోకుండా ఆ రంధ్రాల గుండా సన్నని తాడును దూర్చి ఆకులను బంధిస్తారు. ఈ పత్రాలు వంగిపోకుండా, విడిపోకుండా తాటిమట్టలు, టేకు చెక్కలను రక్షణగా వాడుతారు. ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల రావు తాళపత్ర గ్రంథాల సేకరణ, పరిరక్షణ కోసం 30 ఏండ్లుగా కృషి చేస్తున్నారు. భారతదేశం అంతటా పర్యటించి వేల సంఖ్యలో తాళపత్రాలను సేకరించారు. వాటి వివరాలతో ‘తెలుగు రాతప్రతులు’ అనే పుస్తకాన్నీ రచించారు. ప్రాచ్య లిఖిత భాండాగారం, చెన్నై మ్యూజియం, వరంగల్‌లోని గిరిజన విజ్ఞాన పీఠాలలోనూ వేలాది తాళపత్ర గ్రంథాలున్నాయి.

సున్నితమైన మొనగలిగిన ‘ఘంటం’తో ఆకులపై అక్షరాలను చెక్కే పద్దతి పూర్వం ఉండేది. రాసేవారు నేల మీద కూర్చుని, ఘంటాన్ని కుడిచేతిలో పట్టుకుని.. ఆకుపై కావలసిన అక్షరాలను చెక్కుతారు. అయితే, తాటి ఆకుపై ఘంటంతో చెక్కిన అక్షరాలు సరిగ్గా కనిపించవు. అందుకే, ఆ అక్షరాలపై ప్రత్యేకంగా తయారుచేసిన బూడిద పూస్తారు. ఇందుకోసం కొబ్బరి చిప్పలు, గడ్డి కాల్చగా వచ్చిన నల్లటి బూడిదకు పసుపు, నువ్వుల నూనె కలుపుతారు. ఈ మిశ్రమాన్ని పత్రాలపై రాసిన అక్షరాలపై పూస్తారు. అక్షరాల చుట్టూ అధికంగా ఉన్న రంగును వస్త్రంతో శుభ్రం చేస్తారు.ఇంత కష్టపడితేగాని తాళ పత్రం తయారుగాదు. వేల సంవత్సరాలు మన్నిక కలిగి ఉన్నవి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: