15, అక్టోబర్ 2025, బుధవారం

శరత్తులో జగత్తు*

 *శరత్తులో జగత్తు*


ఉ॥

వెండిని రంగరించి వరిపిండిని పర్వినయట్లు తోచగా 

కొండల మంచుతోడ సమకూరిన సౌరుల భూతల 

మ్ముండగ చంద్రు డంత ధవళోన్నతచంద్రిక నుల్లసిల్లగా 

నిండెను చిత్తజాతుసుమనృత్యరవంపుశరత్తు నందమై 


ఉ॥

చంద్రికలందమై మెఱయ సారెకు సారెకు కన్నుకుట్టి తా 

సాంద్రపయోధరాళిని ప్రశంసల ముంచుచు క్ష్మాకు నంపగా 

నింద్రుడు మేఘమాలికలు నింతలుగా ౘదలంత క్రమ్మగా 

చంద్రుడు మూగవోయెనట శారదరాత్రుల ఖిన్నుడైసనెన్ 


కం॥

వెన్నెల నిండెడి వేళల 

మిన్నగ వానలు వరించె మేదినినెల్లన్ 

క్రొన్నెలతాల్పుని యందము 

తిన్నగ చూడమి జనులును దీనతనందెన్ 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: