శ్రీ
ఆదిశంకరుల గ్రంధాలు అన్నిటిలోనూ 'వివేక చూడామణి' ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది.
ఆత్మ జ్ఞాన విషయం ఇంతకంటే సులభరీతిన మరే గ్రంధం లోనూ చెప్పబడలేదేమోనని పెద్దల అభిప్రాయం. 580 శ్లోకాలతో ఉన్న ఈ గ్రంధం వేదాంత విజ్ఞాన ఆకాశంలో ప్రకాశిస్తున్న ధ్రువ తార.
ఇందులో ఎన్నో విషయాలు ప్రతిపాదింప బడ్డాయి. మనం ఈ రోజు బ్రహ్మోపాసనకు సోపానమైన 'సాధనాచతుష్టయం' గురించి తెలుసుకుందాం.
బ్రహ్మోపాసనకు నాలుగు సాధనాలు చెప్పబడినవి. ఈ సాధన చతుష్టయం బాగా అభ్యసించినవాడే బ్రహ్మ విద్యకు అధికారి. అవి ఏమిటో చూద్దాం.
1. వివేకం
2. వైరాగ్యం
3. షట్సంపత్తి
4. ముముక్షత్వం
వివరణ:
వివేకమనగా నిత్య అనిత్య వస్తు నిర్ణయం. బ్రహ్మమే సత్యమని, జగత్తు మిధ్య అని ధృడ విశ్వాసం కలిగి ఉండటమే వివేకం.
ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ వస్తువులు అశాశ్వతాలు అని ఎరిగి వాటి మీద కోరిక లేకపోవటమే వైరాగ్యం.
ఇక షట్సంపత్తి అనగా ఆరు సంపదలు. అవి ఏమిటో చూద్దాం;
- శమం
- దమం (ఉపరతి)
- తితీక్ష
- శ్రద్ధ
- సమాధానం
- ముముక్షత
ఇక వీటి వివరణ చూద్దాం:
అసంఖ్యాకమైన ఇంద్రియ విషయాలలోని దోషాలను ఎరిగి వాటినుండి మనసు మరల్చి, గమ్యమైన ఆత్మ సాక్షాత్కారం పై స్థిరంగా లగ్నం చెయ్యటాన్ని శమం అంటారు.
జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మం మీద ద్రుష్టి ఉంచడాన్ని దమం అంటారు. బాహ్య ఆకర్షణలకు లొంగక మనస్సు ను అంతర్ముఖం చెయ్యడాని ఉపరతి అంటారు.
శీతోష్ణాలు, ఆకలి దప్పికలు మొదలైన ఈతి బాధలను ఓర్చుకుంటూ, ఇతురులు చేసే అపకారాలను క్షమించి వాటి వలన బాధపడకుండా ఉండటాన్ని తితీక్ష అంటారు.
శాస్త్ర వాక్యాలలోనూ , గురు వాక్యాలలోనూ పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండటం శ్రద్ధ అంటారు.
ఏకాగ్రతతో బుద్ధిని పరబ్రహ్మం నందు నిలపడాన్ని సమాధానం అంటారు.
అజ్ఞానం వలన కలిగే దేహభావం, అహంకారం - వీటివలన కలిగే ఇతర బంధాలను తెంచుకుని సస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారం ద్వారా ముక్తిని పొందాలనే తపన ను 'ముముక్షుత' అంటారు.
ఆది శంకరాచార్యుల వారు
‘వివేక చూడామణి’ లో
“సాధనా చతుష్టయం” గురించి ప్రస్తుతించారు
సాధనలో నాలుగు అంశాలు వున్నాయి –
1. వివేకం 2. వైరాగ్యం 3. షడ్ సంపత్తి 4. ముముక్షుత్వం
నిత్యానిత్య వస్తు విచక్షణా జ్ఞానమే “వివేకం”,
ఇహ, ఆముత్ర కర్మ ఫల భోగ అనాసక్తే “వైరాగ్యం”
మోక్షప్రాప్తి కోరే తీవ్రసాధకుడి గుణగణాలే “షడ్ సంపత్తి”
షడ్ + సంపత్తి = ఆరు సంపత్తులు
అవి దమము, సమము, తితీక్ష ఉపరతి, శ్రద్ధ, సమాధానాలు
బహిరేంద్రియ నిగ్రహం అన్నదే “దమం”
అంతరేంద్రియ నిగ్రహం అన్నదే “సమం”
బాధలను నోర్చుకునే గుణమే “తితీక్ష”
‘కామం’ నుంచి కొంత, సందర్భానుసారంగా, వైదొలగడమే “ఉపరతి”
త్రికరణశుద్ధి + దీక్ష = “శ్రద్ధ”
ద్వంద్వాలలో సమంగా చలించకుండా వుండడమే “సమాధానం “
ముక్తిని సదా, తీవ్రంగా, కోరుకోవటమే “ముముక్షుత్వం”
* ఒకానొక సాధకుడికి వివేకం, వైరాగ్యం, షడ్ సంపత్తి, ముముక్షుత్వం అనే నాలుగు
లక్షణాలు ఉన్నప్పుడే మోక్షప్రాప్తి అవుతుంది” ..అన్నదే ఆదిశంకరాచార్యుల బోధ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి