18, జులై 2020, శనివారం

రామాయణమ్.. 3

ఆ విషయం ఎరుక పరచటానికే తాను వచ్చినాడు ,అదే విషయం వాల్మీకి మునిపుంగవుడడిగినాడు! .
.
వాల్మీకి ముని ప్రశ్న విని ,నీలాకాశంలో పండువెన్నెల పరచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు నారద మహర్షి! అవును ! ఆ మహాపురుషుడిగురించి ఆలోచించగనే ఎవరి హృదయం వికసించదు!
(.రమయతీ ఇతి రామః రాముడి గురించిన తలపురాగానే హృదయకవాటాలు భేదించుకొని ఆనందం బహిర్గతమవుతుంది)
.
తాను బ్రహ్మగారి వద్దనుండి తెలుసుకొన్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విశదపరుస్తున్నారు విశ్వసంచారి!.
.
ఓ మహర్షీ నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియచేస్తాను! సావధానచిత్తంతో వినవయ్యా!
.
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామ జనైః శ్రుతః
నియతాత్మా మహవీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ!
.
ఇక్ష్వాకు వంశ ప్రభువులలో "రాముడు " అనే పేరుగల మహాపురుషుడున్నాడని జనులంతా విని ఉన్నారు!
ఆయన కాంతిమంతము,శక్తివంతమూ అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకొన్నవాడు!.
.
ఆయన బుద్ధిమంతుడు,నీతిమంతుడు,సర్వశాస్త్రపాండిత్యము ,
మహదైశ్వర్యము గలవాడు!
ఆయన రూపం చూడచక్కనిది మనోహరమయినటువంటిది
 ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచి నట్లుగా సృష్టించాడు బ్రహ్మ!
ఉన్నతమైన మూపులు (వాటి ఎముకలు బయటకు కనపడవు)ఎంత పెద్ద విల్లునయినా మోయగల మూపులువి!,
.
బాగా బలిసి మోకాళ్ళవరకు వ్రేలాడే బాహువులు,శంఖం వంటి కంఠము, ఎత్తైన చెక్కిళ్ళు,
.
విశాలము, కఠినము అయిన వక్షస్థలము, సర్వ లక్షణ శోభితమైన శిరస్సు !  
.
చూడగనే ఆకర్షించి చూపులు కట్టిపడవేయగల మనోహర సుందర రూపము!.
.
ఆయన అరిందముడు! అంతర్గతశత్రువులను ,బాహ్యశత్రువులను మర్దించినవాడు.
( కామ,క్రోధ,లోభ,మద,మోహ,మాత్సర్యము లు అంతర్గత శత్రువులు).
.
రక్షితా జీవలోకస్య ధర్మస్యపరిరక్షితా! ...సమస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన!.
.
వేదవేదాంగ రహస్యములు ,ధనుర్వేదము ఆయనకు కరతలామలకము!.
.
తల్లి కౌసల్య ఆనందాన్ని పెంపొందించేవాడు ,సముద్రమంత గాంభీర్యము కలవాడు హిమాలయాలంత ధైర్యము కలవాడు!.
.
లోకంలోని నదులన్నీ ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరటానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో అదే విధంగా లోకంలోనిసమస్తమునిసంఘాలు,జానపదులూ,నాగరికులు,
సమస్తప్రాణికోటి ఆ మనోహర సౌందర్యమూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద వెడుతుంటారు!
.
ఆయన శ్రీ రాముడు!
రామాయణం. 4
..
రామకధ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలందుకొని ఆకాశమార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి .
.
వాల్మీకి మౌని హృదయం అవధులులేని ఆనందంతో పొంగిపొర్లిపోయింది.
.
 అవును !!!!!
అతడే ఆనందం ! అతడే పరబ్రహ్మము ! ఆనందమే పరబ్రహ్మము ! 
ఆ రామ బ్రహ్మము గూర్చి విన్న ఎవరి మనసు మాత్రము ఆనందంతో నిండిపోదు! ఆనంద స్వరూపుడుగదా ఆయన! .
.
శిష్యులతో కలసి ప్రాతఃసంద్యావందనమాచరించడానికి 
తమసానదీ తీరం చేరుకున్నారు మహర్షి వాల్మీకి! 
.
ఆ నదీ తీరం మనోహరంగా ఉన్నది! సమున్నతంగా పెరిగిన ఎన్నో జాతుల ఫలవృక్షాలు ,
వాటి మీద స్థిరనివాసమేర్పరచుకొన్న రకరకాల పక్షిజాతులు అవి చేసే కిలకిలారావాలు కడు రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశం! 
.
ప్రకృతికాంత ఎన్నో హొయలు ఒలకబోస్తున్నదక్కడ!
.
నిర్మలంగా, స్ఫటికమంతస్వచ్ఛమైన నీటిప్రవాహంతో కనులకింపుగా ఉన్నది తమసా నదీ ప్రవాహం!
.
తమస ఎలా ఉన్నదంటే.
.
అకర్దమిదం తీర్దం భరద్వాజ నిశామయ
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యధా
.
ఒక మంచి వాడి మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఏ కల్మషమూ లేకుండా ఎలా ఉంటుందో అలాగే ఏ మాత్రమూ బురదలేకుండా నిర్మలమనోహరంగా ఉన్నవట!  తమసాజలాలు!
.
అత్యంత రమణీయంగా కనపడుతున్న ఆప్రదేశంలో స్నానమాచరించాలని నిశ్చయించుకొన్నారు మహర్షి 
.
అలా రేవులో దిగి చుట్టూ చూస్తున్నారాయన !
.
 ఒక చెట్టుమీద రెండు క్రౌంచపక్షులు ప్రపంచాన్ని మరచి క్రీడిస్తున్నాయి సరససల్లాపాలలో మునిగి తేలుతున్నాయవి ! 
.
ఆ సమయంలో ఎక్కడనుండి వచ్చిందో రివ్వున  ఒకబాణం వచ్చివచ్చి మగపక్షి గుండెల్లో సర్రున దిగబడింది .
అంతే!అప్పటిదాకాఉన్న వాటి 
ఆనందం క్షణాల్లో మటుమాయమయిపోయింది . మగపక్షి రక్తపుమడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచింది .
.
 మగని శరీరం చుట్టూతిరుగుతూ హృదయ విదారకంగా రోదిస్తున్నది ఆడపక్షి!.
.
ఆ దృశ్యం మహర్షి మనస్సును తీవ్రంగా కలచివేసింది ! చుట్టూ చూశారాయన ఒక బోయవాడు విల్లమ్ములు చేతబూని ఏదోసాధించిన వానిలా విజయగర్వంతో వస్తూ కనపడ్డాడు !
.
అప్రయత్నంగా మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వెలువడ్డది!
.
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌఞ్చమిథునాదేకమ్ అవధీః కామ మోహితమ్
.
రతిసమయంలోఆనందంగా కూడి ఉన్న పక్షుల జంటను విడదీసి నీవు శాశ్వతమైన అప్రదిష్ట మూటకట్టుకున్నావు !
(అని అర్ధము.)
.
అప్రయత్నంగా తన నోటినుండి వెలువడిన ఆ పదముల కూర్పునకు మహర్షి ఆశ్చర్యచకితులయ్యారు!

ఆ కూర్పును ఒక సారి పరిశీలించారు!
.
అవి నాలుగు పాదములతో కూర్చబడి వున్నాయి!
వీణపై కూర్చి నృత్యగీతవాద్యాదులతో పాడటానికి ఒక క్రమపద్ధతిలో లయబద్ధంగా కూడా ఉన్నాయి! 
.
ఆ విషాద ఘటన మదిలో కదలాడుతూ ఉండగా భారమైన మనస్సుతో ఆశ్రమం చేరుకున్నారు మహర్షి!
.
ఆయన అలా వేదన లో ఉండగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినారు!
.
 బ్రహ్మదేవునకు నమస్కరించి అర్ఘ్యపాద్యాదులొసగి ఒక ఆసనముపై ఆయనను కూర్చుండబెట్టి వినయముగా ఆయన చెంతన మహర్షి నిలుచున్నారు.
.
ఈ పనులన్నీ చేస్తున్నా కూడా ఆయన మనసులో క్రౌంచపక్షులను బోయవాడుకొట్టిన ఉదంతం ,తానుపలికిన పలుకులు మెదులుతూ వున్నాయి .
అన్యమనస్కంగా వున్నారు మహర్షి.
.
ఆయన అవస్థ గమనించిన విరించి చిరునవ్వు నవ్వుతూ మహర్షీ నీ నోటినుండి వెలువడినది శ్లోకమే! సందేహములేదు!  అది నా ఇచ్ఛవలననే నీ నోటినుండి వెలువడినది! 
.
ఆ శ్లోకం ఉన్న రీతిలోనే నీవు రామకధను రచియించవయ్యా! ........
అని చెపుతున్నారు చతుర్ముఖుడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
.

కామెంట్‌లు లేవు: