రోళ్ళు పగిలే రోహిణీకార్తి ఎండలు. మధ్యాహ్నసమయం. వీధులన్నీ నిర్మానుష్యం. ఇరుగూపొరుగూ... బుద్ధిగా తలుపులేసుకుని ఇళ్ళల్లో కునుకుతీస్తున్నారు. గాలిస్థంభించి..ఆకులు కూడా కదలకుండా... గాడుపులకు తలలు వాల్చేసాయి. నూతిగట్టు మీద దాహానికి అరుస్తున్న కాకి గొంతు తప్పా మారు శబ్దం లేదు.
అరగంట క్రితమే.... భోంచేసి వంటిల్లు ఎత్తిపెట్టుకుని, అమ్మ వసారాగదిలో కూర్చుని..పాత నోట్సుపుస్తకంలో మిగిలిపోయిన తెల్లకాయితాలతో చిత్తుపుస్తకాలు కుడుతున్న ఇద్దరు అబ్బాయిలనూ, అష్టా-చెమ్మా ఆడుతున్న ఆడపిల్లలనూ.. గట్టిగా కేకేసి... మధ్యగదిలోకొచ్చి పడుకోమని కేకేసింది.
అదే అదునుగా... అక్కచేతిలో ఓడిపోతున్న చిన్నమ్మాయి... గవ్వలు విసిరేసి... ఆటంతా కలిపేసి లోపలికి చక్కాపోయింది. మరి అప్పగారు ఊరుకుంటుందా? చెల్లెలిని తరిమి పట్టుకుని, వీపు వంచి రెండు గుద్దులేసింది.
చిన్నమ్మాయికి… ప్రతిక్రియకు అవకాశమివ్వకుండానే... అమ్మ మధ్యలోకొచ్చి.. హాలులో తడిదుప్పట్లేసి.. పైన చాపలేసిన పక్కలమీదకు రెక్కలట్టుకుని లాక్కొచ్చి కుదేసింది.
అన్నగార్లూ, అక్కయ్యా ఫక్కున నవ్వుతుంటే... మా పౌరుషం పొడుచుకొచ్చింది చిన్న దానికి! చుట్టూకట్టిన వట్టిచాపలను నీళ్ళుచల్లి తడిపి... అమ్మా…. పిల్లలతో పాటూ నడుం వాల్చింది.
ఫేనుకిందే పడుకున్న చిన్నమ్మాయిని కాళ్లుపట్టి లాగేసి ,దౌర్జన్యంగా మూలకు ఈడ్చేసి... పెద్దన్నయ్య ఆ స్థలంలో…పడుకుండి పోయాడు. మూసుకున్న కళ్ళ వెనుక వాళ్ళందరి నవ్వులూ ఊహించుకుని చిన్నమ్మాయికి కోపం నషాళానికి అంటింది.
నిద్రపోనని భీష్మించుని కూర్చుంది. అమ్మ కసిరి
"అయితే వరండా లోకి ఫో" అని అరిచింది.
చిన్నమ్మాయికి ఇట్టిట్టే అలకలు కదా! పైగా అలకలన్నీ అమ్మమీదే! ఎవరి మీద చూపిస్తే ఎవరూరుకుంటారూ? సరే చేసేది లేక కటకటాల గదిలో కొచ్చింది. ఎండగాడుపు వెచ్చగా కొట్టింది మొహానికి. పదేళ్ళ వయసున్న లేతచెంపలు ఒక్కసారి భగ్గుమన్నాయి. అమ్మాయి దుడుకుతనంలో అమ్మాయిలకెక్కువ అబ్బాయిలకు తక్కువ.
కటకటటాల గదిలో వాళ్ళనాన్నగారు పిల్లలు పుస్తకాలూ, బొమ్మలూ పెట్టుకోడానికి.. జరుపుకునే తలుపులుండే... చక్కని గూడులు కట్టించారు. చిన్నమ్మాయి శబ్దం చెయ్యకుండా... అక్కగూడు తెరిచిందా.... ఒక్కసారి మనసు భగ్గుమంది.
తీరువుగా... ఒకపద్ధతిలో సర్దుకున్న పుస్తకాలో పక్క.... తన వాటాకి నాన్నగారు పంచిన పది అమరచిత్రకధలు, గుండ్రటి చాక్లేట్ డబ్బాలో... పూసల బొమ్మలు అల్లే సామాగ్రి..., రెండు అందమైన స్పాంజి గౌనులు వేసుకున్న అమ్మాయి బొమ్మలు... పెద్దమ్మాయికి..... వాళ్ళ బాబాయిలూ, మేనత్తలూ హైదరాబాదు వెళ్ళినపుడు చార్మినారులో కొనిపెట్టిన రకరకాల పొళ్ళగాజులన్నీ గాజులమల్లారంలా.. ఒక సిల్కుతాడుతో కట్టి...., అలాగే భద్రంగా దాచుకున్న… నాన్నగారు కలకత్తానుండి తెచ్చిన అద్దాల సంచీ....సగం అల్లి ఉంచిన క్రోషియా టేబుల్ మాట్, నీడిల్స్........ ప్రతీది ఒక పద్ధతిలో ఉండవలసిన తీరులో.... ఉండవలసిన స్థలంలో సర్దుకుంది ఆ పెద్దపిల్ల!
చిన్నమ్మాయి.. అక్కపుస్తకాల లాటులోంచి " నిద్రా సుందరి" అమరచిత్ర కధ లాగింది. చెదిరిపోయిన పుస్తకాలు లోపలికి తోసేసి..... పుస్తకాల గూడుమీద కట్టిన విశాలమైన స్లాబుల మీద కూర్చుని చదువుకోడానికి ఉపక్రమించింది.
ఆ గచ్చుస్లాబుల వేడికి కింద కాలిపోతున్నా, లెక్కచెయ్య కుండా చకచకా ఓ పావుగంటలో పుస్తకం చదివేసింది. అక్కడే బల్లమీదకు గురిచూసి విసిరింది. కుదురే లేని చిన్నపిల్లకు మళ్ళీ తోచడం మానేసింది!
తన పుస్తకాల గూడు తెరిచింది. కుక్కి కుక్కి తోసేసిన పుస్తకాలు, పెన్నిళ్ళ డబ్బాలు, డ్రాయింగ్ పుస్తకాలు, మెడ్రాసునుండి మేమమావ తెచ్చిచ్చిన రబ్బరుబొమ్మ, దానికోసం టైలర్ అప్పారావుకు ఆవకాయ లంచం పెట్టి తెచ్చిన రరకాల గుడ్డముక్కలతో కుట్టిన గౌనులూ, పంజాబీ డ్రస్సులూ... గవ్వలు, చింతపిక్కలు, మగపిల్లలతో జట్టుకట్టి ఆడే ఏడుపెంకులాట పెంకులు, గెలుచుకున్న గోళీలూ, మందిరం కడదామని సేకరించిన ఇంజక్షన్ సీసాలూ, రెండు గోటీబిళ్ళలు, క్లాసులో ఫస్ట్ ఒస్తే ఇచ్చిన వెండికప్పు, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీసేలా... విసిగిస్తూ ... పీపీ అంటూ ఊదే బూరాలూ, అన్నీ ఒక్కసారి మీదపడ్డాయి.
విసుగ్గా అన్నీ లోపలికి మళ్ళీ యధావిధి కుక్కేసి, తవ్వకాల్లో దొరికిన ఓ డ్రాయింగుపుస్తకం, పెన్సిల్ పట్టుకుని రెండుకొండలూ, మధ్యలో సూర్యుడూ, ఓ పెంకుటిల్లూ, వెనకో రెండు కొబ్బరిచెట్లూ, పారే యేరు, నాలుగు పద్మాలూ, పద్మాల సైజులోనే ఓ గూడుపడవ..... ఆకాశంలో ఎగిరే కొంగలబారూ…. చకచకా వేసి పడేసింది! వేసిందే కానీ…చిన్నమ్మాయికి ఆ బొమ్మ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఎందుకంటే ఆ డ్రాయింగ్ పుస్తకంలో ఉన్న పదిపేజీల్లో... ఎనిమిది పేజీల్లో ఇదే సీనరీ!
మరో బొమ్మ వెయ్యడానికి రాని తన అశక్తతకు చింతిస్తూ, మళ్ళీ కటకటాలకు వేలాడుతూ.... బూరా తీసి ఊదుకోసాగింది. కర్ణకఠోరమైన ఆ శబ్దానికి ఎవరయినా రాకపోరా అన్న ఆశతో!
వచ్చాడు! వాళ్ళ పెద్దన్నయ్య నిద్రకళ్ళతో! వస్తూనే రెండు జెల్లకాయలు పీకి, వేలూపుతూ బెదిరించి మళ్ళీ లోపలికి పోయాడు! చిన్నమ్మాయికి రోషం పొడుచుకుని వచ్చేసింది. ఈ ఇంట్లో తనింక ఉండలేననుకుంది. కటకటాల గడి కిర్రుమంటూ జరిపి, కాళ్ళకు చెప్పులేనా లేకుండా బయటకొచ్చింది!
ఏమంత పెద్ధవీధి. అటో పది ఇటో పది ఇళ్లూ... వీధి చివరే కాలవగట్టు, గోదారిపాయ!
నేల నిప్పులగుండంలా ఉంది. అలాగే గెంతుకుంటూ, పరుగులు పెడుతూ స్నేహితురాలు, ప్రేమ ఇంటిదాకా వచ్చి, కాళ్ళుకాలకుండా వాళ్ళ రాధామాధవాల గుబురు నీడలో నించుంది.” ప్రేమా, రామక్రిష్ణా లేచి వున్నారేమో! తలుపు కొడదామా”! అనుకుంది." అమ్మో! అసలే వాళ్ళమ్మ టీచరు. తను లేబర్ ఆఫీసరు గారి కూతురయినా ఆవిడకేం లెక్కా పత్రమా. ఒక్క కసురుతో ఫొమ్మంటుంది" అని స్వగతంలో అనుకుని, రివ్వున ఆ ఎండలోనే… పరిగెట్టి.... కాలవగట్టు మీదున్న క్రిష్ణమందిరానికొచ్చి.... అక్కడ అరుగుమీద కూర్చుంది.
క్రిష్ణమందిరం ముందు అప్పుడెప్పుడో…వసంతపున్నమికి వేసిన తాటాకుల చలవపందిరి కింద సేదగా కూర్చుంది చిన్నమ్మాయి.
వేడిగా వస్తున్నా, గాలి జోరుగా వంటికి తగిలి ప్రాణానికి బాగుంది. ఆ వయసే అంతేమో! ఎండయినా కొండయినా… లెక్కలేని వయసు! ఎండిపోయి...బీటలేసిన రేగడితో , మధ్యమధ్య మిగిలిన నీళ్ళ చెలమలతో.... గోదావరి కాలవ శిధిలాలయంలా ఉంది. అదే గోదారి… కార్తీకమాసం..నిండుసంద్రంలా ఉంటే…తనని సాయం తీసుకుని గుడికొచ్చిన బామ్మ గట్టుమీంచి అరుస్తున్నా లెక్కచెయ్యకుండా కాలవలో బారలేస్తూ ఈత కొట్టడం గుర్తొచ్చి, నిట్టూర్చింది చిన్నమ్మాయి.
“ ఎంత బావుండేవి ఆ కార్తీకస్నానాలు, అట్లతద్దికి వెన్నెలలో కాలవగట్టున ఇసుకలో ఆడిన ఆటలు…. సుబ్బారాయుడి గుడిబయట రావిచెట్టుకు వేసిన తాడెత్తు ఉయ్యాలలు భయం లేకుండా ఆకాశం అందేలా ఊగడం…. మార్గశిరంలో షష్టితీర్ధాలూ….క్రిష్ణమందిరంలో భీష్మేకాదశకి ఎక్కడెక్కడి నుండో వచ్చే భజనబృందాలు….వసంతపంచమికి ఆ లోగిళ్ళంతా రంగురంగల ముగ్గులేసి, జెండాలు కట్టి… గులాలు చల్లుతూ రాధాక్రిష్ణుల పాటలన్నీ తాళాలూ, ఢోలక్ వాయిస్తూ పాడడం….. తనుపాడిన “ గోపాలా రాధాలోల! గిరిధరబాలా నందలాలా” పాటకు బహుమతి రావడం ఇవన్నీఎంత సంతోషమైన దినాలు…!”…. అనుకుంటూ …. ఆటపాటలకు ఆనకట్టేసిన వేసవిరోజుల్ని తిట్టుకుంది!
కానీ ఇప్పుడా! ఏ హడావిడీ లేదు! అసలు లోకంలో జనాలే లేరా అన్నట్టుంది! కాలవకవతల సామర్లకోట రోడ్డుమీద ఒకటీ అరా సైకిళ్శ మీద కాకినాడ టౌనులోకి పోతున్న అరటిగెలల వాళ్ళూ, తాటిముంజులాళ్ళూ తప్పా పిట్ట లేరు. అంత శూన్యజగత్తులో.... తనొక్కతే మిగిలినట్టు చిన్నమ్మాయికి .... ఎక్కడలేని బెంగా వచ్చేసింది.
కాసేపటికి కాలవగట్టుమీద ఇద్దరు అమ్మిలు తట్టలు నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ... వచ్చారు. మందిరం అరుగుమీద కూలపడ్డారు. నెత్తిమీద చుట్టగుడ్డ విప్పి.... మొహాలకు పట్టిన చెమట్లు తుడుచుకున్నారు.
ఒక తట్టలో ఎండుచేపలూ, రొయ్యిలూనంట... మరొక తట్టలో తాటిముంజెలు ! అప్రయత్నంగా ముక్కు మూసుకుంది చిన్నమ్మాయి. " బేపనోల్లా పాపా!".... అంటూ వాళ్లు నవ్వుతూ అడుగుతుంటే... పౌరుషంగా..." ఆ బ్రాహ్మణుల అమ్మాయినే! " అంటూ మరింత స్పష్టం చేసింది.
చిన్నమ్మాయి నిష్ట ఎంతోసేపు నిలబడలేదు. మెల్లగా ముక్కుమూసుకునే చేపల తట్టలోకి తొంగిచూసింది. దానిలో ఉన్న ఒక్కోజీవి పేరూ అడిగింది. ఓ పదినిమిషాలు.... మొత్తం మత్స్యజాతి వేట, గాలమెలా వేస్తారు? జాలంలో ఎలా పడతారూ. , ఎలా ఎండపెడతారూ, ఎలా బజారుకు చేరుస్తారు.... ఇత్యాది..జంతుశాస్త్ర.. ఆర్ధికశాస్త్ర విషయాలన్నీ చేపలమ్మాయితో… చర్చించింది!
ఇంతలో... ముంజులమ్మాయి "తీసుకో పాపగారూ"...... అంటూ తాటాకుదొన్నెలో అందించిన లేతముంజుల్ని .... మురికిచేతుల్ని.... అమ్మ .. లోపల మల్లుగుడ్డేసి కుట్టిన తెల్లని గ్లాస్కో గౌనుకు ఓసారి తుడిచేసుకుని.... మనసారా తినేసింది!
ఎండా కాస్త తగ్గుమొహం పట్టింది... చిన్నమ్మాయి వేసవి తాపమూ తగ్గింది.
ఇంటికి పోవడానికి లేచింది మెల్లగా. కొత్తమిత్రులకు టాటా చెప్పింది. ఎప్పుడయినా వాళ్ళింటికి రమ్మంది. " ఎందుకు పాపా! సేపలు కొంటావా? "... అంటూ మేలమాడింది చేపలమ్మి. "కాదులే మా అమ్మ ఊరగాయ పెడుతుంది. పాతచీరలు ఇమ్మంటాను! "....... అమ్మ అనుమతి లేనిదే వరాలిచ్చేసి... అటోకాలూ, ఇటోకాలూ ఊపుకుంటూ... పోయింది చిన్నమ్మాయి.
ఇంటికి చేరిందే కానీ..కావాలని కటకటాలు లోపలినుంచి గడీ పెట్టేసారు. " ఇప్పుడెలా?" !
చెక్కకుర్చీలో కూర్చుని వాళ్ళ బామ్మ... ఊదుకుంటూ... ఇత్తడి ఆపుకోరాలో టీ తాగుతోంది. ఆవిడ బయట నిలబడున్న చిన్నమ్మాయిని మహాకోపంగా చూస్తోంది.
ఈలోపున అమ్మ వచ్చింది. ముసలమ్మ " దానికి తలుపుతీసేవంటే... నేను నూతిలో దూకుతా! మగరాయుడిలా ఊళ్ళుపట్టి తిరిగి పరువుతీస్తోంది".... అంటూ జారిపోతున్న ముసుగు సవరించుకుంది.
చిన్నమ్మాయికి నోరెక్కువ! " దూకవే! బోడిముండా! పీడావదులుతుంది! " అని గొణిగింది.
అంతే తలుపులు తెలుచుకోనూ, వీపు మీద అమ్మ దబదబా నాలుగు బాదనూ అయిపోయింది.
చిన్నమ్మాయి పెద్దగా ఇవన్నీ పట్టించుకోదు. కాగితం మంటలా ఒక్క ఏడుపు ఏడ్చి మర్చిపోతుంది. అమ్మది ఆల్సేషన్ ముక్కుకదా! చేపల వాసన పట్టేసింది. " ఈపిల్ల ఎక్కడ తిరిగొచ్చిందో...." అని తల పట్టుకుని..." ఫో! ఇంట్లోకి రాకు. సందులోంచి పోయి.. నూతిదగ్గర స్నానం చేసిరా! ".... అని తోసేసి తలుపులేసేసుకుంది. చిన్నమ్మాయికి మామ్మముందు తలకొట్టేసినట్టయింది.
నూతిలో నీళ్ళు తోడుకుని నెత్తిమీంచి పోసేసుకుంది. చల్లనీళ్ళు ప్రాణాలకు హాయిగా ఉన్నాయి. అలా నీళ్ళలో నానుతూనే ఉన్న చిన్నమ్మాయిని దెబ్బలాడి వాళ్ళమ్మ.... తువ్వాలు విసిరి తుడుచుకోమంది.
అలా పెరటిగుమ్మాన పడి లోపలికొచ్చిన చిన్నమ్మాయికి కళ్ళు మిలమిలా సంతోషంతో మెరిసిపోయాయి.
ఎప్పుడు కొందో ఏమో అమ్మ! ..... పెద్ద స్టీలు బేసిన్ నిండా కుప్పగా పోసిన పందిర మల్లెమొగ్గలు. సన్నగా, పొడవుగా... వాళ్ళ అక్కలా అందంగా! సుకుమారంగా! పక్కన అరటాకుల్లో చుట్టి ఉన్న కనకాంబరం మాలలు, మరువం, ధవనం కొమ్మలు! తెల్ల దూరపుండ, సూదులూ, విస్తరాకులు కలిపికుట్టిన పెద్ద అట్ట!
" ఓహ్! అమ్మా! మాకు జడలు కుడుతున్నావా ఈవేళ?!".... అంటూ బిగ్గరగా చిన్నమ్మాయి అరిచింది.
" అవునే! అయితే ఏంటిటా?!"..... అంటూ తిప్పుకుంటూ…వాళ్ళక్క లోపలినుంచి వచ్చింది.
ఆ మధ్య దాని ఫంక్షనుకు అమ్మమ్మ కొన్న కొత్త పట్టుపరికిణీ వేసుకుని, పౌడరూ, బొట్టూకాటుక పెట్టేసుకుని, ఎర్ర పొళ్శ నెక్లేస్ మెడలో తగిలించుకుని.. , దాని పొడవాటి ఒత్తు జుట్టంతా.... సాపుగా దువ్వేసుకుని రెడీగా ఉంది పెద్దమ్మాయి.
చిన్నమ్మాయికి గాభరా వచ్చేసింది. తడితలను ఏదో మమ అన్నట్టు తుడిచేసుకుని….. ఆ తడిమీదే ఇంత పౌడరు కొట్టుకుని…ఎండకు బాగా పేలిపోయి, చమటలు పడుతున్న ఆ నుదుటిమీద పొడవుగా ఇంత తిలకం పుల్లతో పైకిలాగింది. “ అమ్మా! ఏం పట్టుపరికిణీ వేసుకోనే! …” అంటూ అరిచింది. అమ్మచెప్పినట్టే… అక్కకు మోకాళ్ళ కిందకు వచ్చేసిన ఎర్రంచు ఆకుపచ్చ లంగా వేసేసుకుని…. పువ్వులు పేరుస్తున్నఅమ్మ దగ్గరకు పరిగెట్టుకొచ్చింది.
మొహాన తెల్లఅట్టల్లా కట్టేసిన పౌడరుతో… ముక్కుమీంచి కారిపోతున్న తిలకంతో… నీరుకారుతున్న పొట్టి జుట్టుతో నించున్న చిన్నమ్మాయిని చూసి అంతా పడీపడీ నవ్వారు.
చిన్నమ్మాయి ఎక్కడ ఉక్రోషపడుతుందో అని అమ్మ భయపడిపోయీ…. చేతిలో పువ్వులు ఆపట్టాన బేసిన్ లో పడేసి… కూతురు తలంతా పొడిగా తుడిచింది. పౌడరు సరిచేసి… ముక్కుతుడిచిందా… చిన్నమ్మాయి ఎర్రని ముక్కుతో సత్యభామలా ఉందట అమ్మకళ్ళకు. ఆమాటే అంటుంటే…. “ కొండముచ్చు”లా ఉందని గేలిచేసారు మిగిలినవారు.
జడకుట్టించుకోడానికి పెద్దమ్మాయి కూర్చోగానే…. అమ్మ.. తనకు తల దువ్వి కుదురుగా పాయలు తీసి.. పైనుండి గట్టిగా బిగిస్తూ… నల్లని పొడావయిన కొరడాలాంటి జడల్లింది… మధ్యలోంచి సిల్కుకుచ్చెల బంగారం జడగంటలు కలుపుతూ… భలే అందమయిన జడవేసింది. ఆ తరవాత అబ్బాయలూ, చిన్నమ్మాయి.. మంచిపొడవైన సౌష్టవపు మొగ్గలు అందిస్తుంటే … చకచక అట్టకు వేసి కుట్టేస్తోంది.
ప్రతి ఐదువరసల తరువాత.. ఇంట్లోపూసిన చిక్కని కాషాయపు మద్రాసు కనకాంబరాలూ, ధవనం కలిపి బద్దీలు వేసింది. అరగంటలో జడంతా కుట్టీ చివర… మల్లెల సరాలు కూర్చి వాటి చివర దేశవాళీ గులాబీలను వ్రేలాడతీసింది. అంత అందమయిన జడను చూసి…. అమ్మ నేర్పరితనానికి పిల్లల కళ్ళు ప్రశంసగా మెరిసాయి.
మగపిల్లలను వంటింట్లో కాసిని పకోడీలు వేసుకురమ్మని పంపి…. అమ్మ పెద్దమ్మాయి జడకు… చకచకా పూలజడ టాకాలు వేసేసింది. కట్టిపెట్టి ఉంచిన బొండుమల్లెల దండ, కనకాంబరాల దండా… జడపైన అర్ధచంద్రకృతిలో అమర్చి… పిన్నులు పెట్టింది. ఆ పైన అమ్మ పుట్టింటారు ఇచ్చిన తెల్లరాళ్ల సూర్య చంద్రులను తలకు అటూయిటూ పెట్టింది. మధ్యలో ముచ్చటయిన నాగరం పెట్టింది.
పెద్దమ్మాయిని ముందుకు తిరగమని… చుబుకం పట్టుకుని… పొళ్ళ పాపిడిపిందె పెట్టింది. తన మామిడిపిందెల గొలుసు వేసింది. చెవులకు లోలాకుబుట్టలు పెట్టి… నాలుగు పేటల చెంపస్వరాలు పెట్టింది.
పుల్లతో దిష్టితగలకుండా బుగ్గమీద చిన్ననల్ల అలుగుబొట్టు పెట్టింది. లేచి నిలబడమని… చంద్రకాంతరంగు పట్టుపరికిణీలో… కుందనబొమ్మలా మెరిసిపోతున్న పెద్దమ్మాయిని తనివితీరా చూసుకుంది. చిన్నమ్మాయికి కూడా అక్క తెగనచ్చేసింది. వెళ్ళి గాట్టిగా కావలించుకుంది. “ అబ్బా! బట్టలూ, జడ నలిపేయకే…” అంటూ మురిపెంగా విడిపించుకుంది పెద్దమ్మాయి.
ఇప్పుడు చిన్నమ్మాయి వంతు కదా! అన్నలిద్దరూ… పకోడీలూ, మైసూరుపాకూ ప్లేట్లలో సర్ది… అందరికీ తెచ్చారు.
చిన్నమ్మాయి అల్లప్పచ్చడి కావాలంది. బామ్మ..” కుళ్ళుముండకి అల్లంపచ్చడి!” అంది. చిన్నమ్మాయి వెంటనే… “ బోడిముండకి దోసకాయపచ్చడి” అంది! అమ్మకు కోపం వచ్చింది. విసురుగా ముందుకు తోసింది. చిన్నమ్మాయి ముందుకు పడింది.
కోపంతో చిన్నమ్మాయి పకోడీల ప్లేటు విసిరేసింది. పకోడీలు పూల బేసిన్ లో పడ్డాయి. అమ్మకు కోపం తారాస్థాయికి చేరుతోంది. అది గ్రహించి … పదిహేడేళ్ళ పెద్దబ్బాయి కలగచేసుకుని… అమ్మకన్నా ముందు చిన్నమ్మాయిని శాంతింప చెయ్యాలని గ్రహించి….” చాలు.దీన్ని ఎవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదు. దీనిలా మీకెవరికయినా అన్ని పరిక్షల్లో నూటికి నూరొచ్చాయా? రాలేదు కదా! నోరుమూసుకోండి! “…. అని గద్దించాడు.
అమ్మ చిన్నదాన్ని ఒక్క గుంజుగుంజి…తన కెదురు కుదేసింది. పొద్దున్నే బళ్ళకు పంపుతూ… నాలుగేసి బారుజడలు వెయ్యలేక చిన్నపిల్లకు పొట్టిజుట్టు చేయించేసి… రెండు పోనీటెయిల్స్ వేసేది. ఈరోజూ అలాగే రెండు పోనీటెయిల్స్ వేసింది. వాటికి నల్లదారాలతో రెండు పెద్ద సవరాలు కట్టి జడలల్లింది. చకచకా పావుగంటలో మూడుగజాల మల్లెమాలలు సున్నితమైన వేళ్ళను వేగంగా నేర్పుగా తిప్పుతూ అల్లేసింది. వాటిని చిన్నమ్మాయి రెండుజడలకూ నిండుగా చుట్టేసింది. ఆ జడనుండి ఈ జడకు ఉయ్యాలలాగా మాల వేసింది. తలోజడలో తలో గులాబీ గుచ్చింది.
కొయ్యగండ్లు వచ్చిన చెవికన్నాలకు ఆ పుల్లలే ఉంచేసింది. చిన్నమ్మాయికి దాని ఆంజనేయస్వామి బిళ్ళ బంగారుగొలుసు వేసింది. “ ఆ చార్మినార్ గాజులు వేసుకో ఫో!” అంది.
ఈ తేడాలను చూస్తున్న చిన్నమ్మాయి మనసు లావాలా కుతకుతలాడుతోంది.
దానికి తగ్గట్టే… కాళ్ళకు దణ్ణం పెడుతుంటే… బామ్మ పెద్దమ్మాయికి పదిరూపాయిలూ.. ఈవిడికి ఐదే ఇచ్చింది.
ఆ అవతారాలతో అప్పచెల్లెళ్ళిద్దరూ.. పేటంతా తిరిగారు. పెద్దలకు దణ్ణాలు పెట్టారు.
అందరూ పెద్దమ్మాయి బుగ్గలు పుణికి, మెచ్చుకుని రూపాయో… రెండ్రూపాయలో చేతిలో పెట్టారు! … చిన్నమ్మాయి బుగ్గలు నొప్పెట్టేలా సాగదీసారు. ఆ రెండుజడల పూలజడను చూసి ముసిముసి నవ్వులు కూడా నవ్వుకున్నారు.
తన పదేళ్ళ జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదనుకుంది చిన్నమ్మాయి.
ఇంటికి వస్తూనే…. రాత్రివంటకి..కత్తిపీట ముందేసుకుని అరటికాయలు తరుగుతున్న అమ్మ ఎదురుగా నిలబడింది.
అమ్మతలెత్తి చూసింది.
చిన్నమ్మాయి మౌనంగా.. జడకు చుట్టిన పూలదండలు పరపరా కిందకు లాగింది. దారాలకు ఉరేసినట్టు మల్లెపూలన్నీ విగతగా నేలంతా రాలిపోయాయి!
కసిగా ఇంకా పీకింది! ఇంకా పీకింది. రెండు సవరాలు చేతికేచ్చేంత వరకూ పీక్కుంది! ఆ రెంటినీ పట్టుకుని అమ్మమీదకు విసిరేసింది.
సన్నని బంగారుగొలుసు మెడనుకోసేలా లాక్కుంటూ ముక్కలు చేసి మూలకు విసిరింది.
అమ్మ నిశ్చేష్టే అయ్యింది.
పిల్లలు బిత్తరపోయారు చెల్లిని చూసి! పక్కనే క్రిష్ణాజినంపై కూర్చుని రుద్రాక్షతావళం తిప్పుతూ… ధ్యానంచేస్తున్న బామ్మకోపం ముంచుకు రాగా,, అసంకల్పితంగానే… చిన్నమ్మాయి మీదకు రుద్రాక్ష తావళం గురిచూసి విసిరింది.
పిల్ల కంటికి గట్టిగానే తగిలింది. ” అమ్మా! “ అని కన్ను ఒకచేత్తో… పట్టుకుని… చేతికందిన పూలబుట్ట బామ్మ మీదకు విసిరింది.
అమ్మ భద్రకాళే అయ్యింది. కత్తిపీట పట్టుకుని ఒక్క ఉదుటున లేచి… చిన్నమ్మాయి కేసి రౌద్రంగా ఉరకపోయింది.
చిన్నమ్మాయి భయంతో పెరట్లోకి పరిగెట్టి… ఉరుకుతూ,ఏడుపుతో వెక్కుతూ.. పెరట్లో తాతలనాటి నుండీ ఉన్న పొడుగాటి మావిడిచెట్టును కోతిలా… చకచకా ఎక్కేసింది…. ఓ పక్క పరికిణీ కాళ్ళలో అడ్డుపడుతున్నా!
కొమ్మ మీంచి కొమ్మ అందుకుంటూ……చిటారి కొమ్మకు చేరి… ఓ పెద్ద కొమ్మమీద పొట్టఆన్చుకుని కరుచుకున్నట్టు కూర్చుంది. అమ్మకు గుండాగిపోయింది చిన్నదాని అఘాయిత్యానికి.
“ ఎవరయినా చెట్టు ఎక్కేరా… దూకేస్తా!”… అంటూ చిన్నమ్మాయి కీచుగొంతుతో అరుస్తోంది. అమ్మ కూడా కుర్రాళ్ళను చెట్టు ఎక్కకుండా వారించింది. అక్క వచ్చి” దిగవే!.నా అమరచిత్రకధలన్నీనీకే ఇచ్చేస్తా”..నంటూ ఆశపెట్టింది. అయినా దిగలేదు.
ఈలోపున వాళ్ళ నాన్నగారు వచ్చిన అలికిడి అయింది. అమ్మ ఇంట్లో గొడవలేవీ నాన్నగారికి చెప్పి విసిగించదు. పూలజడేసుకున్న పెద్దపిల్లను చూసి నాన్నగారు చాలా ముచ్చటపడ్డారు.
నిలువుటద్దంలో పూలజడ కనిపించేలా ఫోటోలు తీసారు. “ చిన్నదేది” అంటూ చుట్టూ కళ్ళతో వెతికారు. బామ్మగారు ఏదో మాయమాటలు చెప్పి…. మాట మరిపించారు.
అంతే! ఒక్కసారి...నాన్నగారు ఆయన గదిలోకి వెళిపోతే… ఇహ అన్నీ అక్కడికే. ఇంగ్లీషు పుస్తకాలు చదువుకుంటూ ఉండిపోతారు.
వేసవి అవడం వల్ల…. రాత్రి ఎనిమిదింటికి చీకటయింది.
చిన్నమ్మాయి కిందకొమ్మల మీదకొచ్చి… చెట్టుమీదకి వచ్చి చేరిన పక్షులను పలకరిస్తోంది. అవి నిద్రమత్తులో ఎగరనూ లేక గూళ్ళలో బజ్జునే…. ఏవో కువకువలతో జవాబులిస్తున్నాయి.
ఎనిమిదింటికి… భోజనాలవేళ… చిన్నదాన్ని పిలుచురమ్మని పిల్లల్ని పంపింది అమ్మ. “ రానంది” చిన్నావిడ. అమ్మ బతిమాలద్దంది.
భోజనాలయ్యాకా… అమ్మ మర్నాటికని గారెలపప్పు రుబ్బడానికొచ్చింది. ఇంటి చుట్టూ లైట్లేసింది.
చిన్నమ్మాయి చెట్టుమీంచి అమ్మనే చూస్తోంది. అమ్మపిలిస్తే బావుండుననుకుంటోంది.
అమ్మ దీక్షగా పప్పురుబ్బుతోంది. చిన్నమ్మాయికి ఉదయం నుండి తిరిగిన తిరుగుడు తాలూకు అలసట, ఆకలి, దాహం, దుఃఖం, అవమానంతో ఏడుపు తన్నుకొస్తోంది. దాన్ని రోషం ఆపుతోంది.
కాసేపటికి లైటులు ఆర్పకుండానే అమ్మ లోపలికి వెళ్ళిపోయింది.
తమ ఇంటివెనకనే ఉన్న నిర్మానుష్య పురాతన దేవాలయాన్ని చీకట్లో చూస్తుంటే చిన్నమ్మాయికి బెంబేలుగా ఉంది.
గట్టిగా అరిచి నాన్నగారిని పిలిచి …. తనకు జరుగుతున్న అన్యాయాలూ… మిగిలినవారి దౌర్జన్యం చెబ్దామా అనుకుంటోంది.
ఇంతలో… వంటింటితలుపు తెరుచుకుంది. అమ్మ బయటకొచ్చింది. పెరటి వరండా మీద చాప పరిచింది. ఏవో గిన్నెలు సర్దింది.
చెట్టుకిందకొచ్చింది. పిల్లకు కడుపులోంచి దుఃఖం, ఆనందం ముంచుకొచ్చాయి. “ దిగు” అంది అమ్మ.
ఆ స్వరంలో కోపం లేదు. దయ, ప్రేమా, మార్ధవం తప్పా. మరింక బెట్టు చెయ్యలేకపోయింది చిన్నమ్మాయి. చకచకా దిగి అమ్మను చేరింది.
అమ్మ గట్టిగా కావలించుకుంది. అమ్మ కళ్లలో నీళ్లు! నుదుట ముద్దుపెట్టుకుని… చిన్నమ్మాయిని నూతి దగ్గరకు తీసుకెళ్లి చల్లనీటితో చేతులు, మొహం కడిగి.. తన మెత్తని చీరకొంగుతో తుడిచింది.
వరండాలో వేసిన చాపమీద రెండు వెండికంచాలు పెట్టింది. ప్రశ్నార్ధకంగా చూసిన చిన్నమ్మాయితో…” రెండోది నాకే!” అంది.
కూరన్నం, చారన్నం తినగానే… అమ్మ రెండుకంచాల్లో మల్లెపువ్వంటి అన్నం వేసి… కంచాల నిండుగా మీగడపాలు పోసింది. మరో గిన్నెనుండి ముక్కలపులుసులో పులుసుముక్కలన్నీ గరిటతో తీసి… ఇద్దరి కంచాల్లో వేసింది.
ఇద్దరూ ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకుని ఫక్కున నవ్వుకున్నారు. అది వారిద్దరికే ప్రత్యేకమైన అభిరుచి!
అన్నాలు తినేసాకా… సామాన్లన్నీ నూతిచప్టా దగ్గర పడేసింది అమ్మ.
తులసికోట గూటిలో ఉన్న దీపంలో నూనెపోసి… వత్తి ఎగదోసింది.
చాపమీద కాళ్ళు కిందకు వేలాడేలా కూచుంది. చిన్నమ్మాయిని… చేతులు చాచి.. “ ఇలా రా!” అని పిలిచింది. ఒళ్ళోకి లాక్కుని… గట్టిగా కౌగిలించుకుని…. బుగ్గలంతా ముద్దుపెట్టుకుంది.
పక్కనే కిటికీలో పెట్టిన బసంతమాలతి లోషన్ తీసి… చమటకాయలతో పేలిపోయిన నుదురూ, చెంపలూ, వీపుకు మృదువుగా రాసింది.
ఆ పట్టుపరికిణీ తీసేసి, దండెం మీద ఆరేసున్న నూలు గౌను వేసింది.
బాదం చెట్టు ఆకులు విసెనకర్రలు విసురుతూ వేసవితాపం తీరుస్తున్నాయి. అమ్మా- చిన్నమ్మాయి ఆ చుక్కల ఆకాశాన్ని చూస్తూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు.
“ అన్నలూ, అక్కా మరో ఐదేళ్ళకు బయటకు వెళ్ళిపోతారుగా! మరి వాళ్ళకు కాస్త ఎక్కువ చూసి పంపాలి కదా నేను! ఆ తరవాత మనిద్దరమే మిగులుతాం. అప్పుడు అమ్మ అచ్చంగా నీదే! అన్నీ నీవే! మనిద్దరం కలిసి సినిమాలు చూడచ్చు, పుస్తకాలు చదవుకోచ్చు, మామయ్యల ఊర్లు వెళ్ళచ్చు, నువ్వు వేసవిసెలవల్లో రోజూ పూలజడ వేయించుకోచ్చు. నా నగలన్నీ నీకే కదా! చిన్నతల్లీ! నువ్వు మా అమ్మవురా! నా కోసమే మళ్ళీ పుట్టావు. నాలాగే… బోల్డంత బుర్రతో, అల్లరితో!” …. అంటూ అమ్మ చెప్తుంటే… నిద్రకూరుకుపోతున్న కళ్ళతో అమ్మ నడుం మీంచి తన ఎడమ కాలుతిప్పి….” అమ్మా! ఎందుకు నేను మీ అమ్మను?”… అని అడిగింది చిన్నమ్మాయి. “ మా అమ్మకు కూడా నీలాగే ఇట్టు కోపం. ఒకరోజు నేను విసికించానని … నా పదేళ్ళప్పుడు ఎత్తి వీధిలోకి విసిరేసింది!”….. అని పకపకా నవ్వింది అమ్మ.
చిన్నమ్మాయికి నవ్వు రాలేదు. పదేళ్ళ అమ్మకు తన లేత చేతులతో నడుం రాయసాగింది!
ఇలా పెళ్ళయే వరకూ అమ్మను దేనికో దానికి… అలకలతో, కోపాలతో విసికిస్తూ, సాధిస్తూనే ఉంది చిన్నమ్మాయి. పెళ్ళవడంతోనే అమ్మమీద అలకలూ, విసుకులూ ఆయనమీదకు మళ్ళినా అమ్మంత శాంతమూర్తే దొరికాడు చిన్నమ్మాయికి!
అమ్మ చెప్పినట్టు అక్కా, అన్నలూ నిజంగానే వెళ్ళిపోయారు….. చాలా దూరం… అమెరికాకు! బామ్మా వెళ్ళిపోయింది! నాన్నగారూనూ!
ఇప్పుడు చిన్నమ్మాయికి ఏభైయేళ్ళు. అమ్మకు ఎనభై అయిదు.
అమ్మ మరుపులతో, అలకలతో, ముదిమి బాధలతో….తనతోనే ఉండిపోయిన చిన్నమ్మాయిని విసికిస్తూనే ఉంటుంది.
చేతిలో ఏముంటే అది మీదకు విసురుతుంది. అన్నం తిననంటుంది. మందులు ఉమ్మేస్తుంది.
కానీ చిన్నమ్మాయికి అస్సలు కోపం రాదు.
నవ్వుతూ… ప్రేమగా… అమ్మతల తన బొజ్జకు ఆన్చుకుని… వీపంతా మోయిశ్చరైజర్ రాస్తుంది. డైపర్స్ మారుస్తుంది సహాయకురాలి సాయంతో.
స్పాంజిబాత్ చేయించి… మెత్తని గుడ్డలతో తుడుస్తుంది. మల్లెపువ్వంటి పక్కేసి… మల్లెచెండులా పడుకోపెడుతుంది అమ్మను.
అయితే మొన్ననే ఈమధ్య …..చిన్నమ్మాయి మళ్ళీ అమ్మను తెగ విసికించింది… అమ్మను అంతిమయాత్రకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ… అమ్మ చల్లని చెయ్యిని పట్టుకుని వదలకుండా!!
*ధన్యవాదాలతో*
*శశికళా ఓలేటి* .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి