తమిళనాడులోని చిన్నమనై కెన్‌పట్టి అనే ఓ చిన్న ఊరు… పేదరికం తాండవించే ఊరు… ఆ ఊరవతల ఓ చిన్న గుడిసె… మరీ చిన్న గుడిసె… దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది… ఒకాయన నీలి గళ్ల చొక్క టక్ చేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు… బెల్టు, బూట్లు… కారు దిగి ఆ ఇంటి తలుపు అనబడే ఓ తడిక తీసుకుని లోపలకు తలవంచి వెళ్లాడు… మసిబారిన గోడల పక్కన ఓ మూలన గాజుకళ్లతో ఓ ముసలామె కనిపించింది… ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆ దొరబాబు… ఆమెకు అధికార్లను చూస్తేనే వణుకు… భయంభయంగానే చెప్పింది… ‘అయ్యా, నా పేరు రంగమ్మాళ్… ఆయన పేరు రామన్… మా ఆయన… ఇప్పుడే ఎటో పోయాడు…’ అన్నది బెరుకుబెరుకుగా… ఆమె వయస్సు 80 ఏళ్లు… ఆయన వయస్సు 82… ఏందయ్యా..? అనడిగింది ఆమె ఆ దొరబాబును… ఆ పక్కనే ఉన్న ఓ చాపను తీసుకుని, కింద పరుచుకుని కూర్చున్నాడు… పరిచయం చేసుకున్నాడు… ‘అమ్మా, నా పేరు అంబళగన్… నేను ఈ జిల్లాకు కలెక్టర్‌ను…’ అన్నాడు… ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం… ఊళ్లో పట్వారీతో మాట్లాడటానికే ఆమెకు భయం… అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు… ఏం తప్పు జరిగింది..? అవును ఏం తప్పు జరిగింది..? ఒక కలెక్టర్ అలాంటి గుడిసెల్లోకి అడుగుపెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికార్ల దృష్టిలో పెద్ద తప్పు… ఎంతసేపూ ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతుపట్టని తప్పు…
అక్కడికి దగ్గరలోనే ఉండే మాకన్ కురిచి అనే ఊరికి మాస్ కంటాక్ట్ ప్రోగ్రామ్ కింద వెళ్లాడు ఆ కలెక్టర్… మధ్యాహ్నం అయిపోయింది… అధికార్లు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసిపెట్టారు… కానీ అవన్నీ రెఫ్యూస్ చేసి, ఇదుగో, ఇలా ఓ గుడిసెకు వచ్చాడు తను… చాప మీద బైఠాయించాడు… డ్రైవర్, తనతో వచ్చిన దఫేదార్. ఆ ఊరి పట్వారీ, తాలుకూ తహసిల్దార్ అందరూ గుడిసె బయటే నిలబడ్డారు… ఆమె గురించి అడిగాడు… ఇద్దరు కూతుళ్లు… ఎక్కడో ఉంటున్నారు… ఆ గుడిసెలో ఆ ఇద్దరే… జీవనసంధ్యలో ఒకరికొకరు… పనిచేసే బలం లేదు… కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు… వాళ్లో వీళ్లో సాయం చేస్తే మిగతా సరుకులు… అంతే… అవును, మన దేశంలో ఇలాంటి వాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంటుంది.
‘ఏం వండుకున్నావమ్మా… నాకూ కాస్త పెడతావా..?’ అనడిగాడు ఆ కలెక్టర్…‘ఇంకా వండుకోలేదయ్యా..?’ అన్నది… ఏం..? అనడిగాడు కలెక్టర్… ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా నిర్వేదంగా కలెక్టర్ మొహం వంక చూస్తుండిపోయింది… కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్తాడు క్యారియర్‌లో… డ్రైవర్‌ను కేకేసి అది లోపలకు తెప్పించుకున్నాడు… ఆమెను ఓ విరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు… అరిటాకులు పరిచాడు… ఈరోజు నాతో భోజనం చేయి అన్నాడు.ఆమెతోపాటు భోజనం చేస్తూ అడిగాడు… మీకు వృద్యాప్య పెన్షన్లు వస్తున్నాయా..?
‘లేదయ్యా… ఆఫీసుల చుట్టూ తిరిగి చేసిపెట్టేవాడు లేడు, మాకు ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు’ అన్నది ఉన్నదున్నట్టుగా… బయట నిలబడిన తహసిల్దార్‌ను లోపలకు పిలిచాడు… అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు.వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు. ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్… మరి ఆ ముసలాయనకు ఎలా..? ఏ పథకం కింద ఏం ఇవ్వవచ్చో చూసి, తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు… అంతేకాదు… ఆ తాలూకాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్‌కు పంపించాలని ఆదేశించాడు… ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడుమా అమ్మతో కూర్చుని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి, వెళ్లిపోయాడు.
ఇది వాస్తవంగా జరిగింది. ఇటువంటి అధికారులు ఈనాడు చాలా అవసరం.
అందరూ అధికారులు తమ అహాన్ని వీడి ప్రజా సేవకులైతే ఈ దేశం ఎంతో బాగుపడుతుంది.
ఇది ఒక వాట్సాప్ గ్రూపులో చూసి కాపీ చేసి పెట్టింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి