2, జులై 2020, గురువారం

రుద్రం యొక్క మహత్యం


రుద్రంలో మీరు చూస్తే ప్రపంచమంతా తిప్పుతాడాయన. "నమః కలాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః  పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః" పెద్ద flight లో కూర్చోబెట్టి world అంతా తిప్పుతుంది రుద్రం మనల్ని. తిప్పి తిప్పి ఏం చేసిందంటే ఇందరిలో రుద్రుణ్ణి చూడు. ఇందరిలో ఉన్న రుద్రుణ్ణి చూడు. అదీ చెప్పడం. ఇందరిలో ఇన్నిగా ఉన్నాడంటే ఒక్కడేట. ఎలా అంటే "ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు పోలిక" అని చెప్పడానికి పది కడవలు పెట్టి ఒకదానికి పసుపు రంగు, ఒకదానికి నీలం రంగు కడవ పెట్టి పసుపు కడవలోనూ సూర్యుడే, నీలం కడవలోనూ సూర్యుడే, అని ఇన్ని కడవలు చూపిస్తున్నా చిట్టచివరికి రుద్రం ప్రతిపాదించింది 'ఏకం' - అందరిలో ఉన్నవాడు ఒక్కడే అని ప్రతిపాదించుతూ వాడెక్కడున్నాడు? తిరిగావా? లోపలికి వెళ్ళు, అక్కడున్నాడు. మనం అది చెయ్యం. కనుక అక్కడున్నాడు. గర్తసదం - లోతుగా ఉన్నాడుట. అంతా గభీరం -ప్రత్యక్ దృష్టి ఉంటేగానీ కనిపించాడాయన. లోతైన హృదయంలో ఉన్నాడు. అందుకు ఆయనని స్తుహి - స్తోత్రం చెయ్యి. అందుకే స్తోత్రేణ స్తూయతే అనేన స ఏవ పరమేశ్వరః - ఆయనని స్తోత్రం చేయమని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మధ్యలో రుద్రం ఎందుకు చెప్పారండీ? అని వెంటనే అనిపించవచ్చు కదా! దానికి సురేశ్వరాచార్యుల వారు చెప్పిన ఈ శ్లోక వ్యాఖ్యానంలోనే ఉన్నది.

రుద్రోపనిషదిత్యేతం స్తౌతి సర్వాత్మకం శివం
ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే
వ్యోమవత్ వ్యాప్య దేహాయ  దక్షిణామూర్తయే నమః!!

అణోరణీయాన్మహతో మహీయానితి వేదవాక్
రుద్రోపనిషదిత్యేతం స్తౌతి సర్వాత్మకం శివం!

ఏమండీ వేదాంతం అనేది ఎలాంటిది అంటే గట్టిగా అర్థం చేసుకుంటే రేపు ఉపన్యాసం అక్కరలేదు. రేపు మళ్ళీ పెట్టాం అంటే అర్థం చేసుకోలేదని మిమ్మల్ని అనుకున్నానని అనుకోవద్దు. ఇంకా ఇంకా తెలుసుకుందాం అని. కానీ ఎక్కడికక్కడే పరిపూర్ణమండీ. అదీ ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. 'అణోరణీయాన్మహతో మహీయాన్' అనే మాటకి అర్థం చెప్తున్నాడిక్కడ.  దీనికి మనం ఏంటంటామంటే అణువుకంటే అణువు, మహత్తు కంటే మహత్తు అని. అణువులో అణువై వున్నవాడు, మహత్తులో మహత్తై ఉన్నవాడు.

ఇది తక్కువ, ఇది ఎక్కువ అని లేకుండా అన్నిటియందు "సమః సృష్టిణా సమో మశకేన సమో నాగేన" అని ఉపనిషత్తు చెప్పినట్లుగా సర్వముయందు సమానమై వ్యాపించాడట. ఎలాగు? అయ్యా! సర్వమునందూ సమానమంటే మరి బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, విష్ణువు, ఇలా అనేకమంది దేవతలు మనకి కనిపిస్తున్నారు కదా! ఈ దేవతలందరూ నాకంటే గొప్పవాళ్ళు. అవునా? కాదా? అంతేకాదు. మా ఊరి రాజుగారు, మా దేశపు రాజుగారు, ఇంకా అల్లక్కడ ఫలానా దేశము యొక్క అధిపతి వీళ్ళందరూ నాకంటే గొప్పవాళ్ళు. మరి అందరూ సమానం అని ఎలా అంటారండీ? అయ్యా! గొప్ప అనేది ఉపాధుల వల్ల ఏర్పడినది. అది ఇక్కడ అర్థం. నీ దేహము, ప్రాణము, బుద్ధి ఇవన్నీ ఉపాధులే. ఇందులో ఆత్మ అంటే కొందరు దేహము నువ్వు కావు అంటే మనస్సేమో అనుకుంటారు. కొందరు ప్రాణమేమో అనుకుంటారుట. ఇన్ని confusion లు. ఇక్కడ ఆత్మను filter చేసి పట్టుకోవడం మామూలు విషయం కాదు. దానిని తెలుసుకోవడం మహా కష్టం., మహా తేలిక. అందుకే 'సులభః సువ్రతః సుముఖః' 'దుర్లభో దుర్గమో దుర్గో' - రెండూ ఆయనే. సరిగ్గా వెళ్ళగలిగితే accident కాకుండా చక్కగా అందుకోగలరు ఆయనని. జాగ్రత్తగా, ఆ ఏమరుపాటు లేకుండా alert గా వెళ్ళాలి. అదీ ప్రత్యగ్ర భావం. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళలోనూ నీలోనూ ఉన్నవాడు ఒక్కడే అని ఎలా అనగలవయ్యా? అంటే

శివో బ్రహ్మాది దేహేషు సర్వజ్ఞ ఇతి భాసతే!
దేవ తిర్యగ్ మనుష్యేషు కించిత్ జ్ఞః తారతమ్యతః!!

అది ఇక్కడ చెప్తున్నారు. 'కించిత్ జ్ఞః తారతమ్యతః'. శివ, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు  - ఇక్కడ చెప్తున్నది సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు, వాళ్ళందరిలో ఆయన ఎలా ఉన్నాడు అంటే సర్వజ్ఞా - చైతన్యంగా ఉన్నాడుట. సర్వమూ తెలిసిన చైతన్యంగా ఉన్నవాడు ఆయనే. ఆ చైతన్యమే 'దేవ తిర్యగ్ మనుష్యేషు' - ఆ ముగ్గురికీ బంట్లు అయినటువంటి దేవతలు, తర్వాత జీవులు, జీవులు ఎలా అంటే తిర్యగ్ మనుష్యేషు - అడ్డగా పెరిగేవాళ్ళు, నిలువుగా పెరిగేవాళ్ళు, అంతేకదండీ తేడా. అడ్డగా వెళ్ళేవి అంటే పశువులు, పక్షులు; నిలువుగా అంటే మనము, చెట్లు మొదలైనవన్నీ కూడా. ఈ 'దేవ తిర్యగ్ మనుష్యేషు' - వీళ్ళందరియందూ కూడా కించిత్ జ్ఞః అని వ్యాపించిన వాడూ ఆయనే అన్నారిక్కడ. అక్కడ సర్వజ్ఞుడుగా ఎవడున్నాడో, ఇక్కడ కించిజ్ఞుడుగా ఆయనే ఉన్నాడుట. అంటే వారికి అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలియవు. అంతే తేడా. కానీ నీకు అన్నీ తెలియవు అని అంటే ఏవో కొన్నైనా తెలియట్లేదా?  కనీసం అన్నీ తెలియడం లేదు అనే విషయం అయినా తెలుస్తోంది కదా! కనుక తెలుసుకోవడం అనేది నీలో ఉందా? లేదా? అది అక్కడ అంటున్నాడు. తెలుసుకోవడం అనేటటువంటిది నీకెలా వచ్చింది? చైతన్యం వల్లనే వచ్చింది కదా! అది ఇక్కడ చెప్తున్నారు.

అక్కడ 100 candles బల్బు వెలుగుతోంది. ఇక్కడ 0 candle బల్బు వెలుగుతోంది. అయితే ఇక్కడ ఆత్మతత్త్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోతే హిరణ్యకశిపుడులాగా మనం wrong conclussions కి వెళ్తున్నాం. అంతటా ఒకటే ఈశ్వరుడు. కనుక నేనే ఈశ్వరుడిని అన్న మాటకీ, అహం బ్రహ్మాస్మి అన్న మాటకి చాలా తేడా ఉంది ఇక్కడ. నేనే ఈశ్వరుడు అంటే దేహ, ప్రాణ, బుద్ధి ఈ ఉపాధులతో తన్మయం చెందిన 'నేను'ను ఊదిపారేస్తేనే కానీ ఈ 'నేను' తేలదు. ఆ'నేను'తో మమైకం చెందిపోయి నేనే ఈశ్వరుణ్ణి అంటే అది అహంకారమై, రాక్షసత్వమై పదిమంది చేత చావాల్సిన స్థితికి వెళ్తుంది. రెంటికీ అంత తేడా ఉంది. ఇది తెలియక చాలామంది అద్వైతాన్ని అర్థం చేసుకోలేక అచ్చం హిరణ్యకశిపుడి వలె అని విమర్శించిన దుర్మార్గం కూడా చేశారిక్కడ. దానిని సరిగ్గా తెలుసుకోలేక జరుగుతున్నది. ఇది మనం బాగా పరిశీలిస్తే zero watt బల్బుకి, 100 watt  బల్బుకి తేడా ఉంది. వెలగడంలో తేడా ఉంది.

కానీ దానిని వెలిగించే దీనిని వెలిగించే విద్యుత్ మాత్రం ఒక్కటే. అది నువ్వు తెలుసుకుంటే ఈ ఉపాధిగతమైన మమైకాన్ని విడిచిపెట్టి ఉపాధిగతమైన మమైకం అంటే కించిజ్ఞుడిని, నాకు అన్నీ limitations యే. నిజమే. ఈ limitations నాకు ఉన్నాయి అని ఎవడు అనుకుంటున్నాడో ఆ నేను అనేదానికి ఆధారమైన చైతన్యానికి limitation లేవు. కనుక దానితో నువ్వు తన్మయం చెందవయ్యా. అది తెలుసుకోవడానికై

బ్రహ్మాది స్తంభ పర్యంతా స్వ ప్రకల్ప ఇవ కల్పనా!

బ్రహ్మాది స్తంభ పర్యంతమూ ఈ స్వ ప్రకల్పమే నేను అనే దానితోనే కల్పించబడి ఉన్నదయ్యా.

సాక్షాత్ కృతేన అనవత్ ఛిన్న ప్రకాశే పరమాత్మనీ!

ఇదంతా కూడా అనవత్ ఛిన్నం – పరిమితి లేనటువంటి పరిచ్ఛిన్నత లేనటువంటి పరమాత్మయందు ప్రకాశం లభించినప్పుడు ఇది తెలుస్తున్నది. అందుకు శృతి వాక్యములు “అణోరణీయాన్ మహతో మహీయాన్ ఇతి వేదవాక్” ప్రతిదానికీ వేదం ప్రమాణం కదండీ మనకి. అందుకే గురువుగారు ఏంటంటే మన అహంకారం, మన బుద్ధికి తోచడం ఇవి ఎప్పుడూ ప్రమాణాలు కావండీ. మన బుద్ధికి ఇవాళ నిద్ర మత్తు వస్తే ఒకటి తోస్తుంది. నిద్రమత్తు వదిలితే మరొకటి తోస్తుంది. ఇవాళ ఒక పుస్తకం చదివితే ఒకటి తోస్తుంది. రేపు మరొక పుస్తకం చదివితే మరొకటి తోస్తుంది. కనుక స్వబుద్ధి ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రత్యక్షం అంతకంటే ప్రమాణం కాదు. ఎందుకంటే దానిని చూసేదీ నీ బుద్ధితోనే. కనుక ప్రమాణం ఏమిటంటే పరమేశ్వర స్వరూపమైన వేదమే ప్రమాణం. ప్రమాణం లేకపోతే ఎలా మాట్లాడతారండీ? ప్రతివాడు సృష్టిలో నాస్తికుడు కూడా రహస్యాలు తెలుసుకోనిది మాట్లాడుట. వాడూ ఏదో ఒక ప్రమాణాన్నే తీసుకున్నాడు. ఏదో ఒక ప్రమాణాన్ని తీసుకొని దానికి కట్టుబడి మాట్లాడతాడు. మరి ఇది దేనిని ప్రమాణం చేసుకుంది అంటే ఈశ్వర స్వరూపమైన వేదాన్ని ప్రమాణం తీసుకుంది. ఎందుకంటే అది ఇంద్రియాతీతమైన జ్ఞానం గురించి చెప్పింది కనుక ఇంద్రియబద్ధమైన బుద్ధి నిర్దేశించే సత్యముల కంటే ఇంద్రియాతీత సత్యాన్ని ఆవిష్కరించుకున్న ఋషి వాక్యములే మనకు ప్రమాణం. కనుక ఇది ‘వేదవాక్’

కామెంట్‌లు లేవు: