15, నవంబర్ 2020, ఆదివారం

శ్రీమద్భాగవతం -48🌷

 🕉శ్రీమద్భాగవతం -48🌷


.🌹 చిత్రకేతూపాఖ్యానం:


పూర్వకాలంలో చిత్రకేతువు అనబడే మహారాజుగారు ఉండేవారు. ఆయన శూరసేన దేశమును ఏలుతూ ఉండేవాడు. ఆయనకు అనేకమంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతువు రాజ్యపరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరం మనస్సులో ఒక్కటే శోకం. ఆయనకు సంతానం లేదు. ఆయన పెద్ద భార్య పేరు ‘కృతద్యుతి’. ఒకరోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చారు. ఆయన స్వాగతం పలికి అర్ఘ్యపాద్యారులు ఇచ్చాడు. అపుడు అంగీరస మహర్షి అన్నారు – ‘ఇంతమంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది. కానీ నీ ముఖంలో కాంతి లేదు. నీవు దేనిని గురించి బెంగ పెట్టుకున్నావు’ అని అడిగారు. అపుడు చిత్రకేతువు ‘మహానుభావా! మీరు త్రికాలజ్ఞులు. మీరు సర్వము తెలుసుకోగలరు’ అన్నాడు. అపుడు అంగీరస మహర్షి ‘నాకు అర్థం అయింది. నీకు పిల్లలు లేరు. అందుకు కదా బాధపడుతున్నావు. నీచేత పుత్రకామేష్టి చేయిస్తాను. నీకు బిడ్డలు కలుగుతారు’ అని పుత్రకామేష్టి చేయించి యజ్ఞ పాత్రలో మిగిలిపోయిన హవిస్సును నీ పెద్ద భార్యచేత తినిపించు. నీకు యోగ్యుడయిన కుమారుడు కలుగుతాడు. వాదివలన నీవు సుఖదుఃఖములు పొందుతావు’ అని చెప్పాడు. 

రాజు యజ్ఞపాత్ర తీసుకువెళ్ళి పెద్దభార్యకు ఇచ్చాడు. ఆవిడ దానిని స్వీకరించి గర్భాన్ని ధరించి ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంక రాజు పరవశించి పోయాడు. అర్బుదముల బంగారమును దానం చేశాడు. రాజ్యం అంతా సంతోషంగా ఉంది. ఒకరోజు రాత్రి పెద్ద భార్య కుమారుని పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. ‘మనకందరికీ పిల్లలు లేరు కాబట్టి రాజు ఇప్పటివరకు మనందరితోటి సమానంగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి పిల్లాడు పుట్టాడు కాబట్టి కృతద్యుతి మందిరానికే వెళుతున్నాడు. ఇప్పుడు ఆవిడకి ఈ ఆదరణ పోవాలంటే ఆ పిల్లవాడిని చంపేయాలి’ అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవానికి మెల్లగా విషాహారాన్ని పెట్టేశారు. మరునాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించి ఉన్నాడు. ఆ పిల్లవాని పాదముల వద్ద కూర్చుని తాను ప్రభువుననే విషయమును కూడా మర్చిపోయి ఏడుస్తున్నాడు. 

అపుడు అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదునితో కలిసి వచ్చారు. వారు వచ్చేసరికి రాజు ఏడుస్తున్నాడు. ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగీరస మహర్షిని మరచిపోయాడు. అపుడు అంగీరస మహర్షి ‘రాజా ఎందుకు ఏడుస్తునావు?’ అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి ‘కొడుకు చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాను’ అన్నాడు. అపుడు అంగీరసుడు ‘నువ్వు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా. నేను ఇంతకుపూర్వం నీకు కొడుకు పుట్టడం కోసం నీచేత యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు ఈ కొడుకు లేదు. అంతకుముందు నీకు కొడుకు లేనపుడు నీవు సుఖంగా ఉండేవాడివి. ఈ కొడుకు మధ్యలో వచ్చాడు. మధ్యలో వెళ్ళిపోయాడు. చిత్రకేతూ, మనుష్యుల జీవితముల ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఒక విషయం చెపుతాను. ‘ఈ శరీరమును చూసి అనేకమయిన అనుబంధములను పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు. కానీ లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుని ఒక్కనితోటే. అదిలేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడం లేదని సుఖదుఃఖకారణమైన కొడుకును నీకు ఇచ్చాను. ఇప్పుడు చూశావా – వాడే సుఖం, దుఃఖం ఇచ్చాడు. నీకు మాయయందు తగులుకునే స్వభావం ఉంది. దానివలన నీవు సుఖదుఃఖములను పొండుతున్నావు’. అపుడు నారదుడు ‘నాకొడుకు పోయాడు అని అంటున్నావు కదా. నీ కొడుకును బ్రతికిస్తాను. వరం ఇస్తాను. వాడు అంగీకరిస్తాడేమో చూద్దువు కాని. వాడిచేత మాట్లాడిస్తాను’ అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి తెచ్చాడు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీ శరీరమునకు తల్లిని, తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా నువ్వునీ శరీరము నందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయంతో సింహాసనమును అధిష్ఠించి నీవు కోరుకుంటే నీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు’ అన్నాడు. జీవుడు వెనక్కి వచ్చి ఇపుడు తండ్రివంక చూసి భ్రుకుటి ముడివేసి ‘నేను ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరమునకు వారు తల్లిదండ్రులు. నా కర్మ వల్ల నేను ఇప్పటికి ఎన్ని కోట్లమంది తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టానో! వాళ్ళలో వీరొకరు’. ఈమాట విని చిత్రకేతువు ఇంతవరకు వీడు నాకొడుకు నాకొడుకని అనుకున్నాను. ఇదా వీడు మాట్లాడడం అని వెనక్కి పడిపోయాడు. ఇప్పుడు చిత్రకేతుడు అసలు విషయం అర్థం చేసుకుని ‘ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. వాడు అలా మాట్లాడిన తరువాత నాకు తత్త్వం అంటే ఏమిటో తెలిసింది’ అన్నాడు. అపుడు అంగీరసుడు ‘వానికి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి రావలసింది. నీకొక మంత్రం చెపుతాను. ఈ శరీరం ఉండగా చేరవలసింది ఈశ్వరుడిని. అనుబంధముల మాయా స్వరూపం తెలుసుకొని ఈశ్వరుడి పాదములు పట్టుకో. నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ఉపదేశం చేత ఏడురాత్రులు ఈ మంత్రమును జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుంది’ అన్నారు. ఆయనను నమ్మి చిత్రకేతువు ఏడురాత్రులు, ఏడు పగళ్ళు జపం చేశాడు. అలా జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునే పాదపీఠియైన ఆదిశేషుడు దర్శనం ఇచ్చాడు. ఆయనను విశేషంగా స్తోత్రం చేశాడు. అలా సోత్రం చేస్తే ఆయన అన్నాడు –

ఆదిశేషుడు తన రూపమును భాసింప చేసి ‘నీటియందు బుడగపుట్టినట్లు ఆ బుడగకు అస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్లు బ్రహ్మము నందే నామరూపములయిన మాయచేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్త్వము అర్థమవడమే నా దర్శనం కలగడం. అందుకని ఇపుడు నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోయావు’ అన్నాడు. ఆయన ఇచ్చిన ఒకే ఒక వరం ఈయనపాలిటి శాపం అయి కూర్చుంది. అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చి ‘నీవు ఈ విమానంలో ఎక్కడికయినా విహరించు’ అని చెప్పి ఆయన తిరిగి సిద్ధ గణములతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే చిత్రకేతుడు ఆయనను స్తోత్రం చేసి తదుపరి విమానమును ఎక్కి అన్ని బ్రహ్మాండములు తిరుగుతూ యక్ష కాంతలతో హరికథలను నాటకములుగా ప్రదర్శనలు చేయిస్తూ లోపల పరమ భక్తి తత్పరుడై ఉండేవాడు. ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతమునకు వెళ్ళాడు. పార్వతీదేవి పెనిమిటి అయిన పరమశివుడు సభలో కూర్చుని వుండగా నాలుగు వేదములు పురుష రూపమును పొంది వాదించుకుంటున్నాయి. పరబ్రహ్మ తత్త్వం అంటే ఇలా ఉంటుందని అంటున్నారు కదా అంటే కాదు ఇలా ఉంటుంది అని వాదించు కుంటున్నాయి పరబ్రహ్మ తత్త్వాన్ని అర్థం చేసుకోలేక. బ్రహ్మగారు, సనక సనందనాది మహర్షులు అంజలి ఘటించి పరమశివా మాయందు నీ అనుగ్రహమును ప్రసరింపజేసి మాకు జ్ఞానమును ప్రసాదించమని అడుగుతున్నారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులను చూసి పొంగిపోయిన భ్రుంగి నాట్యం చేస్తున్నాడు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అంత పరమపవిత్రమయియన్ సభలోనికి చిత్రకేతువు తన విమానంలోంచి క్రిందకు దిగాడు. పార్వతే దేవిని ఎడమ తొడ మెడ కూర్చోపెట్టుకొని చేతితో గాఢాలింగనం చేసుకొని ఉన్నాడు పరమశివుడు. అది చూసి అమ్మవారు వినేటట్లుగా పెద్ద ధ్వనితో నవ్వాడు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్కసారి అటు తిరిగి చూశారు. 

చిత్రకేతువు పెద్ద నవ్వు నవ్వేసరికి పార్వతీ దేవి చూసి ‘నీవు ఎందుకు నవ్వుతున్నావు’ అని అడిగింది. అపుడు చిత్రకేతుడు అన్నాడు – ‘ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యను కౌగలించు కోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగలించుకుంటాడు. అంతేకానీ ఇంతమంది తాపసులు ఉన్న సభలో, బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనకసనందనాదులు నిలబడ్డ సభలో, సిగ్గులేకుండా ఆచార్యుడనని లోకానికి జ్ఞానమును ఇచ్చు వాడినని జగద్గురువు నని లోక రక్షకుడనని అనిపించుకు శర మంగళ ప్రదుడనని అనిపించుకున్న పరమశివుడు ఎడమ తొడమీద భార్యను కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా భార్యను గాఢాలింగనం చేసుకున్నాడు. ఆ మిథున రూపమును చూస్తే నవ్వు వస్తోంది. ఆయనకు కూడా యింత కామ వ్యామోహమా” అన్నాడు. అపుడు పార్వతీ దేవి ‘ఏమిరా ధూర్తుడా, కపిలుడు, భ్రుగువు, నారదుడు, బ్రహ్మ, సనక సనందనాదులు శివుని ముందు నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదములకు అంటుకున్న ధూళి మస్తకము మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము తగిలితే మంగళ తోరణమై నీ ఇంటిని పట్టుకుంటుందో, ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యములు జరుగుతాయో, ఎవరు లోపల ఉండడం చేత నీవు శివమై పదిమంది చేత నమస్కరింప బడుతున్నావో, ఏ శివము లోపలి నుంచి వెళ్ళిపోతే నీవు శవమై పోతావో, ఏ మహానుభావుడు లోకములన్నింటిని రక్ష చేస్తున్నాడో, ఎవరు తాను మహాత్యాగియై జ్ఞానిగా నిలబడ్డాడో అటువంటి పరమశివుని తూలనాడడానికి నీకు ఉన్న గొప్పతనం ఏపాటిది? ప్రకృతి పురుష తత్త్వమును తెలియక గుర్తెరుగక ఒక ప్రాకృతమయిన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్లు మాట్లాడావు. నీవు విష్ణు భక్తుడవని అనిపించుకుందుకు నీకు అర్హత లేదు. శివుని గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానేకాదు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తరక్షణం రాక్షస యోనియందు జన్మిస్తావు. కానీ నీవు చేసిన తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరెదవు గాక’ అని అనుగ్రహించింది. 

చిత్రకేతువు విమానంలోంచి క్రింది పడిపోయి తల్లి పాదముల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అన్నాడు ‘అమ్మా అనంతుని దర్శనం చేశాను. సంకర్షణుని దర్శనం చేశాను. కానీ ఎన్ని జన్మల నున్దియో చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయాయి. తల్లి నీ మ్రోలకు వచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను. ఇంత శాపమును పొందాను. నువ్వు శపించిన శాపం నన్ను ఉద్ధరించడానికేనని అనుకుంటున్నాను. అలాగే రాక్షసయోనియందు జన్మిస్తాను. నా అజ్ఞానము అక్కడితో తొలగుగాక’ అని నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ప్రణిపాతం చేసి లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. 

ఇది చూసి పరమశివుడు ‘పార్వతీ చూశావా ఇతను పరమభాక్తులు నీవు ఇంత శాపం ఇస్తే ఆటను కసుగందలేదు. నిజమయిన విష్ణుభక్తుడయినవాడికి అటువంటి సత్త్వగుణం కలగాలి. యితడు విష్ణు భక్తుడే. ఈ భక్తి వీనిని రక్షించి ఒకనాడు ఇంద్రసంహారం కొడం త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురునిగా పైకి వస్తాడు. వచ్చినా ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు. మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టి శ్రీమన్నారాయణుని చేరుకుంటాడు. తాను చేసుకున్న సుకృతము చేత అపారమయిన భక్తితో నిలబడిపోతాడు’ అన్నాడు. ఈ ఆఖ్యానము ఇంత పరమ పావనమయినది కాబట్టి ఇహమునందు వాళ్లకి ఏమయినా ప్రమాదము రావలసి వుంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా మూడు తరములు చూసి, సమస్త ఐశ్వర్యములు పొంది అంత్యమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి, మరల పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందుతారు. అటువంటి స్థితిని కటాక్షించ గలిగిన మహోత్కృష్టమయిన ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ.


సశేషం....

💥💥💥

కామెంట్‌లు లేవు: